భయం నిర్భయం నడుమ...? | nirbhaya video incident creats challenging for india | Sakshi
Sakshi News home page

భయం నిర్భయం నడుమ...?

Published Fri, Mar 6 2015 12:46 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

భయం నిర్భయం నడుమ...? - Sakshi

భయం నిర్భయం నడుమ...?

ఎన్ని చర్యలు తీసుకున్నా, సంప్రదాయ నియంత్రణా పద్ధతులేవీ ఫలితాలివ్వనప్పుడు, మహిళల పట్ల పురుషల ఆలోచనా ధోరణిలోనే మార్పు తేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముందు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? నికృష్టుడి నీచపు వ్యాఖ్యలు మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగుకప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం.
 
 ‘తలనొప్పి వచ్చిందీ!’ అనంటే, ‘తల తీసేస్తే పోలా?’ అన్నది మన పాల కుల వైఖరి. వారు అనుసరించే పద్ధతి కూడా అదే అనడానికి ‘భారతపుత్రి’ (ఇండియాస్ డాటర్) డాక్యుమెంటరీని  కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధించిన తీరే నిదర్శనం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన జబ్బేమీ కాదు. సత్యజిత్ రే వంటి ప్రపంచస్థాయి దర్శకుడు ‘పథేర్ పాంచాలి’ అనే ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తే, భారత పేదరికాన్ని బయటి ప్రపంచానికి ఎత్తి చూపు తున్నాడని బలమైన ఓ వర్గం  విమర్శించిన నాటి నుంచీ ఈ ఒరవడి కొనసా గుతున్నదే! దేశభక్తి, సంస్కృతి, మత భావనలు, ఇతర భావోద్రేకాంశాలు వివాదాస్పదం కావడం ఇక్కడ మామూలే! వివాద సందర్భాల్లో భావ వ్యక్తీక రణ స్వేచ్ఛపై ఇటువంటి అధికారిక నిషేధాలు ఈ దేశంలో తరచూ జరుగుతు న్నవే! కానీ, ఆ ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నపుడు, భవిష్యత్ ప్రయోజనాలకు భంగకరమైన సంకేతాలిస్తున్నపుడు అంతా అప్ర మత్తం కావాల్సిందే! అత్యాచారాల సంస్కృతి, బాధితుల్నే తూలనాడే వైఖరి, దర్యాప్తుల్ని నీరుగార్చి నేరప్రవృత్తిగల వారిలో ధీమా పెంచే దుస్థితికన్నా కూడా... ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలియడమే పెద్ద ఘోరమ న్నట్టు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్టే ఈ డాక్యుమెంటరీ పరివ్యాప్తిని కూడా నిషేధం నియంత్రించలేకపోతోంది.
 
 బీబీసీ ఇప్పటికే దీన్ని ప్రసారం చేసింది. యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. బీబీసీకి నోటీ సిచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ప్రసారాల్ని అదుపుచేసే చర్యల్ని ప్రారంభించింది. రెండేళ్ల కింద, 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ పాశవిక అత్యాచారం, హత్య కేసు పూర్వాపరాలు కథావస్తువుగా లెస్లీ ఉద్విన్ దాదాపు గంట నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. నిర్భయ కేసులో శిక్షపడిన దోషుల్లో ఒకరైన ముఖేష్‌సింగ్ ఇంటర్వ్యూ కూడా అందులో ఉంది. బాధితురాలిపైన, మొత్తం మహిళలపైన అతడు ఆ ఇంటర్వ్యూలో విపరీత వ్యాఖ్యలు చేశాడు. దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అం తకుముందు ఒక భారత టెలివిజన్ సంస్థతో కలిసి ప్రసారం చేస్తామని బీబీసీ ప్రకటించింది. దీంతో అందులో ఏముందోనని పత్రికల్లో కథనాలు రావడం, ఆ వెంటనే పార్లమెంట్‌లో దుమారం, ప్రసారాలపై నిషేధం.. అన్నీ చకచకా సాగిపోయాయి. నిజంగానే అదంత అభ్యంతరకరమా? అని కొందరు, ప్రజా స్వామ్యంలో ఒక డాక్యుమెంటరీపై నిషేధమా? అని ఇంకొందరు, ఒక దోషిని ఇంటర్వ్యూ చేయడమేమిటి, అతనలా నిస్సిగ్గుగా అమానవీయ వ్యాఖ్యలు చేయడమేమిటనే ఆగ్రహంతో మరికొందరు... కారణమేదైతేనేం చాలా మం దే డాక్యుమెంటరీని చూస్తున్నారు. చూడాలి కూడానని విజ్ఞుల అభిప్రాయం.
 
 అవునూ... చూస్తే తప్పేంటి?
 
 ఈ వివాదంపై ప్రస్తుతం మూడు రకాల ఆలోచనా ధోరణులు సాగుతు న్నాయి. నిషేధం తప్పు, డాక్యుమెంటరీని అంతా చూడాలన్నది ఒక అభిప్రా యమైతే, ఇది దురుద్దేశ్యంతో, తప్పుడు భావనల వ్యాప్తి కోసం రూపొందిం చిన డాక్యుమెంటరీ కనుక నిషేధమే సబబన్నది మరో అభిప్రాయం. మూడో అభిప్రాయమూ ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగా శిక్షపడిన ఖైదీగా ఉన్న దోషి అభిప్రాయాల్ని, వ్యాఖ్యల్ని జోడించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం సముచితం కాదన్నది ఈ భావన. అనైతిక పద్ధతుల్లో ముఖేష్ ఇంటర్వ్యూ సంపాదించడం, చట్ట విరుద్ధంగా తిహార్ జైలు అధికారులు ఆ అవకాశం కల్పించడం, ఇలాంటి అత్యాచారాలు అంతటా జరుగుతున్నపుడు ఒక దేశం, ఒక వర్గం, ఒక కేసునే ప్రాతిపదిక చేసి కథనం నడపడం... వంటి అంశాలపైనా వీరికి అభ్యంతరాలున్నాయి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపీడబ్ల్యూఏ) కార్యదర్శి కవితా కృష్ణన్ లాంటి వారు ఈ భావన లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రసారాల్ని వాయిదా వేయాలని స్థానిక మీడియా సంస్థల్ని కోరిన వీరు, తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరు పుతున్నారు.
 
 పాలక-విపక్షాలతో సహా కొన్ని రాజకీయపక్షాలు, మత, సామా జిక, సేవా సంఘాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు డాక్యుమెంటరీపై తీవ్ర ఆగ్ర హంతో ఉన్నాయి. ఎలా జరిగిందో తేల్చాలని అంతర్గత  దర్యాప్తునకు ఆదే శించి, ప్రసారాలు పరివ్యాప్తం కాకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. వారికి రకరకాల అభ్యంతరాలున్నప్పటికీ, నిషేధానికి ప్రధానమైనదిగా చూపుతున్న కారణాలు మాత్రం రెండు. ఒకటి పాశవిక అత్యాచార నేరానికి పాల్పడ్డ దోషిని ఇంటర్వ్యూ చేసి, అమానుషమైన అతని వ్యాఖ్యల్ని ప్రచారంలోకి తేవడం. అత్యాచారాలకు, ఇతర హింసకు గురవుతున్న మహిళలపైనే కాక మొత్తంగా మహిళలపైనే దాడిగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు. రెండోది, పాశవిక అత్యాచారాలు, ఇతర నేరాలు ఒక్క మన దేశంలోనే జరుగుతున్నట్టు, ఇవికాక ఇక్కడ ఇంకేమీ లేనట్టు బయటి ప్రపంచంలో భారత్‌ను అప్రదిష్ట పాల్జేయాలని పనిగట్టుకొని తీసిన డాక్యుమెంటరీ ఇది అన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇదే వారి తీవ్ర ఆగ్రహానికి కారణం.
 
 చర్చ జరగడమే ఆరోగ్యకరం
 
 ప్రాధాన్యతగల అంశాల్ని మామూలుగా, అతి మామూలు విషయాల్ని అత్యం త ప్రాధాన్యతగల అంశాలుగా మన పాలకులు తిరగేసి చూస్తున్నారని ఎక్కు వగా వినిపిస్తున్న విమర్శ. తాజా ఉదంతంలో వారి వ్యవహారశైలే అందుకు తార్కాణం. మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి వాటిని నియంత్రించడంపై పెట్టాల్సిన శ్రద్ధాసక్తులను, వాటి వ్యతిరేక ప్రచారాన్ని నియంత్రించడంపై చూపుతున్నారు. నికృష్టుడు ముఖేష్ నీచపు వ్యాఖ్యలను మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. ‘దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్ని ఇది అద్దం పట్టి చూపింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగు కప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. నిర్భయ ఉదంతం తర్వాత ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు లేచాయి. సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తక్కువ సమయంలో ఇం తటి వ్యవస్థీకృత ఉద్యమాన్ని మున్నెప్పుడూ చూడలేదు. ‘ఇంత ఘోరమా!’ అని లోకమంతా ఒక్క గొంతై అరిచింది. ప్రభుత్వాలు స్పందించాయి. దర్యా ప్తును ముమ్మరం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరచి, విచారణను వేగిరపరిచి నిందితుల్ని దోషులుగా నిర్ధారించి మరణదండన విధించారు. కానీ, ఇదే వేగం, నిక్కచ్చితనం ఇతరత్రా వందలు, వేల అత్యాచార కేసుల్లో జరగటం లేదు. ఇది కేవలం భద్రతా చర్యలు, పోలీసు దర్యాప్తులు, న్యాయ విచార ణలు, చట్టాల్లో పొందుపరచిన శిక్షలు తదితర అంశాలకు మాత్రమే సంబం ధించినది కాదని తేటతెల్లమైంది. ఇంకేదో జరగాలి, అప్పుడే ఈ నేరాలు అదు పులో కొస్తాయని స్పష్టమైంది. బలంగా పాతుకుపోయిన ఈ పురుషాధిక్య వ్యవస్థలో ఆలోచనా ధోరణి మారాలనే అభిప్రాయం బలపడుతూవచ్చింది. ఇందుకవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజాసంఘాలు, అధ్య యన నివేదికలు స్పష్టంచేస్తున్న తరుణంలో... ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా భద్రత, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటి సంప్రదాయ నియంత్రణా పద్ధతులు ఫలితాలివ్వనప్పుడు, మహిళలపట్ల పురుషల ఆలో చనా ధోరణిలోనే మార్పుతేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముం దు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? ‘భారత పుత్రి’ డాక్యుమెంటరీలో ఉన్నదదే. మహిళలపట్ల స్థాయీ భేదాలు లేకుండా ఉన్న ధోరణి ఏంటో అద్దం పట్టింది. దోషితోనే కాకుండా దోషుల తల్లిదండ్రులతో, బాధితురాలి తల్లిదండ్రులతో, రిటైర్డు న్యాయమూర్తితో, న్యాయవాదులతో, సామాజిక కార్యకర్తలతో, బాధితురాలి మిత్రుడితో... ఇలా వివిధ వర్గాల వారితో మాట్లాడించి రూపొందించిన ఆ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితిని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అది ఖచ్చితంగా ఓ ఆరోగ్యకరమైన చర్చకు దారితీస్తుంది. మహిళలపట్ల పురుషుల ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో చెబుతుంది. ఎలా ఉండాలనే వైపు చర్చను రేకెత్తిస్తుందని, ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమేనని పరిశీలకుల అభిప్రాయం.
 
 మాట్లాడకుండా ఎవరినాపగలిగామని?
 
 నిర్భయ కేసు దోషుల చర్యల్ని, వారి అమానుష ఆలోచనా ధోరణిని, అను చిత వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరు. పైగా అసహ్యించుకుంటారు. అవిద్య, అజ్ఞానం, మురికివాడల్లో పెరిగిన నేపథ్యం కలిగిన ముఖేష్ వ్యాఖ్యలు దారుణం, అభ్యంతరకరం. అయితే, ఆయన తరపు న్యాయవాది వ్యక్తీకరణ, భావజాలం, మహిళలపట్ల అతని ఆలోచనా ధోరణి ముఖేష్ మాటలకన్నా నీచంగా ఉండటం గమనార్హం. మహిళలపై అత్యాచారాలు జరగొద్దంటే, వారెలా ఉండాలి, ఎలా బట్టలేసుకోవాలి, ఎప్పుడెప్పుడు-ఎక్కడెక్కడికి- ఎవరితో వెళ్లాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి...అని చెప్పే పెద్ద మనుషుల జాబితా చాంతాడంత. ఒక న్యాయవాది, ఒక సాధుమహరాజ్, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి, ఒక మంత్రి, ఓ పార్టీ అధినేత, ఒక ఎమ్‌పీ, ఒక డీజీపీ... ఇలా పెద్ద పెద్ద హోదాలున్న మహానుభావులు మహిళల పట్ల వ్యక్తం చేసిన చిల్లర అభిప్రాయాలు ముఖేష్ మాటల కన్నా తక్కువ నీచమైనవేం కావు. వాటిని నిషేధించవద్దా? నిషేధించామా? నిషేధించగలమా? వాటిని నిషేధిం చలేనపుడు, అవి యథేచ్ఛగా షికార్లు చేస్తున్నప్పుడు, అవి ఏ నష్టమూ కలగ జేస్తలేవనుకున్నప్పుడు, ముఖేష్ ముతక మాటలే తీరని నష్టం కలిగిస్తాయ నడంలో అర్థమేముంది? డాక్యుమెంటరీపై నిషేధం సాధించగల ప్రయోజన మేముంటుంది? ముఖేష్ వ్యాఖ్యలనైనా తొలగించి డాక్యుమెంటరీని ప్రసారం చేయనిస్తే బాగుండేది. పురుషుల ఆలోచనా ధోరణి మారేలా భావజాల వ్యాప్తి జరగాలి. మహిళలపై ధాష్టీకాలకు వ్యతిరేకంగా ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు రావాలి. పాలకులు వారి మాట వినాలి, వారితో చర్చించాలి. మహిళలపై జరుగుతున్న ధాష్టీకాలకు వ్యక్తుల్ని, కుటుంబాల్ని, సమాజాల్ని, ప్రభుత్వాల్ని, న్యాయస్థానాల్ని అందర్నీ బాధ్యుల్ని చేస్తూ, జవాబుదారుగా నిలపాలి. స్త్రీ, పురుషుల మధ్య హెచ్చు తగ్గులు లేవు, ఆకాశంలో కాదు, నేల మీద సగం నువ్వు, సగం నేను కావాలి.

ఆర్. దిలీప్ రెడ్డి  
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

ఈమెయిల్: dileepreddy@sakshi.com                

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement