విశ్లేషణ
వాతావరణ మార్పులు; ఘన, ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణ; వ్యవసాయ ఉత్పాదకతల పెంపు, మెరుగైన ఇంధన వ్యవస్థ, ఆరోగ్య సౌకర్యాలు... బయోటెక్నాలజీ సమర్థ వినియోగంతో భారత్ అధిగమించగల సవాళ్లల్లో ఇవి కొన్ని మాత్రమే. బోలెడన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ బయో టెక్నాలజీ ఎంతో సాయం చేయగలదు.
ఇదే విషయాన్ని గత నెల 31న విడుదల చేసిన ‘బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయ్‌మెంట్ (బయో ఈ3)’ విధానం ద్వారా కేంద్రం కూడా లక్షించింది. ఈ విధానంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే... ఇవన్నీ ఎప్పటిలోగా సాధిస్తామన్నది స్పష్టం చేయకపోవడం. ఎందుకంటే ఇవన్నీ 2021లో ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం’ పేరుతో విడుదల చేసిన పత్రంలో ఉన్నవే!
‘బయో ఈ3’ విధానం ప్రధాన లక్ష్యం– వైవిధ్యభరితమైన కార్యకలాపాల ద్వారా పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిరక్షిస్తూనే, సుస్థిరా భివృద్ధి వంటి అంతర్జాతీయ సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు బయో మాన్యుఫాక్చరింగ్ పరిష్కారాలు వెతకడం! సృజనాత్మక ఆలోచనలను టెక్నాలజీలుగా వేగంగా పరివర్తించాలని కూడా సంకల్పం చెప్పుకొన్నారు.
ఇప్పటివరకూ వేర్వేరుగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ బయోమాన్యుఫాక్చరింగ్ అనే ఒక ఛత్రం కిందకు తీసుకు రావాలనీ, సుస్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్మించాలనీ కూడా విధాన పత్రంలో పేర్కొన్నారు.
ఈ విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో కేంద్ర ‘బయోటెక్నాలజీ విభాగం’ (డీబీటీ) కార్యదర్శి రాజేశ్ గోఖలే జీవశాస్త్ర పారిశ్రామికీ కరణకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ విధానంలోని వాపును కాస్తా పక్కకు పెడితే – బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ , కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందుకు వాడటం కీలకాంశా లుగా తోస్తాయి.
ఇదే వాస్తవమని అనుకుంటే ఇందులో కొత్తదనమేమీ లేదు. ఎందుకంటే 2021లో ఇదే డీబీటీ ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం (2021–25)’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. అందులోనూ కచ్చితంగా ఇవే విషయాలను ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు ఆర్థికాంశాలు, కాలక్రమం, లక్ష్య సాధనకు మార్గాల వంటివి స్పష్టంగా నిర్వచించారు.
బయోటెక్నాలజీ ఆధారంగా విజ్ఞాన, సృజనాత్మకతలతో నడిచే ఓ జీవార్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది 2021లో డీబీటీ పెట్టుకున్న లక్ష్యం. 2025 నాటికల్లా భారత్‌ను అంతర్జాతీయ బయో మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దాలని అనుకున్నారు. బయో ఫౌండ్రీల వంటి వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికులను తయారు చేయడం, అందరికీ అందు బాటులో ఉండే వస్తువులను తయారు చేయగల పరిశ్రమలకు ప్రోత్సా హకాలు అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని అప్పట్లో తీర్మానించారు.
వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పర్యావరణ అను కూల ఇంధనాలు, వ్యర్థాల సమర్థ నిర్వహణ వంటివి 2021లో గుర్తించిన ప్రాధాన్యతాంశాలు. తాజా జాబితాలోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించారు. కానీ డీబీటీ తెలివిగా పాత విధానం, వ్యూహాలను అస్సలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
అప్పడు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్న నుంచి తప్పించు కునేందుకు అన్నమాట! 2021 విధానానికి అనుగుణంగా తీసుకున్న చర్య ఏదైనా ఉందీ అంటే... అది తాజా బడ్జెట్‌లో బయో ఫౌండ్రీల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని ప్రకటించడం మాత్రమే.
బయోటెక్నాలజీ ఏయే రంగాల్లో ఉపయోగపడగలదో చెప్పాల్సిన పని లేదు. టీకాల తయారీ మొదలుకొని కొత్త రకాల వంగడాల సృష్టి వరకూ చాలా విధాలుగా సహాయకారి కాగలదని గత నాలుగు దశా బ్దాల్లో నిరూపణ అయ్యింది. దేశ విధాన రూపకర్తలు దీని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించారు.
1986 లోనే బయోటెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇది దేశవ్యాప్తంగా పరిశోధన, విద్య అవకాశాలను పెంచడం వల్ల ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానానికి చేరుకోగలిగింది.
అయితే బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమ వృద్ధి కొంచెం నెమ్మదిగానే జరిగిందని చెప్పాలి. వెంచర్ క్యాపిటలిస్టుల లేమి, తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణాలు. అయినప్పటికీ పరి శ్రమ అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులేవీ డీబీటీ కార్యక్రమాల కారణంగా వచ్చినవి కాకపోవడం గమనార్హం.
భారతీయ బయోటెక్ పరిశ్రమకు ఇష్టమైన ప్రతినిధిగా చూపే ‘బయోకాన్’... డీబీటీ ఏర్పాటు కంటే మునుపటిది. శాంత బయోటెక్, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు వంటి ఇంకో ప్రభుత్వ విభాగపు రిస్క్ ఫైనాన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసినవే.
2000లలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయో టెక్నాలజీ రంగం కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించడమే కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలూ అందించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌ల విజయం ఈ విధానాల ఫలమే. 2012లో మాత్రమే డీబీటీ పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ప్రత్యేక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ‘ద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’... క్లుప్తంగా బైరాక్ అని పిలుస్తారు.
ప్రభుత్వం గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన సామర్థ్యాల ఆధారంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ తాజా విధానంలో జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి విజయవంతమైన నమూనాల ప్రస్తావనే లేదు. కాకపోతే ఇదే భావనను ‘మూలాంకుర్ బయో ఎనేబ్లర్ హబ్’ అన్న కొత్త పేరుతో అందించింది.
విధాన పత్రం ప్రకారం ఈ హబ్స్ ఆవిష్కరణలు, ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్‌లను సమన్వయ పరుస్తాయి. పైలట్ స్కేల్, వాణిజ్య పూర్వ పరిశోధనలకు సహకారం అందిస్తాయి. ఇప్పటికే దేశంలో ఉన్న టెక్నాలజీ క్లస్టర్లు చేస్తున్నది కూడా ఇదే.
కేంద్రం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న ఈ కొత్త విధానం నియంత్రణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మౌలిక పరిశోధనలకు తగినన్ని ప్రభుత్వ నిధులను అందుబాటులో ఉంచడం, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లోనూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నదీ విస్మరించింది.
బయో మాన్యుఫాక్చరింగ్‌కు నియంత్రణ వ్యవస్థ కీలకం. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవులు, ఇతర జీవజాలాన్ని వాడతారు కాబట్టి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన నిబంధనలు చెల్లాచెదురుగా ఉండటమే కాదు, పారదర్శకంగానూ లేవు. ఓ భారీ బయోటెక్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందే స్వతంత్ర, చురుకైన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం.
ఐటీ విప్లవం మాదిరిగానే బయోటెక్నాలజీ ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తామని డీబీటీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమాచార రంగంలో వచ్చిన మార్పులే ఐటీ విప్లవానికి నాంది అనీ, ఏదో విధానాన్ని రూపొందించి విడుదల చేయడం వల్ల మాత్రమే ఇది రాలేదనీ ఆయన గుర్తించాలి.
డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేజ్‌ను సొంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించడం, పెట్టుబడులు పెట్టడం, డెడ్‌లైన్లను విధించడం వల్లనే దేశంలో ఈ రోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది. అలాగే ప్రభుత్వం స్వయంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కీలకం.
విధానాలు అనేవి బాధ్యతాయుతమైన పాలనకు మార్గదర్శక పత్రాల్లా ఉండాలి. ఉన్నతాశయాలు, దార్శనికతతో ఉండటం తప్పు కాదు. కానీ, లక్ష్యాలేమిటి? వాటి సాధనకు ఉన్న కాలపరిమితి, సవా ళ్లపై అవగాహన అవసరం. కాలపరీక్షకు తట్టుకున్న పాత విధానాన్ని కాకుండా కొత్త మార్గాన్ని అనుసరించాలని డీబీటీ ప్రయత్నించింది.
శాస్త్రీయ విభాగం అయినందుకైనా తార్కికమైన, ఆధారాల కేంద్రిత విధానాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. ‘ఆర్థిక వ్యవస్థ’, ‘ఉపాధి కల్పన’ రెండూ శీర్షికలోనే ఉన్నా ఈ విధానం ప్రాథమ్యాలు అస్పష్టం, సందేహాస్పదం. వాక్చాతుర్యం తప్ప ఏమీలేదు.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment