ఒక రాకెట్‌.. 103 ఉపగ్రహాలు | ISRO launch miracle Experiment in the first week of February | Sakshi
Sakshi News home page

ఒక రాకెట్‌.. 103 ఉపగ్రహాలు

Published Wed, Jan 18 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

ఒక రాకెట్‌.. 103 ఉపగ్రహాలు

ఒక రాకెట్‌.. 103 ఉపగ్రహాలు

  • ఫిబ్రవరి మొదటివారంలో ప్రయోగం
  • అద్భుతాన్ని ఆవిష్కరించనున్న ఇస్రో  
  • శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నద్ధమవుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను ఫిబ్రవరి మొదటివారంలో రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేశ్‌ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. 103 ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయాన్ని సమావేశంలో అంతర్గతంగా ప్రకటించినట్టు సమాచారం.

    దేశీయంగా కార్టోశాట్‌–2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్న విషయాన్ని ప్రకటించారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్‌ అనుసంధానం పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనుల్ని పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేయాలని సమావేశంలో సూచించినట్టు తెలిసింది.

    అత్యధిక ఉపగ్రహాలు పంపే మొదటి దేశంగా భారత్‌!
    ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అత్యధికంగా 103 ఉపగ్రహాలను ఒకే రాకెట్‌ ద్వారా పంపబోయే మొట్టమొదటి దేశంగా భారతదేశం ముందువరుసలో నిలవనుంది. ఇప్పటికే 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలు, 2016లో 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్రను తిరగరాసింది. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాలుగా రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. 2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపించి మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా ఇస్రో 20 ఉపగ్రహాలను పంపించిన మూడో దేశంగా నిలిచింది. ఫిబ్రవరి మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 103 ఉపగ్రహాలు ప్రయోగం అనంతరం ఒకే దఫాలో అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొట్టమొదటి దేశంగా భారత్‌ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement