
అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సిద్ధం
ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు
శ్రీహరికోట (తడ): వరుస విజయాలతో దూసుకు పోతూ ప్రపంచదేశాలను అబ్బురపరుస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 15 లేదా 17వ తేదీన మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ37 రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తయింది. శుక్రవారం మూడు, నాలుగు దశలను అనుసంధానం చేసి రెండు దశలను ఒకేసారి రాకెట్‌కు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ అనంతరం రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహాలను అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగంలో మొదట 83 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా వాణిజ్యపరంగా మరికొన్ని దేశాలు ముందుకు రావడంతో మరో 20 ఉపగ్రహాలు పెరిగి ఆ సంఖ్య 103కు చేరింది. ఉపగ్రహాలను అమర్చే క్రమంలో మరోదేశం ముందుకు రావడంతో ఆ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఉపగ్రహాల సంఖ్య 104కు చేరనుంది.
90 నిమిషాల్లోనే ప్రయోగం
పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్లు నుంచి 630 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేస్తున్నారు. 104 ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టేటపుడు ఒక దానితో ఒకటి ఢీకొనకుండా ఉపగ్రహాలను అమర్చి ఒకదాని తరువాత ఒక దాన్ని ప్రవేశ పెడతారు కాబట్టి ప్రయోగానికి 90 నిమిషాలు పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుది విడతగా మిషన్ రెడీ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించిన తరువాత ప్రయోగ తేదీని, సమయాన్ని అధికారికంగా నిర్ణయిస్తారు.