హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దశాబ్దాలుగా అంతంతమాత్రంగానే ఉంటున్న గ్రామీణ ఎకానమీ క్రమంగా పుంజుకుంటోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ ప్రియాంక ఖండేల్వాల్ తెలిపారు.
దేశ జీడీపీలో దాదాపు సగ భాగం వాటా ఉన్నప్పటికీ, ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ వ్యవసాయం మీదే ఎక్కువగా ఆధారపడటం వల్ల గ్రామీణ ప్రాంతాలవారి ఆదాయాలు పెద్దగా మారటంలేదని ఆమె పేర్కొన్నారు. దీనితో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆదాయాల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. అయితే తయారీ రంగం, నిర్మాణ రంగాలు మెరుగ్గా రాణిస్తుండటం, నైపుణ్యాల అభివృద్ధి.. స్వయం ఉపాధిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుండటం వల్ల వ్యవసాయేతర ఉపాధి పెరగనుందని, గ్రామీణ ప్రాంతాల వారికి వచ్చే దశాబ్ద కాలం మరింత సానుకూలంగా ఉండగలదని ప్రియాంక చెప్పారు.
గ్రామీణ ఆదాయాలు పెరగడం వల్ల వినియోగం, కనెక్టివిటీకి డిమాండ్ నెలకొంటుందని ఆమె చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్, రవాణా, సౌకర్య సంబంధ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని తెలిపారు. అలాగే, మెరుగైన మౌలిక సదుపాయాలు, చౌకగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి కనెక్టివిటీ పెరగడం వల్ల టెలికం, ఆటో, కన్జూమర్ ఫైనాన్సింగ్ తదితర విభాగాలు రాణించగలవని వివరించారు.
అటు ఆదాయాల పెరుగుదలతో పొదుపు, అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలకు డిమాండ్ నెలకొంటుందని ప్రియాంక చెప్పారు. అక్షరాస్యత, కొత్త నైపుణ్యాలతో గ్రామీణ యువత సంప్రదాయ సాగు ధోరణులకు భిన్నంగా కొత్త విధానాలను అమలు చేసే కొద్దీ వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుందని వివరించారు.
గ్రామీణాభివృద్ధి, వినియోగం ఆధారిత రంగాలతో ముడిపడి ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆయా రంగాల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రూరల్ ఆపర్చూనిటీస్ ఫండ్ ఇదే లక్ష్యంతో పని చేస్తోందని ఆమె చెప్పారు. దీనికి నిఫ్టీ ఇండియా రూరల్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment