ఐదేళ్ల తర్వాత భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే చాన్స్: ఎస్.సోమ్‌నాథ్
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది.
1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు.
370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి.
భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment