తాను తయారుచేసిన ఉపగ్రహంతో కూరపాటి సాయి దివ్య
తెనాలి: వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేయడంతోపాటు దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య. ఉపగ్రహ కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న ఆమె తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు అందరి అభినందనలు అందుకుంటున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు.
తన పీహెచ్‌డీ థీసిస్‌లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు.
యూకే నుంచి ప్రయోగం..
గత నెల 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణంలో దాదాపు మూడు గంటలపాటు ఉందని సాయి దివ్య గురువారం తెనాలిలో మీడియాకు వివరించారు. లక్ష్య శాట్‌లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయవంతమైందని తెలిపారు.
అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించానని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నానని వివరించారు. తెనాలిలో తాను నెలకొల్పిన ఎన్–స్పేస్ టెక్ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను అందుబాటులోకి తెస్తానన్నారు. లక్ష్య శాట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు నగజశ్రీ,, ప్రసాద్, భర్త కొత్తమాసు రఘురామ్ ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment