నిందితుల వాదన వినకుండానే జీవిత ఖైదు విధించిన ప్రత్యేక కోర్టు
ప్రత్యేక కోర్టు హడావుడి ట్రయల్‌పై ఆక్షేపణ
ఇది నిష్పాక్షిక ట్రయల్ కిందకు రాదని స్పష్టీకరణ
ప్రత్యేక కోర్టు తీర్పు రద్దు.. తిరిగి మొదటి నుంచి విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి : ఓ క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుల వాదన వినకుండా, వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కనీసం వారికి న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) కూడా అందించకుండా కేసు విచారణ (ట్రయల్) మొదలు పెట్టి, నెల రోజుల్లో వారికి శిక్ష విధిస్తూ ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రయల్ నిష్పాక్షికంగా జరగనప్పుడు న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది.
తిరిగి మొదటి నుంచి (డీ నోవో) విచారణ మొదలు పెట్టాలని, 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం.. ఏలూరుకు చెందిన బోడ నాగ సతీష్ తన స్నేహితులైన బెహరా మోహన్, బూడిత ఉషాకిరణ్‌లతో కలిసి 2023 జూన్ 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు.
దీంతో పోలీసులు వీరితో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 15న నాగ సతీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జూలై 7న చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆగస్టు 16న ట్రయల్ మొదలుపెట్టింది. అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది.
నాగ సతీష్, మోహన్, ఉషాకిరణ్‌లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నాగ సతీష్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి, పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment