Fact Check: Is World Will End In 2021 March Due To Asteroid Hitting Earth? - Sakshi
Sakshi News home page

Fact Check: మార్చిలో మరో యుగాంతం!

Published Thu, Feb 11 2021 2:31 AM | Last Updated on Thu, Feb 11 2021 3:35 PM

World Will End In March 2021 Rumours Spread - Sakshi

వాషింగ్టన్‌: భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది.

మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్‌(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్‌ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్‌(పేరు:2001 ఎఫ్‌ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్‌ పలు ఎన్‌ఈఓ(నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు.  

ఇలాంటివి అనేకం.. 
భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను ఎన్‌ఈఓలు అంటారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్‌ఈఓలను గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్‌ కాగా కొన్ని మాత్రం తోకచుక్కలు. ఈ 25వేల ఎన్‌ఈఓల్లో 2100 ఎన్‌ఈఓలను పొటన్షియల్లీ హజార్డియస్‌(ప్రమాదం కలిగించే శక్తి కలవి)గా వర్గీకరించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. అంతమాత్రాన ఇవన్నీ భూమిని తాకుతాయని కాదని, కానీ వీటిని పరిశీలిస్తూ ఉంటామని సెంటర్‌ ఫర్‌ ఎన్‌ఈఓ డైరెక్టర్‌ పాల్‌ చోడస్‌ చెప్పారు.

ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్‌ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని చెప్పారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఆస్టరాయిడ్‌ గంటకు 76,980 మైళ్ల వేగంతో పయనిస్తుంటుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దోవలో తను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్‌ తెలిపారు. కాబట్టి.. యుగాంతం జాతకాలు చెప్పేవాళ్లు ఇంకో కొత్త సంగతి చూసుకోవాల్సిందే!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement