sai divya
-
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
బుల్లి ఉపగ్రహం.. భళా!
తెనాలి: వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేయడంతోపాటు దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య. ఉపగ్రహ కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆమె తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు అందరి అభినందనలు అందుకుంటున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన పీహెచ్డీ థీసిస్‌లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. యూకే నుంచి ప్రయోగం.. గత నెల 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణంలో దాదాపు మూడు గంటలపాటు ఉందని సాయి దివ్య గురువారం తెనాలిలో మీడియాకు వివరించారు. లక్ష్య శాట్‌లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించానని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నానని వివరించారు. తెనాలిలో తాను నెలకొల్పిన ఎన్–స్పేస్ టెక్ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను అందుబాటులోకి తెస్తానన్నారు. లక్ష్య శాట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు నగజశ్రీ,, ప్రసాద్, భర్త కొత్తమాసు రఘురామ్ ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారని తెలిపారు. -
సైక్లింగ్ చాంప్స్ అఖిల్, సాయి దివ్య
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో అఖిల్, సాయి దివ్య విజేతలుగా నిలిచారు. సంఘి నగర్‌లోని కమలా రాణి స్కూల్లో బుధవారం జరిగిన ఈ పోటీల్లో అండర్-18 బాలుర విభాగంలో అఖిల్ గెలుపొందగా, గంగాధర్, రజనీకాంత్ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. బాలికల కేటగిరీలో సాయి దివ్య, జ్యోత్ల, పల్లవి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్-16 బాలుర విభాగంలో రాకేశ్ విజేతగా నిలువగా, సాయి కుమార్‌కు రెండో స్థానం, రాజుకు మూడో స్థానం లభించాయి. బాలికల్లో రేష్మ గెలుపొందగా, సంగీత, శిరీష వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. అండర్-14 బాలుర విభాగంలో ప్రణయ్ నెగ్గగా, రిషీంద్ర, జీవన్ రెండు, మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో శిరీష విజేతగా నిలిచింది. చాందినికి రెండు, సుప్రియా కుమారికి మూడో స్థానం దక్కాయి. వీరంతా రాష్ట్ర స్థాయి సైక్లింగ్పోటీల్లో తలపడే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. రేపటి (శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు వరంగల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయి. అంతకుముందు స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రంగారెడ్డి జిల్లా సైక్లింగ్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.