సంక్రాంతి లక్ష్మీ.. స్వాగతం
సంక్రాంతి లక్ష్మీ.. స్వాగతం
Published Fri, Jan 13 2017 10:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ఊరూరా సంబరాలు
– రంగవల్లులతో రమణీయ కావ్యాలు
– గంగిరెద్దుల ఆటలు.. ఊయలల సంబరాలు
కర్నూలు(కల్చరల్): తూర్పు కొండల్లో.. ఇంకా సూరీడు నిద్రలేవక ముందే.. చీకటి దుప్పట్లను విదిలిస్తూ.. మంచుదుప్పట్లను చీల్చుకుంటూ.. మహిళలు ఇళ్ల ముంగిట కల్లాపి చల్లి.. రంగవల్లుల కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. తమ లేలేత వేలి కొసల నుంచి అందమైన ముగ్గులేస్తూ ఇంటి ప్రాంగణాన్ని రమణీయంగా తీర్చిదిద్దుతారు. ముగ్గుల్లో ముచ్చటైన గొబ్బెమ్మలను పెట్టి వీటి మధ్య నవధాన్యాలను కూర్చి.. ధాన్యలక్ష్మికి స్వాగతం చెబుతారు. కర్నూలు జిల్లాలోని పల్లె సీమల్లో ఇంటింటా సంక్రాంతి సంబర తోరణాలు వెలిశాయి. ముంగిళ్లు ముగ్గులతో మురిసిపోతున్నాయి.
కుడుములు – భక్ష్యాల తీపి వంటకాలు
జిల్లాలోని పల్లె సీమల్లో సంక్రాంతి సందర్భంగా రైతు కుటుంబాలు తీపి వంటకాలు చేసుకుంటారు. శనగపిండి, బెల్లం లేదా చక్కెర తదితర పదార్థాలతో కుడుములు చేసుకోవడం ఇక్కడి పల్లె సీమల ఆనవాయితీగా మారింది. నగరాల్లోని చాలా కుటుంబాలు భక్ష్యాలు, పాయసాల తీపి వంటకాలు చేసుకుంటారు. ఇటీవలి కాలంలో ఆధునిక తరం మహిళలు భక్ష్యాలు ఇంట్లో చేసుకునే సాంప్రదాయానికి చుక్కపెట్టి రెడీమేడ్‌గా బయట దొరికే భక్ష్యాలను కొనుక్కునే సాంప్రదాయానికి తెరతీశారు. పల్లెల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి అభ్యంగన స్నానం చేసి మహిళలు దినుసులు సిద్ధం చేసుకుంటారు. ఇరుగు పొరుగు హైందవేతరులకు ఈ పిండివంటకాల పంపిణీ చేసి కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు.
గంగిరెద్దుల మేళాలు.. సంక్రాంతి సంబరానికి దర్పణం
సంక్రాంతి పండుగ సందర్భంగా సుప్రభాతవేళ గంగిరెద్దుల మేళాలు సీమ సాంప్రదాయ కళలకు అద్దం పడతాయి. ఇంటి ముంగిట ముగ్గులేస్తున్న మహిళలు ఇంటి ముందకొచ్చిన గంగిరెద్దుకు నవధాన్యాలు పోస్తారు. అయితే ఇటీవల గంగిరెద్దుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కర్నూలు సమీపంలోని జొహరాపురంలో పలు గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కానీ గంగిరెద్దు, గోవుల జంటలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. గంగిరెద్దుల ఆటలో సీతారామ కల్యాణాన్ని ప్రదర్శించేవారు. గంగిరెద్దులు కనుమరుగవుతుండటంతో కొంతమంది గంగిరెద్దుల వాళ్లు తమ వద్దనున్న గోవును మాత్రమే తీసుకొస్తున్నారు. జిల్లాలోని డోన్, వెల్దుర్తి, బనగానపల్లె, ఎమ్మిగనూరు, ఆదోని, కౌతాళం ప్రాంతాల్లో ఒకప్పుడు సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దు ఆటలు, జడ కోలాటాలు, పలుకల కోలంట్ల ప్రదర్శనలు జరిగేవి. కాలక్రమేణా ఆయా సాంప్రదాయ కళలకు సంబంధించిన కళాకారులు పల్లెల నుండి వలస వెళ్లడంతో ఈ కళాప్రదర్శనలు తగ్గుముఖం పట్టాయి. అయినా ధాన్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ పల్లెల్లో కొత్త బట్టలతో యువతులు గొబ్బెమ్మ పాటలు పాడటం.. ఊయలలు ఊగడం, పిండి వంటలు పంచుకోవడం, సంక్రాంతి రోజున కనిపిస్తున్న సరదా దృశ్యాలు.
Advertisement
Advertisement