ఒకేసారి 20 ఉపగ్రహాలు | 20 satellites simultaneously | Sakshi
Sakshi News home page

ఒకేసారి 20 ఉపగ్రహాలు

Published Thu, Jun 23 2016 3:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

ఒకేసారి 20 ఉపగ్రహాలు

ఒకేసారి 20 ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో కక్ష్యలోకి  అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర
 
- విజయవంతంగా20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో
పీఎస్‌ఎల్‌వీ సీ-34 రాకెట్‌తో 26 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి
- భారత్‌కు చెందిన మూడు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు
- కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూమి వినియోగం, నీటి పంపిణీ తదితర రంగాల్లో సేవలు
- రాష్ట్రపతి, ప్రధాని, సోనియా తదితర ప్రముఖుల అభినందనలు
 
 శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను బుధవారం విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం) ఇందుకు వేదికయింది. షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఉదయం 9:26 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ34) ఉపగ్రహ వాహక నౌక ద్వారా.. 17 విదేశీ ఉపగ్రహాలతో సహా మొత్తం 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కేవలం 26 నిమిషాల వ్యవధిలోనే కొత్త తరం భూ పరిశీలన ఉపగ్రహం (కార్టోశాట్-2 శ్రేణి)తో పాటు మరో 19 ఉపగ్రహాలను నిర్దేశిత సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒక కేజీ బరువున్న ఉపగ్రహాల నుంచి 700 కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. మొత్తం 20 ఉపగ్రహాల బరువు దాదాపు 1,288 కిలోలు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రయోగంతో వేల కోట్ల అంతరిక్ష ప్రయోగాల మార్కెట్‌లో భారత్ కీలక దేశంగా అవతరించింది.

  ఇస్రో ప్రయోగించిన 20 ఉపగ్రహాల్లో 13 అమెరికాకు చెందినవి కావటం విశేషం. అందులోనూ 12 ఉపగ్రహాలు భూమిని చిత్రీకరించే డవ్ శాటిలైట్లు. ఒక్కొక్కటి 4.7 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలు ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థకు చెందినవి. మరొకటి గూగుల్ యాజమాన్యంలోని ఒక సంస్థకు చెందిన స్కైశాట్ జెన్-2 ఉపగ్రహం. దాని బరువు 110 కిలోలు. ఇవిగాక.. కెనడాకు చెందిన రెండు ఉపగ్రహాలు, జర్మనీ, ఇండోనేసియా దేశాల నుంచి ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి.  కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహం బరువు 727.5 కిలోలు. ఇది సాధారణ రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది. ఇందులో వ్యూహాత్మక అప్లికేషన్లు కూడా ఉన్నాయి.

పట్టణ, గ్రామీణ అప్లికేషన్లు, తీర భూమి వినియోగం, నియంత్రణ, రోడ్ల వ్యవస్థ పర్యవేక్షణ, నీటి పంపిణీ వంటి వినియోగ నిర్వహణ తదితరాలకు కూడా దీనిని వినియోగిస్తారు. భూ వినియోగ మ్యాపుల రూపకల్పన, కచ్చితమైన అధ్యయనం, భౌగోళిక, మానవ కల్పిత లక్షణాల మార్పును గుర్తించటం, వివిధ ఇతర భూ సమాచార వ్యవస్థ, భౌగోళిక సమాచార వ్యవస్థ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ప్రయోగించిన.. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి చెందిన సత్యభామశాట్, పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన స్వయం ఉపగ్రహం భారతదేశానికి చెందినవి. కిలో కన్నా తక్కువ బరువున్న స్వయం ఉపగ్రహాన్ని ఈ కాలేజీ విద్యార్థులు 170 మంది కలిసి రూపొందించారు. మారుమూల ప్రదేశాల్లోనూ సమాచార సంబంధాల కోసం ఉద్దేశించినది.

 ఇంతకుముందు ఇస్రో 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పటివరకూ ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన రికార్డు రష్యాకు చెందుతుంది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. అమెరికాకు చెందిన నాసా అత్యధికంగా ఒకేసారి 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది.
 
 కొత్త మైలురాళ్లు దాటుతోంది
ఈ ప్రయోగం విజయవంతమవటం పట్ల ఇస్రోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యం పెరుగుతోందని ప్రణబ్ అన్నారు. మోదీ స్పందిస్తూ..  ‘ఒకేసారి 20 ఉపగ్రహాలు. కొత్త మైలురాళ్లను అధిగమించటాన్ని ఇస్రో కొనసాగిస్తోంది. మనం అంతరిక్ష కార్యక్రమాల్లో ఇతర దేశాలకు సహాయపడే నైపుణ్యతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం’ అని ట్వీట్ చేశారు.  ఇస్రోను కేంద్ర కేబినెట్ కూడా అభినందించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు.

 జగన్ అభినందనలు
 ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయ పూర్వకంగా అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ ప్రపంచంలోని బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే అగ్ర దేశాల సరసన నిలిచిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  
 
 ప్రయోగ క్రమం ఇలా..
► ఉదయం 9.25కు ప్రయోగం ప్రారంభం
► ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనంతో 108 సెకన్లకు మొదటిదశ పూర్తి
► 42 టన్నుల ద్రవ ఇంధనంతో 260  సెకన్లకు రెండో దశ పూర్తి
►7.6 టన్నుల ఘన ఇంధనంతో 491  సెకన్లకు మూడో దశ
► 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 987 సెకన్లకు నాలుగో దశ
► ముందుగా ఇస్రో కార్టోశాట్-2ను 17.07 నిమిషాలకు భూమికి 508 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశం
►17.42 నిమిషాలకు చెన్నై, పుణేలోని వర్సిటీ విద్యార్థుల సత్యభామశాట్, స్వయంశాట్ ఉపగ్రహాలు కక్ష్యలోకి..
►18.23 నిమిషాలకు ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్ ఉపగ్రహాలు కక్ష్యలోకి
►19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3 ఎంశాట్, యూఎస్‌ఏ గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్‌జెన్‌లు కక్ష్యలోకి..
►19.22 నిమిషాలకు కెనడా జీహెచ్‌బీశాట్
► 26.20 నిమిషాలకు యూఎస్‌ఏకు చెందిన 12 డవ్ శాటిలైట్స్..
►మొత్తం 26.30 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్
►ప్రయోగం తర్వాత భవిష్యత్ పరీక్షల కోసం ప్రయోగాత్మకంగా 4వ దశలోని ఇంజిన్లను మండించి మరో ఆరు నిమిషాల పాటు పీఎస్-4ను పరీక్షించి విజయం సాధించారు.
 
 వ్యయం తగ్గిస్తాం: ఇస్రో చైర్మన్
 ‘‘ఒకే పేలోడ్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించటం.. పక్షులను గాలిలోకి ఎగురవేయటం వంటిది’’ అని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.  ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఏడాదికి 12-18కి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పరిశ్రమలు - ఇస్రో భాగస్వామ్యంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో వ్యయాన్ని తగ్గించే దిశగా తమ కృషి కొనసాగుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోగా సౌత్ ఈస్ట్ ఏసియన్ ఉపగ్రహాన్ని (గతంలో సార్క్ ఉపగ్రహం) ప్రయోగించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు.

తాజా ప్రయోగంలో సూర్యానువర్తన కక్ష్యలోకి వివిధ రకాల ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు నాలుగోదశ (పీఎస్-04)లో ఆరు నిమిషాల పాటు చేసిన ప్రయోగాత్మక పరీక్షలో సఫలమయ్యామన్నారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ 35వ వరుస విజయవంతమైన కార్యక్రమాల్లో తాజా ప్రయోగం భారీ విజయమని షార్ డెరైక్టర్ పి.కున్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇస్రోకు, భారత్‌కు పీఎస్‌ఎల్‌వీ ఒక చిహ్నంగా నిలిచిందని అభివర్ణించారు. ఈ విజయం ఒక ప్రధాన మైలురాయి అని మిషన్ డెరైక్టర్ డి. జయకుమార్ చెప్పారు.  కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహం ద్వారా గ్రామీణ, పట్టణాభివృద్ధి, సమాచార వ్యవస్థ, కొత్త ప్రాంతాల్లో నిర్దిష్ట వ్యవసాయం వంటి పలు రంగాల్లో సామర్థ్యం పెరుగుతుందని ఆ ప్రాజెక్ట్ డెరైక్టర్ సత్యానంద్ రావు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement