
ఇంతింతై వటుడింతై..
జూన్ 19, 1981... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బాలారిష్టాలు దాటుకుని తొలి విజయాలు అందుకుంటున్న సమయం అది.
అంచెలంచెలుగా ఎదిగిన ఇస్రో – దేశీయ పరిజ్ఞానమే పెట్టుబడి
జూన్ 19, 1981... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బాలారిష్టాలు దాటుకుని తొలి విజయాలు అందుకుంటున్న సమయం అది. దేశ వ్యాప్తంగా టెలివిజన్ ప్రసారాల కోసం ఉద్దేశించిన ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పెరిమెంట్ (ఆపిల్) ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రానికి తరలించాలి. విమానం దాకా తీసుకెళ్లేందుకు లోహాలేవీ లేని వాహనం అవసరం. అత్యాధునికమైన వాటిని దిగుమతి చేసుకుని వాడేంత స్థోమత లేదు. సొంతంగా తయారు చేసుకుందామా అంటే... 1974 నాటి అణు పరీక్షల కారణంగా అగ్రరాజ్యాల ఆంక్షలు అనుమతించవు. ఆ సమయంలో సింపుల్‌గా ఓ ఎడ్ల బండిపై ఉపగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు.
సెప్టెంబరు 24, 2014... ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిన రోజిది. రెండు రోజుల ముందు అగ్రరాజ్యం అమెరికా ప్రయోగించిన మావెన్ కూడా కక్ష్యలోకి చేరింది. ఇస్రో నిర్మించిన మంగళ్‌యాన్ కేవలం రూ.450 కోట్లతో అంతదూరాన్ని అధిగమిస్తే... మావెన్ ఇందుకోసం తొమ్మిది రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారక గ్రహాన్ని అందుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది కూడా ఈరోజే.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ పరంపరలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించడం తాజా ఘట్టం. ఇది అపురూపమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమితమైన వనరులు, కీలకమైన టెక్నాలజీపై ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాలను సుసాధ్యం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది బడ్జెట్‌నే ఉదాహరణగా తీసుకుంటే భారత్ తన అంతరిక్ష కార్యక్రమాల కోసం పెట్టే ఖర్చు కేవలం వందకోట్ల డాలర్లు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా చేసే వ్యయం 1930 కోట్ల డాలర్లు! ఇంకోవైపు ఇస్రోలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. శాస్త్రవేత్తల వేతనాలు కూడా గొప్పగా ఏమీ లేవు. అయినా ఇస్రో ఇన్ని అద్భుతమైన విజయాలు సాధించగలుగుతోంది అంటే అందుకు కారణం దేశం కోసం ఏమైనా చేయాలి అన్న దృఢ సంకల్పం మాత్రమే.
తెలివే పెట్టుబడి
అంతరిక్ష ప్రయోగాల ఖర్చును వీలైనంత వరకూ తగ్గించేందుకు ఇస్రో తెలివినే పెట్టుబడిగా పెట్టింది. మంగళ్‌యాన్ ప్రయోగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. దీంట్లో ఇంధన ఖర్చును తగ్గించేందుకు ఎప్పుడో 1993లో వాడిన ఓ చిన్న రాకెట్‌ను ఇందులో ఉపయోగించింది. ఇతర దేశాల మాదిరిగా అనేక మోడళ్లను తయారు చేయకుండా ఒకే ఒక్క మోడల్‌ను తయారు చేసి దాన్నే ప్రయోగించింది. మునుపు ఎన్నడూ ఎవరూ ఉపయోగించని స్లింగ్ షాట్ పద్ధతిని ఉపయోగించింది. పొలాల్లో పక్షులను పారదోలేందుకు వాడే వడిసె గురించి తెలుసుగా... ఈ స్లింగ్ షాట్ పద్ధతి కూడా అలాంటిదే.
ఎలాగైతే మనం వడిసెలో రాయిని పెట్టి గిర్రున తిప్పుతూ తగిన వేగం అందుకోగానే విసిరేస్తామో... అలాగే ఓ రాకెట్‌ను భూమిచుట్టూ కొన్నిసార్లు తిప్పి.. అంగారక గ్రహం మనకు అత్యంత దగ్గరగా వచ్చే సమయానికి దానివైపు విసిరేశామన్నమాట. తద్వారా అంగారకుడిపైకి నేరుగా వెళ్లేందుకు భారీ సైజున్న రాకెట్‌ను ఉపయోగించాల్సిన అవసరాన్ని తప్పించింది ఇస్రో. మంగళ్‌యాన్‌లో వాడిన విడిభాగాల్లో దాదాపు 60% లార్సెన్ అండ్ టూబ్రో, గోద్రేజ్ అండ్ బాయ్‌సీ వంటి దేశీయ కంపెనీలే తయారు చేశాయి.
ఒకేసారి 104 ఉపగ్రహాలు
బుధవారం ఇస్రో పీఎస్‌ఎల్వీ సీ– 37 ద్వారా ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడం భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయి. ఈ సంక్లిష్టమైన, కీలకమైన ప్రక్రియ మొత్తం ఎలా జరిగిందో కళ్లారా చూడాలనుకుంటే.. ఇస్రో వెబ్‌సైట్‌లోని ఆన్‌బోర్డ్ కెమెరా రికార్డింగ్‌ను (http://www.isro.gov.in/pslv&c37&cartosat&2&series&satellite/pslv&c37&lift&and&onboard&camera& video) చూడవచ్చు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్