గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...! | Not only voice out but also shirts to be teared | Sakshi
Sakshi News home page

గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...!

Published Mon, Mar 16 2015 12:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...! - Sakshi

గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...!

మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకి ఆమెకు అనుమతి ఎవరిచ్చారో మీకు తెలియ దన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్‌వన్ నేరమని తీర్పిచ్చారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్‌కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది?  
 
 గొల్లపూడి మారుతీరావు గారూ! నిర్భయ గురించి నిర్భీతిగా మీరు రాసింది చూశాం. భారతదేశం గొప్పదనీ, ఆదర్శ ప్రాయమైనదనీ  ప్రపంచమం తటా చాటాలన్న మీ తపన మాకెంతో ఆనందంకలిగించిం ది. అచ్చు మాలాంటి అభిప్రా యాలే మీకూ ఉన్నందుకు ముచ్చటేసింది. పైగా మనది గొప్పదేశం కాదనీ ఏ వలసవాది కానీ తప్పుడు ప్రచారం చేస్తే వాడి గుడ్లు పీకి వాడి చేతుల్లోనే పెట్టాలనేంత కోపం మాతోపాటే మీగ్గూడా నూటా యాభై ఏడు శాతం ఉండ టంతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించేశాం.పైగా మీ నటనకే కాదు సాహిత్యంలో, సినీ చరిత్ర అధ్యయనంలో మీకున్న ప్రతిభను చూసి అప్రతిభులవుతున్నవాళ్లమే. సినిమా ఫీల్డ్‌లో కూడా చదువుకున్న వాళ్లుంటారా అని ముందుగా మిమ్మల్నీ, మీలాంటి మరి అతి కొద్ది మంది నీ చూసి విస్తుపోయాం. మీ కాలమ్ ఏ పత్రికలో వచ్చినా ముందుగా దాన్నే చదివి అభిమానులమయ్యాం.
 
 మనల్ని బానిసత్వంలో మగ్గించిన ఒక దుష్టదేశం లో పుట్టిన దెష్ట మహిళ తప్పుడు మాటలు ఎవ్వరూ ఎప్పుడూ వినరాదనీ, కనరాదనీ మీరనుకున్నట్టే మేము అనుకున్నాం. మీకూ మాకూ జమిలిగా గల దేశభక్తి అలాంటిది. ఎవడో ఒక రేపిస్టూ ప్లస్ ఇద్దరు లా రేపిస్టు లూ చెప్పిన ముష్టిమాటలు... సకల భారతీయ మగ పురుషుల అభిప్రాయాలు కాదనీ గొంతుచించుకుని అర వాలనుకున్నాం. కానీ ఖర్మ కొద్దీ మీరు కాలమ్ రాయక ముందే మీరు చూడని డాక్యుమెంటరీ చూశాం.
 
  మీరు లెక్క చేయని కొన్ని డైలీలూ, మేగజైన్లూ చదివాం. పైగా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నట్టుగా ఈ జర్నలిజంలో నల భై ఐదేళ్లుగా ఉన్నవాళ్లం. ‘నిర్భయ’ ముందూ, ఆ తర్వా తా మన దేశంలో ప్రతి రోజూ సెలవుల్లేకుండా ఎడ తెరపి లేకుండా జరుగుతున్న రేప్‌లూ, మర్డర్లను ఈ పాపిష్టి చేతుల్తోనే రాస్తున్నాం. అందుకే ఆ డాక్యుమెంటరీ చూసి నప్పుడు మీరు చెప్పిన మానవమృగం ముఖేష్‌సింగ్ ఒంటరివాడు కాదనిపించింది. అతని డిఫెన్స్ లాయర్లి ద్దరూ కూడా బొత్తిగా ఒంటరివాళ్లు కానేకాదనిపించింది.

 

ఆడదాని తిక్క కుదర్చడానికి గ్యాంగ్‌రేప్ శిక్షలు సాధికా రికంగా విధించే వందలు, వేల ఖాప్ పంచాయతీలు గుర్తొచ్చాయి. పెదరాయుళ్లు చినరాయుళ్లూ కలిసి ఆడ దాని ప్లేస్ ఎక్కడో చెప్పే ప్రబోధాలు వినిపించాయి. మగమహారాజులు లాగి తంతేనే జన్మధన్యమైనట్టుగా థ్రిల్లయి ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ అని పాడే బంగారు కోడిపెట్టలు కెవ్వున కేకేస్తూంటే, అది జాతినుద్దేశించిన సందేశంలా చక్కగా, సిగ్గు లేకుండా 70 ఎం.ఎం స్క్రీన్ మీద పరచుకుంటుంటే  తమరి ధర్మాగ్రహం, సత్యా గ్రహం యాడబోయాయి.
 
 ‘ఈమెనే సర్వదావాడం డి’ అంటూ బోర్డుపెట్టి అసభ్యంగా చూపిన పచ్చి ఫ్యూడల్ దురహంకారాన్ని, పిచ్చి మేల్ షావనిస్టు పిగ్గరీ ని ఇంత కాలం మౌనంగా చూసిన, చేసిన మీకు ఇంత లోనే అంత కోపమెందుకో! పైగా ఆ సింగూ, ఈ సింగూ మరొకడూ తప్ప దేశమంతటా పురుగులెవరూ లేరనీ అంతా మహాపురుషులేనననీ మీరు జరిపించిన అఖిల భారత సర్వేలో తేలిందంటున్నారు. అది నిఖార్సైన, పదహారణాల పచ్చి అబద్ధం.

 

అందుకే, ఈస్టిండియా కంపెనీ పెట్టిన ఆ దేశంలో పుట్టిన దెష్ట మహిళ చెప్పిందే నిజం, చూపిందే సత్యం అని జావేద్ అఖ్తరూ, షబనా అజ్మీ, బృందాకారత్, ఎన్.రామ్, నేనూ మావాళ్లూ ఇంకా అనేక మంది బుర్రా బుద్ధీ లేని మూర్ఖులం అందరం కూడబలుక్కుని గొంతులు చించుకుందామనుకున్నాం. అవసరమైతే చొక్కాలూ, గుండీలూ చించుకోవాలనీ, గుండెలు బాదుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. ఈ రేపిస్టులూ, వారిష్టులూ అయిన లాయర్ల మాటలు ప్రపంచంలో మన పవిత్ర భారతదేశం పరువు తీస్తున్నా యని మీరు బెంగపడడం బ్లాక్ అండ్ వైట్ అచ్చులో కనిపించింది. మీ ముక్కుల్లోంచీ, చెవుల్లోంచీ ఆగ్రహం పొగలుమియడం మల్టీకలర్‌లో చూశాం.
 
 మన పరువు కొత్తగా పోయేదేం లేదు. మన దేశం లో వరకట్న దహనాల్లో కాలి చచ్చిన అమ్మాయిల లిస్టు మన పత్రికల్లోనే కాదు, ఐరాసలో కూడా ఉంది. యాసిడ్ దాడుల్లో ముక్కులూ మొహాలూ కరిగిపోయిన అంద గత్తెల లెక్కలూ ఉన్నాయి. రోజువారీ రేప్‌లూ, హత్యల జాబితాలూ దొరుకుతాయి. ఇది మనందరం ఎంతో శ్రమించి ప్రేమించి కట్టుకున్న దుర్మార్గపు సమాజం. ఇందులో అంతర్భాగంగా ఉన్న ‘స్ట్రక్చరల్ వయొలెన్స్’ ఇదెవ్వరూ చూడకూడదనీ ఎవ్వరికీ కనిపించకూడదని మీ కాళ్లూ చేతులతో కప్పెట్టినా, చివరికి మీ నొటోరియస్ డబుల్ చిన్ అడ్డం వేసినా ఆగేది కాదు. ప్రపంచపుటద్దం ఉంది. ఎదురుగా మన దేశం మొహముంది.
 
 ‘ఇండియాస్ డాటర్’అని శ్వేతజాతి మహిళ ఉడ్విన్ డాక్యుఫిలిం తీయడమంటే మనల్ని భ్రష్టుపట్టించడానికే ననుకుందాం. మరి ‘గాంధీ’ సినిమా తెల్లతోలువాడైన అటెంబరో తీసినప్పుడు తమకు కోపమెందుకు రాలేదో. బ్రిటన్‌లో రేప్‌లు లేవని ఆవిడేం అనలేదు. పైగా ‘నేను రేప్‌విక్టమ్’నని చెప్పింది. ఆమెకి బ్రిటన్ మీద ప్రేమా లేదు ఇండియా మీద ద్వేషమూ లేదు. జర్నలిస్టు, ఆర్టిస్టు అంతే. ఇంతకాలం జర్నలిజంలో ఉన్నందుకు ఆ విదేశీ దెష్ట మహిళ చెప్పిన తప్పుడు మాటల్లాంటి వాటితో ఒక న్యూస్ స్టోరీ రాయగలిగి ఉంటే జన్మధన్యమై నట్టే ఫీలవుతాం. అలాంటి డాక్యుమెంటరీ చేయగలిగుంటే గొప్ప కర్తవ్యం ముగించి నట్టు సంతృప్తి పొందేవాళ్లం.
 
 ఇక ఉడ్విన్ నేరాలూ ఘోరాలను మీరు ఏకరువు పెట్టిన తీరు భలే ఫన్నీగా ఉంది. మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకు అను మతి ఎవరిచ్చారో మీకు తెలియదన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్ వన్ నేరమని ఢంకా బజాయించారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్‌కీ,  మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది. కాలమ్ రాసే ముందు కనీసం మూడు నాలుగు రోజులనాటి న్యూస్ పేపర్లూ తిరగేస్తే పోయేదే ముంది. నిర్భయ పేరునీ, ఫొటోనీ ప్రకటించిందట అంటూ టకారంతములేల. ఇంటర్నేషనల్ రిలీజ్‌లో అలా చేసుకోవచ్చని ఆమె అమ్మా, నాన్నలే అనుమతినిచ్చారు.
 
 ఈ పుకార్ల శృతపాండిత్యమెందుకు? డాక్యుమెంటరీని అధికారులకి చూపి సమ్మతిని తీసుకోలేదని మీకెలా తెలిసింది? అడుగడుగునా సకల అనుమతులూ తీసు కుందావిడ.  కావాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపి స్తాం. ‘హిందూ’ పత్రిక ఎన్.రామ్‌ను అడిగితే సకల పత్రాలూ, సాక్ష్యాలూ  చూపిస్తాడు. మరి ముఖేష్‌తో40 వేలకు బేరం కుదిరిందని తేలిన మీ ఇన్వెస్టిగేటివ్ రిపో ర్టింగ్‌కు ఆధారంగా ఓ చిత్తుకాయితం ముక్కయినా చూపించగలరా? పురపురా రాసేయడం కాదు. కాస్తంత వెనకా ముందూ చూసుకోవాలి. నరాలు ఉప్పొంగినప్పు డు నిజాలెందుకొస్తాయి. అవి టపామని తెగినప్పుడు రీజన్ చస్తుంది. ప్యూర్ ఫిక్షన్ వస్తుంది. ఆవిడ డబ్బు చేసుకోడానికే ఇంతటి పాతకానికి ఒడిగట్టిందంటు న్నారు. లక్షా ఇరవైవేల పౌండ్లు అప్పులో పడి మరీ ఎన్.డి.టి.వి.కి ఉచితంగా పైసా తీసుకోకుండా ప్రసారానికిచ్చింది!
 
అన్నట్టు మీకు తెలుగుసరిగ్గా రాదని కొన్ని ఇంగ్లీషు పదాలు రాశారు. మేమందరం అంతే. అచ్చు మీలాగే బ్రిటీష్ బానిసలుగా పుట్టాం. అయినా ఒక సృజనాత్మక జర్నలిస్టును ‘షటప్’ అన్నా సరే మిమ్మల్ని మెకాలే వింగ్లిష్‌లో ‘గెటౌట్’ అనలేం. కారణం మీకున్న సమా చారం, నాలెడ్జి తెలుసు. ఇంత తెలిసివుండీ ఈ గుణమేం టోననుకుంటాం. ఇలాంటి బోలు వాదనలు చేసినా, మూర్ఖపు రాతలు రాసినా గౌరవం చావట్లేదు. కనికరమే గాని కసి కలుగుట లేదు. ఎడ్మిరేషన్‌తో...
(అప్పుడు మీ నవలకి ముఖచిత్రం గీసిచ్చి, మీ ముచ్చట చూసి సరదా పడ్డ వెర్రి ఆర్టిస్టును, జర్నలిస్టును)
- వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు
     మొబైల్ : 7702841384
 - మోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement