పల్లె‘టూర్’
♦ కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
♦ సొంత ఊళ్లో సంక్రాంతి వేడుకలకు పయనం
♦ రెండు రోజులుగా లక్షలాదిగా తరలిన జనం
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం పల్లె బాట పట్టింది. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో నగర వాసులు భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
సోమవారం కూడా ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్లు, ఉప్పల్, ఎల్‌బీనగర్, తదితర శివారు కూడళ్లు ప్రయాణికులతో పోటెత్తాయి. మరోవైపు సంక్రాంతి రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపడం లేదు. దీంతో రెగ్యులర్ రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లభించని ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు.
దీంతో విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, కర్నూలు, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అనూహ్యమైన రద్దీ నెలకొంది. బస్సులు, రైళ్లతో పాటు సొంత వాహనాల్లోనూ జనం పయనమవుతున్నారు. ఆది, సోమవారాల్లో సాధారణ ప్రయాణికులతో పాటు మరో 5 లక్షల మందికి పైగా అదనంగా బయలుదేరారు.
ఆర్టీసీ 50 శాతం అ‘ధనం’
పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ యధావిధిగా టిక్కెట్ రేట్లపై 50 శాతం అదనపు దోపిడీకి తెరతీసింది. సూపర్‌లగ్జరీ, ఏసీ, నాన్ ఏసీ బస్సులపై అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందుకేసి ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. కొంతమంది ఆపరేటర్లు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా...మరి కొందరు ప్రయాణికుల అవసరాన్ని బట్టి జేబులు గుల్ల చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రోజువారీ 3,500 బస్సులతో పాటు, సంక్రాంతికి ఈ నెల 14వ తేదీ వరకు 2,470 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక లు రూపొందించింది.
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీ పెంపు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అరకొరగా ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడపాల్సిన దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది మొండి చెయ్యి చూపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు కేవలం 19 అదనపు రైళ్లను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించింది. గత ఏడాది 43 ప్రత్యేక రైళ్లను నడుపగా... ఈసారి వాటిని సగానికి పైగా కుదించడం గమనార్హం. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి.