టెహ్రాన్: ప్రస్తుత ఇరాన్ కాలండెర్ ముగిసేనాటికి మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాలని ఇరాన్ యోచిస్తోంది. మార్చి 21, 2013 నాటికి ఇరాన్ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ లోగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఈ ఇరాన్ సంవత్సరాంతానికి తడ్బిర్, షరిఫ్, ఫజ్రి అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే ఎజెండా మాత్రమే తమ ముందున్నదని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ కార్యనిర్వహణ వ్యవహారాల ఉపాధ్యక్షుడు మహ్మద్ షరియత్ మదారి ఇక్కడ విలేకరులకు తెలిపారు.
వీటి రూపకల్పన చివరి దశలో ఉందని, ఇక కక్ష్యలోకి ప్రవేశపెట్టటమే మిగిలి ఉన్నదని తెలిపారు. ఈ ఉపగ్రహాలను ఫిబ్రవరిలో ఆవిష్కరిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2011 జూన్‌లో 15.3 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుండి అది భూ ఛాయా చిత్రాలను గ్రహిస్తున్నది. ఆ చిత్రాలను తిరిగి భూమి మీద ఉన్న అంతరిక్ష కేంద్రాలకు పంపుతున్నది.