ప్రతీకాత్మక చిత్రం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేటి సాయంత్రం 3.43 గంటలకు కౌంట్ డౌన్
♦ ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతులు మీదుగా బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. 10 గంటలకు ఎంఆర్‌ఆర్ సమావేశం
♦ బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం.
♦ రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు ప్రయోగ పనులు.
♦ ‘ల్యాబ్’ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్.
♦ జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది
♦ బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండోదశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ
♦ గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు.
♦ గురువారం సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది.
♦ ఇది షార్ కేంద్రం నుంచి 76వ ప్రయోగం.
♦ జీఎస్‌ఎల్‌వీ మార్క్–2 సిరీస్‌లో 14వ ప్రయోగం.
♦ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లతో నిర్వహిస్తున్న 8వ ప్రయోగం.
ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్ 2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవకక్ష్య)లోకి మాత్రమే పంపేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), నావిగేషన్ శాటిలైట్స్ (దిక్సూచి ఉపగ్రహాలు)ను భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి పంపేవారు.
ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పని చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. దీని తరువాత జూలైలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్12 రాకెట్ ద్వారా జీఐశాట్–2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment