పల్లె కన్నీరు తుడిస్తేనే పండగ | village economy decreasing | Sakshi
Sakshi News home page

పల్లె కన్నీరు తుడిస్తేనే పండగ

Published Fri, Jan 15 2016 1:14 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

village economy decreasing

సమకాలీనం
 ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లా, నిర్లక్ష్యం వల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. సాగుబడి చిన్న రైతు బతుక్కు భరోసాను ఇవ్వలేని స్థితి ఏర్పడింది. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. మూలాలను మరవని పట్టణవాసి ‘ఊరెళ్లాలనే ఉబలాటం’ అభినంద నీయం! ఏడాదికోసారి ఇలా ఆ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటేనే చాలదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసి పల్లెకు కొత్త ఊపిరి పోయడానికి పూనుకోవాలి! పాలకులపై ఒత్తిడి తేవడమే కాదు, ఊరిని కాపాడుకునే సాంస్కృతిక ఉద్యమమే తేవాలి!
 
 ఊరెలా ఉంది? ఇంకా ఉంది సంతోషించాలి! జీవకళ నశించి, గాజు కళ్లతో నిర్జీవంగా పడి ఉంది. బతుకుదెరువు కోసమో, మరే ఇతర కారణాలతోనో పట్టణాలు, నగరాలకు వలసవెళ్లినవారు వెళ్లగా... మిగిలిన కొద్దిమందితో ఉస్సూరుమంటోంది. పని సంస్కృతితో పాటూ గ్రామీణ సంస్కృతులు, సంప్రదాయాలు, విలువలు, మానవసంబంధాలు మరుగునపడ్డాయి. సంక్రాంతికి స్వగ్రామం వెళ్లాలన్న తపనతో నగరాలు, పట్టణాల నుంచి సుమారు డెబ్బై లక్షల మంది తెలుగువాళ్లు ఇవ్వాళ సొంతూళ్లకొచ్చి ఉంటారు. అదీ, ఒకటి రెండు రోజుల కోసం! ఓ మారు గుండె మీద చెయ్యేసుకుని స్పం దించాల్సి వస్తే, ‘ఊరొకప్పటిలా లేదు. ఆ కళే పోయింది!’ అంటారు. అవును, ఊరు ఛిద్రమైంది. భారతీయత గ్రామాల్లోనే ఉందని, గ్రామస్వరాజ్యమే భవి తకు మనుగడని జాతిపిత బాపూజీ చెప్పారు. ఆయనెందుకలా అన్నారు...? ఆ రోజుల్లోనే ఆయన ఏవో అవలక్షణాల్ని పసిగట్టి అలా హెచ్చరించారేమో? భారతీయతకు ఊరే భూమికగా ఉండేది.

ఈ దేశాన్ని ఇన్నూరేళ్లు పాలించిన బ్రిటిష్ వాడు చెరచలేకపోయిన మన ‘ఊరు’ను మనమే ఛిద్రం చేసుకున్నాం, చేజేతులా! ముఖ్యంగా గడిచిన రెండు, రెండున్నర దశాబ్దాలలో ఊరు, ప్రత్యేకించి తెలుగునాట మరీ ధ్వంసమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేల యింది. ప్రధాన వ్యాపకమైన వ్యవసాయం కునారిల్లింది. అనుబంధ చేతి వృత్తులు నాశనమయ్యాయి. బతుకుదెరువు కోసం వలసలు అనివార్యమ య్యాయి. సరైన ఉపాధి, విద్య, వైద్యం లభించక కన్నీళ్లతో ఊరికి దూరమైన కుటుంబాలు లెక్కలేనన్ని. పాలకుల పక్షపాతం, ప్రభుత్వాల తప్పుడు ప్రాధాన్యాలు, మన నిర్లక్ష్యం, సాంస్కృతిక దాడులు వెరసి ఊరిని ఒంటరిని చేశాయి. గోరటి వెంకన్న అన్నట్టు... పల్లె కన్నీరు పెట్టింది... కనిపించని కుట్ర ల్లో, కనిపిస్తున్న కుట్రల్లో బందీ అయింది. కానీ బతికే ఉంది! బాగు కోసం ఇక ఏమీ చేయలేమా? ఊరును బాగు చేయొచ్చు. ఇప్పుడది ఉమ్మడి కర్తవ్యం.

 వెళ్లిపోయింది కొందరే, వెళ్లగొట్టింది ఎందరినో...
 గ్రామాలొకప్పుడు కళకళలాడేవి. ప్రశాంత వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు, అన్నిటికీ మించి మంచితనం ఉట్టిపడేవి. మానవసంబంధాలు ఉత్కృష్టంగా ఉండేవి. గౌరవ మర్యాదలకు లోటుండేది కాదు. సంపదలతో తులతూగకున్నా, చిన్నాపెద్దా తేడాల్లేకుండా ఊరూరూ స్వయం సమృద్ధంగా ఉండేవి. వివిధ సామాజిక వర్గాలు, విభిన్న ఆర్థిక నేపథ్యాలున్నా ఊరంతా కలిసి మెలిసి ఉండేవారు. ఒకరి బాగోగులపై వేరొకరికి పట్టింపుండేది. ఆనం దాలను పంచుకున్నట్టే ఇరుగుపొరుగుల కష్టాలను, బాధలను పంచుకునే వారు. అవసరాలకు ఆదుకునే వారు, అనునయించి ధైర్యం చెప్పేవారు.  కోలుకోలేని కష్టాల్లో ఉన్నా బతుకుపై భరోసాకు ధీమా దొరికేది. ఆత్మహత్య అనే ఆలోచనే రాని సామాజిక జీవనానికి నాటి ఊరు నెలవు. ఆర్థిక స్వావలంబన ఉండేది.   రైతుకు వ్యవసాయం గిట్టుబాటయేది. పాడీపంటా, గొడ్డూ గోదా, గొర్లూ, మేకలూ రైతును ఆర్థికంగా ఆదుకునేవి. బడుగు బలహీన వర్గాలకు సైతం తిండిగింజలు తదితరాలు అందుబాటులో ఉండేవి. వ్యవ సాయ అనుబంధ సేవలైనా, చేతి వృత్తులైనా తలెత్తుకు బతగ్గలిగేంత గౌర వంగా ఉండేవి. గత రెండున్నర దశాబ్దాల్లో అవన్నీ కుదేలైపోయి గ్రామ ఆర్థిక సమీకరణాన్నే సమూలంగా మార్చేశాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. ప్రధానంగా చిన్న కమతాలతో కూడిన మన వ్యవసాయం రైతు బతుక్కు భరోసా కల్పించే స్థితి లేదు. విత్తనాలు, ఎరువులు, కూలీలు, క్రిమిసంహార కాలు తదితరాలన్నిటి ధరలూ ఆకాశమంటి ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగింది. వాతావరణ పరిస్థితుల్లో స్థిరత్వం, క్రమత తప్పాయి. అన్ని అరిష్టాలూ దాటి చేతికి అందిన ఆ ఇంత పంటకూ గిట్టుబాటు ధర సంగతలా ఉంచి, కనీస మద్దతు ధర కూడా లభించని దుస్థితి. వ్యయం పెరిగి, రాబడి తగ్గి ఏటేటా అప్పులు పెరుగుతుంటే ఆస్తులు తరుగుతున్నాయి. బతుకు భార మౌతోంది. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, చేనేత తదితర చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డ వారందరిదీ ఇదే స్థితి. వ్యవసాయానికి ఇతర ఆదాయవనరులు తోడైన సందర్భాల్లో కాస్త నయం. కానీ, వ్యవసాయమే ఆదరువుగా ఉన్న కుటుం బాలు గుల్ల. గౌరవంగా బతకడం పోయి, బతుకుదెరువుకూ గడ్డుకాలం వచ్చినపుడు వలస అనివార్యమైంది.

పొట్టచేత పట్టుకొని సమీప పట్టణాలకో, నగరాలకో తరలివెళ్లిన దుస్థితి. ఇది ఒక దశ. ఆ పైన, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి తోడు సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ఆర్థిక స్తోమతగల కుటుంబాలూ ఊరొదిలి నగరాల బాట పట్టాయి. వీటికి తోడు రాజకీయ వ్యవస్థలోని వివక్ష కూడా గ్రామాన్ని బలహీనపరిచింది. ఇది గ్రహించిన దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం కోసం రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ తదితర చర్యలు చేపట్టారు. కానీ, అంతకు ముందు, ఆ తర్వాత మనుషుల్ని ఓటర్లుగా మాత్రమే చూడగల వ్యవస్థకు ఊరు జనం ఆనలేదు. వ్యవస్థీకృత మైన, చదువరులతో కూడిన పట్టణ, నగరవాసుల పట్లా, వారి ప్రయోజనాల పట్లా చూపే శ్రద్ధ గ్రామీణుల పట్ల చూపట్లేదు. తాగునీరు, రోడ్లు, రవాణా, విద్య, వైద్యం, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలలో పట్టణాలకు, గ్రామాలకు పొంతనే లేదు! పట్టణాల కోసం వేల కోట్ల రూపాయల పథకాలు రచించే ప్రభుత్వాలకు గ్రామీణులపైనే శీతకన్ను! ఉల్లిధర రెట్టింపైతే భూకంపం వచ్చినట్టు గగ్గోలు పెట్టే ప్రభుత్వాలు, ప్రసారమాధ్యమాలకు అతివృష్టికో, అనావృష్టికో రైతు పంట మొత్తం పోయినా పట్టదు. ఆదుకునే దిక్కేలేక గత్యంతరంలేక ఊళ్లొదిలిన వారే ఎక్కువ!

 తేలిక సంపాదనొకటి... కఠిన రాబడి మరొకటి....
 సాఫ్ట్‌వేర్ విప్లవం తర్వాత పల్లె-పట్టణం మధ్య అంతరం బాగా పెరిగింది. ఆర్థిక పరంగా ఇది విరుద్ధ సమీకరణాన్ని ఆవిష్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిన క్రమంలోనే పట్టణాలు, నగరాల్లో అవకాశాలు క్రమంగా పెరిగాయి. బతుకు తెరువు ఆశ గ్రామీణుల్ని పట్టణం వైపు తరిమింది. దూరపు కొండలు నునుపన్నట్టు పట్టణాల్లో డబ్బు సంపాదన తేలికనే భ్రమ కొంద ర్ని కాటేసి, వలసల్ని గుడ్డిగా పెంచింది. ఒక జీవిత కాలంలో వెనకేయగలమా? అని గ్రామీణులు నివ్వెరపోయేటంత పెద్ద జీతాల్ని సాఫ్ట్‌వేర్, తదితర ఉన్నతోద్యోగులు ఒకటి రెండు నెలల్లోనే సంపాదించారు. గ్రామీణ సంపన్నులు తరాలపాటూ కూడబెట్టలేని సంపద లను రాజకీయ, వ్యాపార వర్గాలు, వ్యవహర్తలు, పారిశ్రామికవేత్తలు, వైద్యం తదితర వృత్తినిపుణులు ఒకటి రెండేళ్లలోనే సంపాదించడం వారిని విస్మయ పరిచింది. ఇక మామూలు మధ్య తరగతి వారికీ చిన్నదో, పెద్దదో, ప్రయి వేటుదో, సర్కారుదో ఏదో ఓ కొలువు పట్టణాల్లోనే దొరుకుతుందనే ఆశలు బలపడ్డాయి. ‘ఏం లేకున్నా ఎక్కడో ఓ చోట ఇంత పనిచేసుకొని బతకొచ్చు’ అన్న భరోసా వారిని పట్టణాల వైపు నడిపించింది. పట్టణాలు, నగరాలు చేరి కోట్లకు పడగలెత్తినవారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వక పోగా అనైతిక పద్ధతుల్లో అక్కడా ఆర్థిక ప్రయోజనాలను ఆశించారు.

ఒకప్పుడు పద్ధతిగా సాగిన ప్రయివేటు రుణ వ్యవస్థ, వడ్డీవ్యాపారం ప్రాణాల్ని పిండేసే దోపిడీ రూపమెత్తింది. ‘కాల్‌మనీ’ నాగుల కాట్లవే! దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. వ్యవసాయాన్ని, అనుబంధ పరిశ్రమల్ని, చేతి వృత్తుల్ని దారుణంగా అలక్ష్యం చేసిన ప్రభుత్వాలు కుటీరపరిశ్రమల్నీ  కూడా ఎదగనీయలేదు. దీనికితోడు ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం అప్పటికే పెను భారంతో కుంగి, వంగి నడుస్తున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నడుములు విరిగేలా దెబ్బతీసింది. విద్య, ఉపాధి అవకాశాల్లేని గ్రామీణ యువత టీవీలు, సినిమాల ప్రభావంతో వినియోగ వస్తు మార్కెట్ మాయలో పడి కొట్టుకు పోవడం గ్రామం పాలిటి తాజా శాపమైంది. కాస్మెటిక్స్ నుంచి సెల్‌ఫోన్ వరకు వినియోగ వస్తు వ్యామోహ మార్కెట్ సంస్కృతి ప్రతి ఇంటిలోకీ చొరబడింది. ఉపాధి అవకాశాల్లేని గ్రామీణ యువతలో సంపన్నులు, ఎగువ మధ్యతరగతితో పోల్చి చూసుకునే తత్వం పెరిగింది. దీంతో నిస్పృహకు గురై చిన్న వయసులోనే తెంపరితనం, చెడు తిరుగుళ్లు, తాగుడు వంటి వ్యసనానికి బానిసలై ఏ పనీ చేయలేని అనుత్పాదక భారంగా గ్రామ యువత మిగలడం మరో కొత్త విషాదం. గ్రామం వదల్లేని వృద్ధులు, పెన్షనర్లు, ఎవరూ లేని వితంతువులు, రూపాయికి కిలో బియ్యంపై ఆధారపడ్డ నిరుపేదలు, పెద్దగా శ్రమించకపోయినా ప్రభుత్వ పథకాల్ని ఉపాధిగా మలచుకోగలమని రాజీపడ్డ వాళ్లు తదితరులే చాలా గ్రామాల్లో అత్యధికులుగా మారుతున్నారు.

 సాంస్కృతిక దాడి సామాన్యమైందేమీ కాదు!
 ఒకప్పుడు రాత్రి తొమ్మిదయిందంటే ఊరంతా నిశ్శబ్దం రాజ్యమేలేది. అంతా రాత్రి భోజనాలు ముగించి నిద్రలోకి జారేవారు. తెల్లారక ముందే పల్లె చేతనమయ్యేది. రకరకాల పనుల్లో పడిపోయేది. ఇప్పుడు అధిక కుటుంబాల్లో మధ్య రాత్రి దాటే వరకు, ఇంటి తలుపులైనా మూసు కోకుండా టీవీలకు అతుక్కుపోయే సంస్కృతి బలపడింది. బాధ్యతల కన్నా బరితెగింపునే ప్రోత్సహించే చౌకబారు వినోదాన్ని గ్రామంపై జరుగుతున్న సాంస్కృతిక దాడిగానే పరిగణించాలి. డబ్బింగ్ సీరియల్స్, ఉద్రేకపు మసాలాల సినిమాలు వినోదం పేరిట మత్తులో ముంచుతుంటే అన్ని వయసుల వాళ్లూ తుళ్ళుతుంటారు. బారెడు పొద్దెక్కినా అత్యధికులు నిద్రలోనే దొర్లే పరిస్థితి. పనీపాటూ లేక గాలికి తిరగడం, పోసుకోలు కబుర్లు, గిల్లికజ్జాలే యువత జీవితంగా మారుతోంది.  ఈ స్థితిని పెంచి గ్రామీణుల్ని వర్గాలుగా, గ్రూపులుగా చీల్చే స్వార్థ రాజకీయ వ్యవస్థ ద్రోహం ఇంతా అంతా కాదు. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా... గ్రామాన్ని కాపాడుకునే దారులున్నాయి. కావాల్సింది కాసింత తపన, నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ! ఎంత ఎత్తు ఎదిగినా మూలాలను మరవని పట్టణ, నగర వాసిలోని ‘ఊరెళ్లాలనే ఉబలాటం’ అభినందనీయమే! అయితే, ఏడాదిలో ఒక సంక్రాంతి రోజో, ఒక దసరా రోజో మాత్రమే గ్రామంతో అనుబంధం కలుపుకుంటేనే చాలదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే విధాన నిర్ణయాలు కావాలి. అందుకు, రాజకీయ, పాలనా వ్యవస్థలపై ఒత్తిడి తేవాలి. అంతకు మించి ఊరును కాపాడుకునే సాంస్కృతిక ఉద్యమమే రావాలి! ఊరి ఉనికి నిలబెట్టాలి!
http://img.sakshi.net/images/cms/2015-07/61438290637_295x200.jpg
 ఈమెయిల్: dileepreddy@sakshi.com                                      
 దిలీప్ రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement