అంతరిక్షంలో ట్వంటీ ట్వంటీ
రికార్డుల ‘కోట’...
- మొట్ట మొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాల ప్రయోగం
- 26 ఉపగ్రహాల ప్రయోగంతో అమెరికా మొదటి స్థానం
- 22 ఉపగ్రహాలతో రష్యా ద్వితీయం.. తృతీయస్థానంలో నిలువనున్న భారత్
- దేశ కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేస్తోన్న శ్రీహరికోట
- ఉపగ్రహ ప్రయోగాలతో అంచెలంచెలుగా ఎదుగుతున్న షార్
- ఐదు దశాబ్దాల్లో 89 ఉపగ్రహాల ప్రయోగాలు దిగ్విజయం
- వాణిజ్య ప్రయోగాల్లో దూసుకెళ్తూ.. అర్ధసెంచరీకి పైగా విజయాలు
శ్రీహరికోట... ఆకాశవీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే జగద్విదితం చేసిన రికార్డుల కోట.. మరో కీర్తి శిఖరాన్ని చేరుకోబోతోంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించబోతోంది. ప్రపంచంలో ఇదివరకే 26 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి అమెరికా తొలిస్థానంలో ఉండగా, 22 ఉపగ్రహాల ప్రయోగంతో రష్యా రెండో స్థానంలో ఉంది. తాజాగా 20 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ మనదేశం మూడోస్థానంలో నిలవబోతోంది. వాణిజ్యపరంగా నాలుగు దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుండటంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీ సీ-34 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఎంఆర్‌ఆర్ సమావేశం జరగనుంది. రేపు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో ఐదు దశాబ్దాల ఇస్రో గమనం, నిర్వహించిన ప్రయోగాలు, వాణిజ్య ప్రయోగాలు, ప్రస్థానంపై ఫోకస్.
- మొలకల రమణయ్య, సాక్షి, సూళ్లూరుపేట
శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తరువాత చిన్నపాటి లాంచ్‌ప్యాడ్‌ల మీద ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను ప్రయోగించారు. చిన్న చిన్న ప్రయోగాల్లో రాటుదేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగవేదికను నిర్మించారు. దీనిపై 1990 నుంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తరువాత భవిష్యత్తులో అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు.
ప్రయోగవేదికల తీరు ఇలా..
► షార్‌లో నిర్మించిన మొదటి ప్రయోగవేదికకు సంబంధించి మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్‌టీ)ని రాకెట్ ప్రయోగించే చోటుకు తీసుకెళ్లి విడిభాగాలను అనుసంధానం చేస్తారు. అనంతరం రాకెట్‌ను ప్రయోగవేదిక మీదే ఉంచి ఎంఎస్‌టీ వెనక్కి వచ్చేస్తుంది.
► రెండో ప్రయోగవేదికను ఇందుకు భిన్నంగా నిర్మించారు. ఈ ప్రయోగవేదికకు సంబంధించి రాకెట్ అనుసంధాన భవనం వేరుగా, ప్రయోగానికి హుంబ్లీకల్ టవర్ (యూటీ)ను వేరుగా నిర్మిం చారు. రాకెట్‌ను వ్యాబ్‌లో అనుసంధానం చేసిన తరువాత రైల్వే ట్రాక్‌లాంటి పట్టాలపై తీసుకెళ్లి హుంబ్లీకల్ టవర్‌ను అనుసంధానం చేసేలా డిజైన్ చేసి నిర్మించారు. ఇప్పుడు రెండో వ్యాబ్‌ను కూడా ఇదే తరహాలోనే నిర్మిస్తున్నారు. రెండు వ్యాబ్‌లు భవిష్యత్తులో నిర్మించబోయే మూడో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు మొదటి ప్రయోగవేదిక, జీఎస్‌ఎల్‌వీ, మార్క్-2 రాకెట్లుకు రెండో ప్రయోగవేదిక, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాలకు రెండో వ్యాబ్‌ను డిజైన్ చేశారు.
రెండో వ్యాబ్ సామర్థ్యం..
రెండో రాకెట్ అనుసంధానం భవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో వసతులుండేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతమున్న మొదటి వ్యాబ్ ఎత్తు 80 మీటర్లు, రెండో వ్యాబ్ ఎత్తు 96 మీటర్లు, వెడల్పు 36 మీటర్లతో 22 అంతస్తులుండేలా డిజైన్ చేశారు. ఇందులో 82 మీటర్లు ఎత్తు కలిగి 450 టన్నుల బరువు సామర్థ్యమున్న భారీ క్రేన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ఫ్లాట్‌పారంలకు రూ.70 కోట్లు, డోర్లు (తలుపులకు) రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్ (టాక్టర్‌కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికి కలిపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ప్రాజెక్టుకు సంబంధించి ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.628.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అయితే 2013లో రూ.363.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ప్రస్తుతం పెరిగిన ధరలనుగుణంగా పరిశీలిస్తే అది కాస్తా రూ.628,95 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. రెండోవ్యాబ్ పూర్తయితే సంవత్సరానికి 10 నుంచి 12 ప్రయోగాలు చేసే స్థాయికి చేరడమే కాకుండా ఇది ఇస్రోకు మరో మణిహారం అవుతుంది.
‘వాణిజ్య’ ప్రయోగాల్లో అర్ధ సెంచరీ దాటి...
వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇస్రో అర్థ సెంచరీని దాటింది. ఆంట్రిక్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్న విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్య పరంగా దూసుకుపోతోంది. 1999 మే 26న పీఎస్‌ఎల్‌వీ సీ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్‌ఆర్-టబ్‌శాట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన కిట్‌శాట్-3 విదేశీ ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపించడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించారు. వీటిన్నిటినీ పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారానే పంపించి విజయాలు సాధించడం విశేషం. కాగా, ఈనెల 22న 17 విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపనున్న ఇస్రో వాణిజ్యపరంగా బలమైన సంస్థగా పురోగమిస్తోంది.
వాణిజ్యపరంగా ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల వివరాలు...
జర్మనీ: టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్‌ఎల్‌ఎస్ 7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2
కెనడా: క్యాన్‌ఎక్స్-2, ఎన్‌ఎల్‌ఎస్-5, ఎన్‌ఎల్‌ఎస్-1, షఫై ్పర్, నియోశాట్, ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2, ఎన్‌ఎల్‌ఎస్-14
సింగపూర్ : ఎక్స్‌శాట్, వెలాక్సీ, టెలియోస్-1, కెంట్‌రిడ్జ్, వెలాక్సీ-సీ1, వెలాక్సీ-11, గెలాషియో, ఎథినోక్సాట్
జపాన్: క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్
డెన్మార్క్: ఆయుశాట్-2, ఎన్‌ఎల్‌ఎస్8.3
ఆస్ట్రియా: ఎన్‌ఎల్‌ఎస్8.1, ఎన్‌ఎల్‌ఎస్8.2
ఫ్రాన్స్: స్పాట్-06, స్పాట్-07,
స్విట్జర్లాండ్: క్యూబ్‌శాట్-4, టీశాట్-1.
అల్జీరియా: ఆల్‌శాట్-24, ఇటలీ: అజిల్,
సౌత్ కొరియా: కిట్‌శాట్, అర్జెంటీనా: ఫ్యూహెన్‌శాట్,
ఇజ్రాయెల్: టెక్సార్, లక్సెంబర్గ్: వెజల్‌శాట్,
టర్కీ: క్యూబ్‌శాట్-3, బెల్జియం: ప్రోబా,
ఇండొనేసియా: లాపాన్-టబ్‌శాట్, లపాన్-ఏ2.
నెదర్లాండ్స్: డెల్ఫీ-సీ3,
యూకే: స్ట్రాడ్-1, డీఎంసీ-1, డీఎంసీ-2, డీఎంసీ-3, సీబీటీఎన్-1, డీ-ఆర్బిట్‌శైల్.
యూఎస్‌ఏ: - లిమూర్-01, 02, 03, 04
ప్రయోగాత్మక ప్రయోగాల్లో దిట్ట...
ప్రయోగాత్మక ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో సత్తా చాటుతోంది. ఇటీవల చేపట్టిన రీయూజబుల్ లాంచింగ్ వెహికల్- టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్ ప్రయోగం విజయంతో ఇస్రో మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించింది. ఇస్రో యాభై ఏళ్ల చరిత్రలోకి వెళితే... అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు 1961లో డాక్టర్ హోమీ జే బాబా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(డీఏఈ)ని ప్రారంభించారు. 1962లో ఇది ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్)’గా రూపాంతరం చెందింది. 1963 నవంబర్ 21న ఐదు దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. ఆ తరువాత రష్యా నుంచి ఆర్యభట్ట, రోహిణి ఉపగ్రహాలను ప్రయోగించారు. అనంతరం స్వయం సమృద్ధి సాధించేందుకు ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్‌ను 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా మార్పు చేశారు.
తూర్పు తీరాన పులికాట్ సరస్సు, బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలో మీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతాన్ని 1969లో రాకెట్ ప్రయోగాల కోసం గుర్తించారు. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాక మొదటి ప్రయోగవేదిక నుంచి 1979 ఆగస్టు 10న ఎస్‌ఎల్‌వీ-3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ ఇచ్చిన విజయాలతో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమయ్యారు. నేడు అత్యంత బరువైన మూడు టన్నుల బరువున్న ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు దోహదపడే స్పేష్ షటిల్ లాంటి ప్రయోగాత్మక ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం చేస్తున్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు), ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు), గ్రహాంతర ప్రయోగాలు(చంద్రయాన్-1, మంగళ్‌యాన్) లాంటి ప్రయోగాలు విజయవంతంగా చేపట్టడంలో ఇస్రో ఘనత శ్లాఘనీయం.
► రాకెట్‌లోని విడిభాగాలను తిరిగి ఉపయోగించేందుకు దోహదపడే స్పేస్ క్యాప్యూల్స్ రికవరీ ప్రయోగాన్ని 2007 జనవరి 10న పీఎస్‌ఎల్‌వీ-సీ7 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు.
► భవిష్యత్తులో మూడు టన్నుల ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు, అలాగే వ్యోమగాములను పంపేందుకు ఉపయోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ కేర్ మాడ్యూల్ (వ్యోమగాముల గది) ప్రయోగాన్ని 2014 డిసెంబర్ 18న విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఎస్-200 బూస్టర్లు సామర్థ్యాన్ని, ఎల్-110 దశ సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతోనే ఈ ఏడాది ఆఖరులో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగానికి కూడా సన్నద్దమవుతున్నారు.
► మే 23న ఆర్‌ఎల్‌వీ-టీడీ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా తొలిసారిగానే విజయవంతంగా చేపట్టారు.
శ్రీహరికోటకు ఆ పేరెలా వచ్చిందంటే..?
శ్రీహరికోట అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియని మారుమూల దీవి. పడవ ప్రయాణమే తప్ప.. బస్సు, కారు తెలియని ప్రాంతం. నేడు మానవుడికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న టీవీ, మాట్లాడుతున్న ఫోన్, ఇంట్లోనే ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్, టెలీమెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, భూమిలోపల దాగివుండే నిధి నిక్షేపాలు, సముద్రాల నుంచి వచ్చే ప్రమాదాలను తెలిపే వ్యవస్థలు, గ్లోబల్ పొజిషిన్ సిస్టం (జీపీఎస్), చంద్రుడు, అంగారకుడు గ్రహాలపైకి పరిశోధనలు చేసే కేంద్రంగా మారింది. బంగాళాఖాతానికి పులికాట్ సరస్సుకు మధ్యలో దట్టమైన అడవుల మధ్య ఆరు పంచాయతీల పరిధిలో 54 గ్రామాలతో శ్రీహరికోట దీవి విస్తరించి ఉంది. దీవిలో పూర్వం రావణాసురుడు అరకోటి లింగాలను పూజించాడని, అందుకే దీనికి శ్రీహరికోట అని పేరు వచ్చిందని ప్రతీతి. అలాంటి శ్రీహరికోట నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు రాకెట్ ప్రయోగకేంద్రంగా తయారైంది.
ఆ 20 ఉపగ్రహాలు ఇవీ...
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 22న పీఎస్‌ఎల్‌వీ సీ-34 ద్వారా మూడు స్వదేశీ, 17 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. భూమికి అతి దగ్గరగా ఉన్న సూర్యానవర్తన ధృవకక్ష్యలోకి (సన్ సింక్రోనస్ ఆర్బిట్) ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవి అక్కడి నుంచి భూమ్మీద జరిగిన మార్పులను చిత్రాలు తీసి పంపిస్తాయి.
కార్టోశాట్-2సీ
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ సిరీస్‌ను ఇస్రో 2005లో రూపొందించింది. ఇప్పటివరకు కార్టోశాట్-1, 2, 2ఏ, 2బీలను అంతరిక్షంలోకి పంపించారు. తాజాగా పంపుతున్న కార్టోశాట్-2సీ 727 కిలోల బరువుంది. ఈ ఉపగ్రహం భూమికి 505 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రోసన్ అర్బిట్ నుంచి పనిచేస్తుంది. ఇందులో అమర్చిన అత్యంత శక్తివంతమైన పాంక్రోమేటిక్ అండ్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. వీటి ఆధారంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీరప్రాంతపు భూముల సమాచారంతోపాటు సాగునీటి పంపిణీ, రోడ్డు నెట్‌వర్క్ సమాచారం అందిస్తుంది. అలాగే మ్యాప్‌లను తయారు చేస్తుంది.
లపాన్-ఏ3 (ఇండోనేషియా)
లపాన్-ఏ3 అనే ఈ ఉపగ్రహం 120 కిలోల బరువుంటుంది. ఈ మల్టీస్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ను భూమి వినియోగం, సహజ వనరులు, వాతావరణ పరిశోధనకు ఉపయోగించుకోనున్నారు.
బిరోస్ (జర్మనీ)
బిరోస్ అంటే బెర్లిన్ ఇన్‌ఫ్రార్డ్ ఆప్టికల్ సిస్టం. జర్మనీకి చెందిన జర్మన్ ఏరో స్పేస్‌సెంటర్ (డీఎల్‌ఆర్) రూపొందించింది. 130 కిలోల బరువు కలిగిన అతి చిన్న సైంటిఫిక్ ఉపగ్రహం. అధిక ఉష్ణోగ్రతలను తెలియజేసే పరికరాలు ఇందులో ఉన్నాయి. స్పేస్‌లో ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు.
ఎం-3 ఎంశాట్ (కెనడా)
మారిటైమ్ మానిటరింగ్ అండ్ మెసేజింగ్ మైక్రో శాటిలైట్ (ఎం-3 ఎంశాట్)ను కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (కెనడా) సంయుక్తంగా తయారు చేశాయి. ఈ 85 కిలోల ఉపగ్రహం ఆటోమేటిక్ ఐడింటిఫికేషన్ సిస్టం సంకేతాలను అందిస్తుంది.
జీహెచ్‌జీశాట్-డీ (కెనడా)
25.5 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భూమి పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహాన్ని కెనడాలోని స్పేస్ ఫ్లైట్ ల్యాబొరేటరీ, యూనివర్సిటీ అఫ్ టొరంటో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఏరోస్పేస్ స్టడీస్ రూపొందించాయి. ఈ ఉపగ్రహంలోని పరికరాలు వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువుల (కార్బన్ డైఆక్సైడ్, మీథేన్)ను కొలిచి సమాచారాన్ని అందిస్తాయి.
స్కైశాట్ జెన్2-1 (యూఎస్‌ఏ)
110 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహంలోని పరికరాలు భూమిని పరిశోధిస్తూ ఫొటోలు, హైక్వాలిటీ వీడియోలు తీసి పంపుతాయి. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టెర్రాబెల్లా, గూగుల్ కంపెనీ తయారుచేశాయి. భూమ్మీద జరిగే మార్పులను ఎప్పటికప్పడు సబ్-మీటర్ రెజుల్యూషన్ ఇమేజెస్, హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు తీసి పంపుతుంది.
డౌవ్ శాటిలైట్స్ (యూఎస్‌ఏ)
4.7 కిలోల బరువు కలిగిన డౌవ్ శాటిలైట్స్‌లో మొత్తం 12 బుల్లి ఉపగ్రహాలున్నాయి. ఇవి కక్ష్యలో పావురాల్లా తిరుగుతూ పని చేస్తాయని డౌవ్ శాటిలైట్స్ అనే పేరు పేట్టారు. ఇవి కూడా భూమిని పరిశోధిస్తూ మార్పులను చిత్రాలుగా తీసి పంపుతాయి.
సత్యభామ శాట్ (చెన్నై)
1.5 కిలోల బరువుండేఈ బుల్లి ఉపగ్రహాన్ని చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ చదువుతున్న విద్యార్థులు తయారు చేశారు. ఈ ఉపగ్ర హంలో అమర్చిన పరికరాలు గ్రీన్‌హౌస్ వాయువుల డేటాను సేకరిస్తుంది. ముఖ్యంగా వాటర్ వాపర్, కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌కు సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి పంపుతుంది.
స్వయంశాట్ (పుణే)
పుణే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కేజీ బరువు కలిగిన ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేశారు. ఇందులో అమర్చిన పరికరాలు పాయింట్ టు పాయింట్ మెసేజింగ్ సర్వీసెస్‌ను అందిస్తాయి.
మరో మైలురాయికి సంసిద్ధం
షార్‌లోని రెండో ప్రయోగ వేదికలో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డిం గ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-34 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని శనివారం ప్రయోగవేదిక మీదకు చేర్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 22న ఉదయం 9.25 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
5 దశాబ్దాల్లో 89 ఉపగ్రహాలు
ఇస్రో ఆవిర్భావం తరువాత సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇప్పటిదాకా 89 ఉపగ్రహాలు, 53 రాకెట్ ప్రయోగాలు, స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం, మరో స్పేస్ షటిల్ ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. 53 ప్రయోగాల్లో 46 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇందులో 34 విజయాలు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారానే కావడం విశేషం. 1962 నుంచి 1978 దాకా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10 ఎస్‌ఎల్‌వీ-3 ఈ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఆ వెంటనే 1980 జూలై 18న చేపట్టిన ఎస్‌ఎల్‌వి-3 ఈ2 ప్రయోగం విజయవంతమైంది.
ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాల్లో మూడు విజయవంతమయ్యాయి. 1987 మార్చి 24న ఏఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లోనూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా రెండు విజయవంతమయ్యాయి. మరో రెండు విఫలమయ్యాయి. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్లలో చిన్న తరహా ఉపగ్రహాలను పంపారు. మోస్తరు ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు 1993 సెప్టెంబర్ 20న పీఎస్‌ఎల్‌వీ లాంటి భారీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్పటిదాకా 35 ప్రయోగాలు చేపట్టగా మొదటిది మినహా మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. వాణిజ్యపరమైన ప్రయోగాలకు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ అత్యంత కీలకంగా మారింది. మళ్లీ మరో అడుగు ముందుకేసి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను చేపట్టారు. ఈ సిరీస్‌లో 10 ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి. ఏడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకే తలమానిమైన చంద్రయాన్-1, మంగళ్‌యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు మొదటి ప్రయత్నంలోనే దిగ్విజయం కావడం ఇస్రో సత్తాకు నిదర్శనం. 2008లో పీఎస్‌ఎల్‌వీ సీ9 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చరిత్ర కూడా ఇస్రోకే దక్కింది. ఈనెల 22న పీఎస్‌ఎల్‌వీ సీ34 ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.