
500 ఉపగ్రహాలు.. అన్నింటిలోనూ హైడెఫినెషన్ కెమెరాలు.. భూమిపై ప్రతి చోటినీ గమనించగలిగేలా ఏర్పాట్లు.. ఎక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతూంటుంది! ఏ పొలంలో పంట చెడిపోయిందో.. ఏ అడవిలో కార్చిచ్చు చెలరేగిందో స్మార్ట్ ఫోన్‌లోనే చూసుకోవచ్చు.. ఇదంతా లైవ్ సినిమా. నిత్యం నడుస్తూనే ఉండే సినిమా. క్లుప్తంగా చెప్పాలంటే.. భూమి మొత్తం ఎప్పటికప్పుడు మనకు లైవ్‌లో అందుబాటులో ఉంటుందన్నమాట! అపర కుబేరుడు బిల్‌గేట్స్ దీనికోసం వంద కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు.
భూమిని చిత్రీకరించడం ఏమిటి..? అది ఎప్పటికప్పుడు.. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్‌ఫోన్‌లో కనిపించడం ఏమిటి?.. ఇందుకు బిల్‌గేట్స్ బోలెడంత డబ్బు ఖర్చు చేయడం ఏమిటి?.. అంతా అయోమయం అనుకుంటున్నారేమో.. కొన్నేళ్లలో వాస్తవ రూపం దాల్చబోయే అంశమిది.
భూమి చుట్టూ ఓ 500 ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రతి అంగుళాన్ని హైడెఫినెషన్ వీడియోలో బంధించాలని.. దానిని భూమ్మీద అందరికీ అందుబాటులో ఉంచాలని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘ఎర్త్ నౌ’ప్రణాళిక రూపొందించింది. రస్సెల్ హానిగన్ అనే టెకీ గతేడాది ఈ కంపెనీని స్థాపించారు. ఈ ఏడాది జనవరి నాటికల్లా తొలి రౌండ్ నిధుల సేకరణ కూడా పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావించిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్.. వంద కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రఖ్యాత ఎయిర్‌బస్, సాఫ్ట్‌బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సై అనేశాయి.
సెకను తేడాతో అందరికీ...
ఎర్త్ నౌ ప్రాజెక్టు ద్వారా భూమ్మీద ఉన్న ఏ ప్రాంతాన్ని అయినా మనం లైవ్‌లో చూడొచ్చు. కేవలం ఒకే ఒక్క సెకను తేడాతో ఈ లైవ్ వీడియో అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీడియో దృశ్యాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జీపీఎస్ ఉపగ్రహాలతో భూమ్మీద వివిధ ప్రాంతాల లొకేషన్ సమాచారం ఎప్పటికప్పుడు ఎలా లభిస్తుందో.. అలా ‘ఎర్త్ నౌ’ప్రాజెక్టుతో భూమ్మీది వివిధ ప్రాంతాల వీడియోలు కూడా ఎప్పటికప్పడు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రతి ఉపగ్రహంలోనూ అత్యధిక ప్రాసిసింగ్ సామర్థ్యంతో కంప్యూటర్లు.. అన్ని ఉపగ్రహాల మధ్య నెట్‌వర్క్ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీని రస్సెల్ 2014 – 17 మధ్యకాలంలో అభివృద్ధి చేశారు. ఎయిర్‌బస్ కంపెనీ మొత్తం 500 ఉపగ్రహాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. దశలవారీగా వీటిని నిర్దేశిత కక్ష్యలోకి చేరుస్తారు.
జూమ్ చేసుకునీ చూడొచ్చు
‘ఎర్త్ నౌ’నెట్‌వర్క్‌లో ప్రధానంగా రెండు రకాల వీడియోలు ఉంటాయి. ‘గ్లోబల్ వ్యూ ఇమేజర్’భూమి మొత్తం తాలూకూ స్థిరమైన దృశ్యాన్ని అందిస్తూంటుంది. అదే సమయంలో ‘స్పాట్ వ్యూ ఇమేజర్’ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన ప్రాంతం తాలూకు వీడియోను జూమ్ చేసి తీసుకోవచ్చు. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోల రెజల్యూషన్‌ను కాస్త తక్కువగా ఉంచాలని భావిస్తున్నారు. ఇక రాత్రివేళల్లో కృత్రిమ దీపాల వెలుగుతో కూడిన అన్ని ప్రాంతాల వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలను నిర్దిష్ట వ్యక్తులు, కంపెనీలకు అమ్ముకోవడం ద్వారా ‘ఎర్త్ నౌ’ఆదాయం సమకూర్చుకుంటుంది. అదే సమయంలో సామాన్యులందరికీ స్మార్ట్‌ఫోన్ ద్వారా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎవరికి ఉపయోగం?
‘ఎర్త్ నౌ’ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయని కంపెనీ చెబుతోంది. సముద్ర ప్రాంతాల్లో చెలరేగే తుపానులు, హరికేన్లను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని.. కార్చిచ్చులను తొలిదశలోనే గుర్తించి ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చని రస్సెల్ హానిగన్ అంటున్నారు. ఇక అగ్ని పర్వతాలను నిత్యం పరిశీలిస్తూ.. పేలిపోయిన మరుక్షణమే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయవచ్చని.. తిమింగలాల వంటి భారీ సముద్రజీవులు ఎటువైపు కదులుతున్నాయో గుర్తించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంటపొలాల్లో వచ్చే మార్పులను గమనించవచ్చని.. చీడపీడల బెడద మొదలైనప్పుడు తగిన రక్షణ చర్యలకు సూచనలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక నగరాలకు త్రీడీ మోడళ్లను తయారు చేయగలగడం మరో ఉపయోగమని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment