సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.
భోగితో ముగుస్తుంది:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.
శ్రీకృష్ణుడికి తులసిమాల
ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.
శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం.
ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
కోరికలు నెరవేరుతాయి
వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?
ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.
పాశురములు చదివేటప్పుడు..
మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.
నైవేద్యం సమర్పంచాలి
(రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం*
Comments
Please login to add a commentAdd a comment