
పీఎస్‌ఎల్‌వీ సీ46 ఉపగ్రహ వాహక నౌక
శ్రీహరికోట (సూళ్లూరుపేట): మరో అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమయ్యింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 5.57 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ46ను నింగిలోకి పంపనున్నారు. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రిశాట్–2బి) అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని భూమికి 555 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.
300 కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భూమి మీద జరిగే మార్పులను, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాణ్యమైన చిత్రాలను తీసి పంపే సామర్థ్యం కలిగి వుంది. సైనిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఇది రిశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో నాలుగవది. ఇప్పటికే రిశాట్–1, రిశాట్–2, స్కాట్‌శాట్–1 అనే మూడు ఉపగ్రహాలు విజయవంతంగా రోదసీలో పనిచేస్తున్నాయి. వీటితో అనుసంధానమై రిశాట్ 2బి భారత్‌కు అన్నివిధాలా ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు.