‘‘భయం మరణం... ధైర్యమే జీవితం...’’ అన్నారు స్వామీ వివేకానంద. ఆ భయమే ఇప్పుడు ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ప్రపంచ జనావళిని పట్టి పీడి స్తున్న వేళ, పలు స్థాయిల్లో నెలకొన్న భయం సమస్యను జటిలం చేస్తోంది. కరోనా సోకిన వారినొకరకంగా, వారిని చూసి జడుసుకునే ఇరుగుపొరుగును మరోరకంగా ఈ భయం వెన్నాడుతోంది. సరైన అవగాహన, ఆచరణ ద్వారా భయం పోయి, దాని స్థానే రావాల్సిన జాగ్రత్త రాకపోవడం వల్ల నష్టం జరుగుతోంది. పాటించాల్సిన ‘జాగ్రత్త’ల పైన శ్రద్ధ కొరవడి, అకారణ ‘భయాల’కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఫలితంగా.. ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టమే కాకుండా మానవతా విలువలు కూడా క్షీణించి ‘అమాను షత్వం’ ఎక్కడికక్కడ ప్రబలుతోంది.
అనుమానితుల్ని, వ్యాధిగ్రస్తుల్ని అద్దె ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో ఉండనీయకపోవడం, కోవిడ్ మృతుల పార్థివ శరీరాల్ని వాడల్లోకి, గ్రామాల్లోకి అనుమతించకపోవడం, శ్మశా నవాటికల్లో అంత్యక్రియల్ని అడ్డుకోవడం వంటి దారుణాలు పెరుగు తున్నాయి. కోవిడ్ రోగి అయినా, కాకపోయినా.. సందేహాస్పద మర ణమైతే చాలు, ఉన్నపళంగా వాహనాలు ఆపి దారి మధ్యలో, నట్టడ విలో అయినా దింపేసి వెళ్లే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ‘మనం పోరాడాల్సింది రోగంతోనే తప్ప రోగితో కాదు’ అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోతోంది. ఆచరణ నినాదానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని ఇలాగే అనుమతిస్తే.. రేపెప్పుడైనా అంటు వ్యాధులకు గురైన వారిని, వారి కుటుంబాల్ని ఊళ్లోకి రానీయకపోయే, సామాజికంగానే వెలివేసే ప్రమాద సంకేతాలు పొడసూపుతున్నాయి. పట్టణాలు, పల్లెలు, వాడలే కాదు చివరికి కుటుంబ సభ్యులు సహితం కోవిడ్ రోగుల్ని, మృతుల్ని ఈసడించుకుంటున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.
ఇది అత్యంత దారుణం! ఒకవైపు మానవత్వం వెల్లివిరిసి.. లాక్‌డౌన్‌లో కూటికిలేని కుటుంబాలను ఆహారంతో ఆదుకున్నారు. వలసకూలీలను పొదిల్లలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేర్చి మానవీయత చాటిన మనిషి మరో పార్శ్వపు వికృతరూపం ఇప్పుడు బయటపడుతోంది. చాలీచాలని సదుపాయాలు, సిబ్బంది కొరతతో ప్రభుత్వాసుపత్రులు విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. కోవిడ్ అనుమానముంటే లక్షల రూపాయలు డిపాజిట్ చేయమని, కోవిడ్ కాని జబ్బంటే అసలు చూడనే చూడమని వైద్యం నిరాకరిస్తూ ప్రైవేటు ఆస్పత్రులు నరకం చూపిస్తున్న సందర్భాలు కోకొల్లలు!
అమానవీయత తగునా?
కరోనా వ్యాధి సోకిన వారికి, వారి కుటుంబాలకు మనోధైర్యం కలిగిం చాల్సింది పోయి కొందరు క్షోభకు గురిచేస్తున్నారు. నిర్హేతుకమైన భయాలతో సామాజిక రౌడీయిజం వెలగబెడుతున్న తీరు గర్హనీయం. ‘కోవిడ్ పాజిటివ్ అయితే ఇక్కడికొద్దు’ అంటూ, కొన్ని అపార్ట్‌మెం ట్లలో, వాడల్లో, గ్రామాల్లో తలెత్తుతున్న పరిస్థితి దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా ముందు వరుసలో ఉండి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు, ఇతర సేవల్లోని వారు కూడా ‘మావీ ప్రాణాలే కదా! మాకెందుకులే?’ అనుకొని పనులు మానేస్తే పరిస్థితి ఎలా ఉండేది? అని వారెవరూ ఆలోచించడం లేదు. హోమ్ క్వారంటైన్ అయినా, ఇంట్లోనే ఉండి జరి పించుకునే వైద్యమైనా.. కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారా చూడాలి.
మాస్క్ ధరిస్తున్నారా? భౌతిక దూరం పాటిస్తున్నారా గమనించాలి. లేకుంటే, నిర్బంధం విధించాలి, కట్టడి చేయాలి. అంత్యక్రియలు పరి మిత వ్యక్తులతో, వైద్య–మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో ప్రొటోకాల్ ప్రకారం జరిపిస్తున్నారా? లేదా? చూసుకోవాలి. అంతే తప్ప ‘ఈ ఊళ్లో ఖననం జరిపించడానికి లేదు’ అంటే వారెక్కడికి పోవాలి? వేరే చోట మరింత ప్రతిఘటన ఎదురవుతుంది కదా! కోవిడ్ రోగులకు సేవలం దించి చనిపోయిన ఓ డాక్టర్‌కు చెన్నైలో ఎదురైన ఇలాంటి దురాగ తాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. పక్షం కింద ఢిల్లీ నుంచి శికోహబాద్ వెళ్తూ కదుల్తోన్న బస్సులోంచి, అనుమానంతో 19 ఏళ్ల బాలికను కిందకు పడదోస్తే నిమిషాల్లో అక్కడికక్కడే చనిపోయింది. 108 సిబ్బంది, ఆటోవాలా.... ఇలా ఎవరెవరి సందేహాలో, భయమో.. అన్యాయంగా భూపాలపల్లికి చెందిన 45 ఏళ్ల శంకరమ్మ బతుకు కడతేర్చింది. రోడ్డుమీదే ఆమె ప్రాణాలొదిలింది. ఇలాంటివెన్నో! అదే సమయంలో, కొన్ని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో చక్కటి సమన్వయం చూపుతున్నారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే, అసో సియేషన్ వాళ్లకి చెప్పి హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్తారు. పక్షం రోజుల పాటు బయటకు రావాల్సిన అవసరమే లేకుండా మిగతా ఇళ్లవా ల్లంతా, వంతుల వారీగా వారికి అవసరమైనవి అందజేస్తారు. సరు కులు, పాలు, మందులు... వారి తలుపుముందు పెట్టి ఫోన్‌లో సమా చారం ఇస్తారు.
ఒత్తిడి వల్లే ఎక్కువ చావులు
రోగ నిరోధకత అంటే పౌష్టికాహారం తీసుకుంటూ శరీర పటిష్టత సాధించడం మాత్రమే కాదు! మానసిక దృఢత్వ పరంగానూ అనేది సుస్పష్టం. కోవిడ్ సోకిన వారంతా ఆస్పత్రి పాలుకావాల్సిన అవసరం లేదనేది సందేహాలకతీతంగా నిర్ధారణ అవుతున్న విషయం. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ, జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అయినా చాలామంది భయం వీడటం లేదు. 70 నుంచి 80 శాతం మందికి లక్షణాలు లేకుండానే వ్యాధి వచ్చి–పోతోంది, లేదా బయటే నయమవుతోంది. ఇక ఆస్పత్రుల్లో చేరిన వారిలోనూ కోలుకుంటున్న వారే ఎక్కువ! తగినంత ధైర్యం చెప్పేవాళ్లు లేక ఎక్కువమంది మానసికంగా కలత చెందుతున్నారు. ఏమౌతుందో? అనే భయంతో కుంగిపోతున్నారు. కోవిడ్ భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. మానసిక వ్యథ, ఆందోళన (యాంక్సైటీ సిండ్రోమ్)తో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వారూ ఉన్నారు. కోవిడ్ సోకి, గుండె పోటుతో మరణిస్తున్న చాలా కేసుల్లో వైరస్ కన్నా ఒత్తిడి ప్రభావమే ఎక్కువని వైద్యులే అంగీకరిస్తున్నారు.
ఆస్పత్రిలో చేరి, లేదా హోం క్వారంటైన్‌లో ఉండి నాలుగ్గోడల మధ్య ఒంటరితనం అనుభవిస్తున్న వారు మానసికంగా కుంగిపోతున్నారు. తమకేదో అవుతోందని, ఆందోళనగా ఉందని, ఏం చేయాలో చెప్పాలని, కౌన్సిలర్ ఎవరినైనా పంపించండని.. ఇలా ఫోన్ చేసి వేడుకుంటున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లోనూ, తమ ‘భవిష్యత్తు ఏమిటి?’ అనే ఆందోళనలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం స్వయంగా, ఒక యూనివర్సిటీ సైకాలజీ విభాగం నిర్వహిస్తున్న ‘హెల్ప్‌లైన్’లకు కోవిడ్ రోగులు. అనుమానితులు, విద్యార్థుల నుంచి వస్తున్న వేలకొలది ఫోన్‌కాల్స్ ఇదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘జాతీయ మానసిక వైద్య–నరాల అధ్యయన శాస్త్ర సంస్థ’ (నిమ్హాన్స్)కు గత 3 నెలల్లో 3 లక్షల కాల్స్ వచ్చాయి. కోవిడ్‌ను నయంచేసే ఖచ్చితమైన మందులు గానీ, రాకుండా నివారించే వ్యాక్సిన్‌లుగానీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోపు, అనివార్యంగా కరోనాను గుర్తెరిగి, సహజీవనం సాగించడం తప్పదు. అందుకని, భయాన్ని వీడి తగిన జాగ్రత్తలు పాటించడమే ఉన్నంతలో పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
భరోసా లేకే భయం!
కోవిడ్–19ని ఎదుర్కొనే విషయంలో నిర్లక్ష్యం వల్ల కొంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇంత పెద్ద దేశంలో, 135 కోట్ల జనాభాను నిర్బంధించి లాక్‌డౌన్ ప్రకటించినపుడు కానీ, దాన్ని ఎత్తివేసినపుడు గానీ సమగ్రమైన వ్యూహం–ప్రణాళిక లోపించింది. అవసరాలకు తగిన వైద్య వనరులు, సాధన సంపత్తినీ సమకూర్చుకున్నది లేదు. తగినంత ముందుగానే లాక్‌డౌన్ విధించడం ఆరంభ ప్రయోజనాన్ని కలిగించింది. కానీ, కష్టమో, నష్టమో! లాక్‌డౌన్ ఎదుర్కొని ప్రజలు చూపిన త్యాగం స్థాయిలో వైద్యారోగ్య నిర్వహణపరమైన సన్నద్ధత ఉండి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. కొంచెం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు చేపట్టిన రాష్ట్రాలు సమస్యను దీటుగా ఎదుర్కొం టున్నాయి. వైద్యసేవలకు సంబంధించి ప్రభుత్వ రంగంలో సరైన నిర్వహణ, ప్రైవేటు రంగంపై సమగ్ర నియంత్రణ ఉంటేనే పౌరు లకు భరోసా కల్పించగలుగుతారు. భయం తొలగుతుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలున్నాయి. డాక్టర్లపై నమ్మక ముంది, కానీ నిర్వహణ, నిర్వాకాలపై విశ్వాసం లేక చికిత్స కోసం అక్కడికి పోవడానికి జనం జంకుతున్నారు. అందుకే అక్కడ పడకలు ఖాళీగా ఉంటున్నాయి.
అక్కడ కన్నా ఇంట్లో చావడం మేలనే మాట వినిపిస్తోంది. తమ సేవల ద్వారా, లోపాలు సవరించుకోవడం ద్వారా ప్రజాసుపత్రులు ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. మరోవంక ప్రైవే టులో దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు తమకు గిట్టు బాటు కావంటున్నారు. న్యాయస్థానం చెప్పినా వినటం లేదు. వైద్య బీమా సంస్థలు నిర్దేశించిన రేట్లకూ కోవిడ్ వైద్యం సాధ్య పడదం టున్నారు. పరిస్థితి విషమించి, ప్రాణభయంతో వచ్చే రోగుల్ని అసలు చేర్చుకోమంటున్నారు. అక్కడో ఇక్కడో సిద్ధపడ్డా, లక్షల రూపాయల ప్యాకేజీలు, డిపాజిట్లు అడుగుతున్నారు.
‘భారతదేశంలో ఎక్కువ మంది కోవిడ్ రోగులు, ఏడెనిమిది ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకో కుండా నిరాకరిస్తుంటే.. అంబులెన్సుల్లో చస్తున్నారు’ అని కోల్‌కతాకు చెందిన ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ఇంట్లో వైద్యం చేయించుకుంటూనో, అనుమానంతో హోమ్ క్వారంటైన్‌లోనో ఉన్న కొందరు జాగ్రత్తలు పాటించడం లేదు. సరుకులకనో, సరదాలనో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తి, వ్యాధి పెరుగుదలకు అదే కారణమౌతోంది. బయటి పరిస్థితుల తీవ్రత దృష్ట్యానైనా జాగ్రత్తగా ఉండటం అవసరం.
కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం... భయం నుంచి నమ్మకం వైపు, ఒత్తిడి నుంచి దృఢచిత్తం వైపు, ఆందోళన నుంచి మనశ్శాంతి వైపు, అభద్రత నుంచి ఆత్మవిశ్వాసం వైపు మళ్లా ల్సిందే! మనోఃధైర్యమే మన జీవితం, మన విజయం!!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment