ఇది అందరి పండగ
సంక్రాంతి
రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరే గాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసులతో, అందంగా అలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగు వెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి. ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమానుబంధాలతో అసలు సిసలైన ఆనందాల పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింతకాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైన సంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలంకరించుకున్న పందిరి మన పచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగం మన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో, ఎడ్ల పందాలతో ఊరంతా çహోరెత్తిపోయే సంతోషాల వడి ఈ సంబరాల సంక్రాంతి. నేతి అరిసెలతో కొబ్బరిబూరెలతో కలగలపు కూరలతో ఘుమఘుమలాడించే అరిటాకు భోజనం మన కమ్మనైన సంక్రాంతి. ఊరంతా పేరంటాలతో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతులతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.
పితృదేవతల పండగ. పిల్లల పండగ. పెద్దలు, వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు.
ఈ రోజు ఏం చేయాలంటే..?
సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.