త్వరలో భూ కక్ష్యలోకి బుల్లి గ్రహశకలం
రెణ్నెల్లపాటు భూమి చుట్టూ చక్కర్లు
ఇప్పటిదాకా అది కేవలం ఒక అంతరిక్ష శిలే. కానీ త్వరలో ఓ రెండు నెలల పాటు తాత్కాలికంగా ‘చందమామ’ హోదా పొందనుంది! ఎవరా బుల్లి చంద్రుడు? ఏమిటా విశేషాలు? చూద్దాం రండి...
భూ కక్ష్యను సమీపిస్తున్న ఒక బుల్లి గ్రహశకలాన్ని సైంటిస్టులు తాజాగా గమనించారు. అది ఇంకొద్ది రోజుల్లో తాత్కాలికంగా భూమ్యాకర్షణ శక్తికి లోనవనుంది. సెప్టెంబర్ 29 నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశించి మన గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలు పెడుతుంది. దాని చక్కర్లు నవంబర్ 25 దాకా కొనసాగుతాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు వివరించారు. ఆ మీదట తిరిగి సౌర కక్ష్యలోకి ప్రవేశించి ఎప్పట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
దక్షిణాఫ్రికాలోని నాసా అబ్జర్వేటరీ ద్వారా సైంటిస్టులు దీన్ని గత ఆగస్టు 7న గమనించారు. దీని వ్యాసం 37 అడుగులని అంచనా వేసినా 16 నుంచి 138 అడుగుల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బుల్లి తాత్కాలిక చంద్రున్ని 2024పీటీ5గా పిలుస్తున్నారు. భూ కక్ష్యలోకి దాని రాకపోకలను గురించిన సమాచారం అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాజా సంచికలో ప్రచురితమైంది.
ఆ ప్రమాదమేమీ లేనట్టే...
65 అడుగుల వ్యాసంతో కూడిన ఇలాంటి గ్రహశకలమే ఒకటి 2013లో పెద్ద భయోత్పాతమే సృష్టించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలో చెలియాబిన్‌స్క్ ప్రాంతంలో ఒక్క ఉదుటున పేలిపోయింది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోíÙమాపై ప్రయోగించిన తొలి అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తిని, సూర్యున్ని తలదన్నేంతటి ప్రకాశాన్ని విడుదల చేసింది. దాని తాలూకు శకలాలు శరవేగంగా వచ్చి పడటంతో చెలియాబిన్‌స్‌్కలో ఏకంగా 7,000 పై చిలుకు భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. 1,000 మందికి పైగా గాయపడ్డారు.
కానీ 29న భూ కక్ష్యలోకి ప్రవేశించనున్న 2024పీటీ5తో మాత్రం ప్రస్తుతం గానీ, కొద్ది దశాబ్దాల తర్వాత గానీ అలాంటి ముప్పేమీ ఉండబోదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. నవంబర్ 25న మన కక్ష్యను వీడిన మీదట అది చూస్తుండగానే భూమికి 42 లక్షల కిలోమీటర్ల దూరానికి లంఘించి సౌర కక్ష్యలోకి వెళ్లిపోనుందట. అనంతరం మళ్లీ 2055లో, ఆ తర్వాత 2084లోనూ ఈ బుల్లి జాబిల్లి భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందట. ఆ రెండుసార్లూ కొద్ది రోజుల పాటు మాత్రమే చక్కర్లు కొట్టి తన మాతృ కక్ష్యలోకి వెళ్లిపోతుందని సైంటిస్టులు వివరించారు.
ప్రతి పదేళ్లలో ఒకట్రెండుసార్లు...
ఇలాంటి బుల్లి చంద్రులు భూమిని పలకరించడం అరుదేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో 2020సీడీ3 అనే గ్రహశకలం ఇలాగే రెండు నెలల పాటు భూ కక్ష్యలోకి చొచ్చుకొచి్చంది. రెండు నెలల పాటు ప్రదక్షిణం చేసిన మీదట గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. దశాబ్దానికి రెండు మూడుసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. కొద్ది రోజులు, వారాలు, మహా అయితే ఒకట్రెండు నెలలు కక్ష్యలో ప్రయాణించిన మీదట అవిఇలా పలాయనం చిత్తగిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం భూ కక్ష్యలోకి వచ్చిన మీదట కనీసం ఒకట్రెండు ప్రదక్షిణలైనా పూర్తి చేస్తాయి.
అంటే ఒకట్రెండేళ్లపాటు భూ కక్ష్యలోనే కొనసాగుతాయి. అయితే ఇలాంటి ఉదంతాలు అరుదు. మహా అయితే 10 నుంచి 20 ఏళ్లలో ఒకసారి జరిగితే గొప్పే. అయితే, ‘‘ఏ సమయంలో చూసినా భూ కక్ష్యలో అత్యంత చిన్న గ్రహశకలాలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి మరీ పళ్లాలంత చిన్నవిగా ఉంటాయి గనుక వాటి ఉనికిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం’’ అని సౌరవ్యవస్థ నిపుణుడు రాబర్ట్ జేడిక్ తెలిపారు. అంతేకాదు, ‘‘2024పీటీ5 కనీసం 10 మీటర్ల కంటే పొడవుంటుందని దాదాపుగా తేలిపోయింది. కనుక ఇప్పటిదాకా సైంటిస్టుల దృష్టికి వచి్చన ‘తాత్కాలిక చందమామ’ల్లో ఇదే అతి పెద్దది’’ అని వివరించారు.
అంత ఈజీ కాదు...
గ్రహశకలాలు ఇలా తాత్కాలికంగా ఉపగ్రహం అవతారమెత్తడం అంత సులువు కాదు. అందుకు చాలా విషయాలు కలిసి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా భూమ్యాకర్షణ శక్తికి ఆకర్షితమయ్యేందుకు అవసరమైనంత వేగంతో, అవసరమైన దిశలో ప్రయాణిస్తూ ఉండాలి. అంతేగాక భూ కక్ష్యకు దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం కాస్త నెమ్మదిస్తూ రావాలి. ఇవన్నీ జరిగితే సదరు గ్రహశకలం దాని పరిమాణం, బరువుతో నిమిత్త లేకుండా భూ కక్ష్యలోకి వచ్చేస్తుంది. సాధారణంగా గంటకు 3,600 కి.మీ. వేగంతో భూమికి 45 లక్షల కిలోమీటర్ల భూమి సమీపానికి వచ్చే గ్రహశకలాలు ఇలా భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంటాయి.
‘అర్జున’ పథం నుంచి...
తాజాగా మనల్ని పలకరించనున్న 2024పీటీ5 గ్రహశకలం ఎక్కణ్నుంచి వస్తోందో తెలుసా? ‘అర్జున’ గ్రహశకల పథం నుంచి! అది అసంఖ్యాకమైన బుల్లి బుల్లి గ్రహశకలాలకు నిలయం. భూమి మాదిరిగానే అవి కూడా సూర్యుని చుట్టూ తమ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. ఇవేగాక అంగారకునికి, బృహస్పతికి మధ్యనుండే ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బుల్లి చంద్రులు వచ్చి భూమిని పలకరిస్తుంటాయి. 2024పీటీ5ను నిశితంగా పరిశీలించి వీలైనంత విస్తారంగా డేటాను సేకరించేందుకు సైంటిస్టులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలో ఉన్న రెండు భారీ టెలిస్కోపులను రెండు నెలల పాటు పూర్తిగా ఈ పని మీదే ఉండనున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment