ఊరూరా సంక్రాంతి సంబరం
ఊరూరా సంక్రాంతి సంబరం
Published Thu, Jan 12 2017 10:48 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
- ముస్తాబైన పల్లెలు
- పిండివంటలు ప్రత్యేకం
- నాటుకోడి, దోసె.. భోగి ప్రత్యేకత
కోవెలకుంట్ల/దొర్నిపాడు:
సంక్రాంతికి పల్లెలు ముస్తాబవుతున్నాయి. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో గ్రామ లోగిళ్లు కళకళలాడుతన్నాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌డివిజన్ దొర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం, అర్జునాపురం, వెంకటేశ్వరనగర్ (డాక్టర్ కొట్టాల), రాజనగరం, అమ్మిరెడ్డినగర్, భాగ్యనగరం గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. గుంటూరు, ఒంగోలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 60 సంవత్సరాల క్రితం ఇక్కడి వచ్చి వీరు గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను సాంప్రదాయాను సారం నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగ, విద్యాభ్యాసరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా.. ఇప్పటికే ఆయా గ్రామాలకు చేరుకున్నారు.
ఆనందపు హరివిల్లు..
గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తి. ప్రతి ఏటా వరి, మినుము, జొన్న, కంది, సీడుపత్తి, శనగ, తదితర పంటలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. డిసెంబర్ ఆఖరు నాటిని ధాన్యం ఇళ్లకు చేరుతుంది. దీంతో రైతులు, కూలీల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసి పండగ వాతావరణం నెలకొంటుంది. చిన్న, పెద్ద కుటుంబం అన్న తేడా లేకుండా అందరూ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట్లో పది రకాల పిండి వంటలు కన్పిస్తాయి. పాలతాళికలు, గారెలు, బెల్లం, చెక్కర లడ్డూలు.. నెల్లూరు, రాయలసీమ కర్జికాయలు, చక్రాలు, బూరెలు, ఉప్పు చెక్కలు, కారాలు, నేతి అరిసెలు తయారు చేస్తారు. మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో చిన్న కుటుంబంలోనైనా దాదాపు రూ. 25 వేల నుంచి రూ. 30వేల వరకు ఖర్చు చేస్తారు.
సందడే సందడి...
వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న వారంతా భోగి రోజుకు ముందే గ్రామాన్ని చేరుకుంటారు.
భోగి రోజున పిల్లల నెత్తిపై రేగుపండ్లు పోసి వేడుక నిర్వహిస్తారు. నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబాలకు భోగి రోజున నాటుకోడి, గారెలు వండుతారు. మిగిలిన వారు.. భోగి మంటలు వేసి గారెలు, పులిహోరతో దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారు. రామచంద్రాపురం గ్రామంలో సంక్రాంతి రోజున కొత్త దుస్తులు ధరించి రామాలయంలో సీతారాములకు అభిషేకం చేస్తారు. సాయంత్రం ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామనడి బొడ్డున ఉన్న కోనేటిలో తెప్పోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. కనుమ రోజున నాటుకోడి, జొన్నరొట్టె.. వంటకాలు ప్రత్యేకం. ముగ్గులు, ముచ్చట్లు, పిండి వంటకాలు, కాలక్షేపంతో మూడు రోజులు గ్రామస్తులందరూ ఆనందాన్ని పంచుకుంటారు.
పెద్ద కుటుంబాలు..ప్రత్యేక సంబరాలు..
రామచంద్రాపురం, భాగ్యనగరం గ్రామాల్లో స్థిరపడిన బబ్బూరి, తాళ్లూరు, కరిమాల కుటుంబాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకం. ఒక్కో కుటుంబంలో 50 నుంచి 100 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా ఎక్కడ ఉన్నా పండుగకు సొంత గ్రామాలను చేరుకుంటారు. బబ్బూరి వెంకటస్వామి కుటుంబంలో వంద మంది సభ్యులు ఉన్నారు. వీరి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, విద్యాభాస్యం చేస్తున్నారు. అలాగే భాగ్యనగరం గ్రామానికి చెందిన జయరాం నాయుడు, గోపాల్ నాయుడు, వెంకయ్య నాయుడు, ఆనందరావు నలుగురు అన్నదమ్ములు. వీరిదీ పెద్ద కుటుంబమే.. వీరి కుమారులు, కోడళ్లు వైద్యులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా.. హైదరాబాద్, ఆస్ట్రేలియా..తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
సంక్రాంతి పండుగ ప్రత్యేకం: బబ్బూరి వెంకటస్వామి
పంట ధాన్యం చేతికందిన తర్వాత నిర్వహించే మొదటి పండుగ సంక్రాంతి. మూడు రోజులపాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటాం. చదువు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పండుగకు ఒక రోజు ముందుగానే గ్రామాన్ని చేరుకుంటారు. మా కుటుంబంలో సుమారు వంద సభ్యులతో పండుగను జరుపుకుంటున్నాం.
పిండి వంటలు ప్రత్యేకం: రాజేశ్వరి
సంక్రాంతి పండుగకు పది రకాల పిండి వంటలు తయారు చేసుకుంటాం. ప్రతి ఇంట్లో ఈ పిండి వంటలు ఉంటాయి. పండుగ రోజున కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి వచ్చే హరిదాసులు, భిక్షాటకులకు పిండి వంటలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక మనిషి ఏర్పాటు చేస్తాం.
మూడు రోజులు ఇళ్లముందర ముగ్గులే: లక్ష్మి
సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, మకర, కనుమను అత్యంత వైభవంగా జరుకుంటాం. మూడు రోజులపాటు ఇళ్ల ముందర అందమైన ముగ్గులు వేసి కుటుంబ సభ్యులమంతా ఒక చోట చేరి ఆనందాన్ని పంచుకుంటాం. పండుగ ముగిసిన మరుసటి రోజున ఎక్కడివారు అక్కడికి వెళ్లేపోవడంతో పండుగ ముగుస్తుంది.
Advertisement
Advertisement