usha kiran
-
క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు
సాక్షి, అమరావతి : ఓ క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుల వాదన వినకుండా, వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కనీసం వారికి న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) కూడా అందించకుండా కేసు విచారణ (ట్రయల్) మొదలు పెట్టి, నెల రోజుల్లో వారికి శిక్ష విధిస్తూ ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రయల్ నిష్పాక్షికంగా జరగనప్పుడు న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. తిరిగి మొదటి నుంచి (డీ నోవో) విచారణ మొదలు పెట్టాలని, 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం.. ఏలూరుకు చెందిన బోడ నాగ సతీష్ తన స్నేహితులైన బెహరా మోహన్, బూడిత ఉషాకిరణ్‌లతో కలిసి 2023 జూన్ 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో పోలీసులు వీరితో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 15న నాగ సతీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జూలై 7న చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆగస్టు 16న ట్రయల్ మొదలుపెట్టింది. అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది. నాగ సతీష్, మోహన్, ఉషాకిరణ్లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నాగ సతీష్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి, పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్‌ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు (ఫోర్‌మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్‌షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వెబ్‌సైట్‌ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్‌కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్‌సైట్‌పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
బస్తర్ అడవుల్లో మహిళా డైనమైట్
బస్తర్ అడవులు.. ఈ పేరు చెబితేనే తుపాకుల మోతలు, మందుపాతరల పేలుళ్లు, ఆదివాసీల తిరుగుబాట్లు ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతమైన ఇక్కడ పనిచేయాలంటే భద్రతాదళాలకు కత్తిమీద సామే. మావోయిస్టుల దాడులతో పాటు దోమకాటు వల్ల మలేరియా వచ్చి కూడా సీఆర్పీఎఫ్ తదితర బలగాల్లోని కొంతమంది సిబ్బంది మరణిస్తారు. అలాంటి చోట పనిచేయడానికి తొలిసారిగా సీఆర్పీఎఫ్లో ఒక మహిళా అధికారి ముందుకొచ్చారు. ఆమె పేరు ఉషా కిరణ్ (27). గిరిజన ప్రాంతాల్లో పనిచేసే సీఆర్పీఎఫ్ బలగాలు, సైన్యం పదేపదే అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలకమైన పీఆర్ బాధ్యతలలో ఆమెను నియమించారు. 2015 అక్టోబర్ నెలలో నిర్వహించిన ఓ ఆపరేషన్ సందర్భంగా 16 మంది గిరిజన మహిళలపై భద్రతా దళాలు అత్యాచారం చేశాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తేల్చిచెప్పిన సరిగ్గా రెండు రోజుల తర్వాత ఉషాకిరణ్ నియామకం జరిగింది. సీఆర్పీఎఫ్కు చెందిన 80వ బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఆమె రాకముందు అసలు భద్రతాదళాలంటేనే గిరిజన మహిళలు వణికిపోయేవారు. కానీ, ఆమె వచ్చిన తర్వాత పరిస్థితి బాగా మారిందని బస్తర్ ప్రాంత సీఆర్పీఎఫ్ డీఐజీ సంజయ్ యాదవ్ చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి భద్రతాదళాలకు సులువుగా ఉంటోందన్నారు. ట్రిపుల్ జంప్ విభాగంలో జాతీయ స్థాయి క్రీడాకారణి అయిన ఉషాకిరణ్.. సీఆర్పీఎఫ్లో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరు. మరో మహిళ అర్చనా గౌరా మాత్రం కొండగావ్ వద్ద పనిచేస్తున్నారు. అక్కడ మావోయిస్టుల ప్రభావం మరీ అంత ఎక్కువ ఉండదు. ఉషాకిరణ్ తండ్రి, తాత కూడా సీఆర్పీఎఫ్లో పనిచేసినవారే. దాంతో ఆమె సైతం ఈ బలగాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. ఆమె రావడం వల్ల బస్తర్ ప్రాంతంలో తమ పని చాలా సులువైందని దర్భా పోలీసు స్టేషన్ ఇన్చార్జి వివేక్ ఉయికె చెప్పారు. -
అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వచ్చిన కొద్దిసేపటికే ఘటన ఉప్పల్,న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ఈస్ట్ కళ్యాణ్‌పురికి చెందిన ఉప్పలయ్య కుమార్తె సుప్రజ(20), అదే ప్రాంతంలో ఉంటున్న ఉషాకిరణ్ ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించడంతో కొద్ది రోజులుగా కలిసి తిరుగుతున్నారు. ఆదివారం ప్రియుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సుప్రజ తన స్నేహితులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. మధ్యాహ్నం 1.30కి ప్రియుడు ఉషాకిరణ్, స్నేహితులు అలేఖ్య, నితిన్‌రెడ్డి.. సుప్రజను కారులో ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. సుప్రజ తనకు ఒంట్లో బాగోలేదని ఇంట్లో వారికి చెప్పింది. ఆమె నీరసంగా ఉండటం గమనించి కుటుంబసభ్యులు నిమ్మరసం తాగించారు. కొద్దిసేపటికి సుప్రజ అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు రామంతాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. సుప్రజ మృతికి ఆమె తల్లిదండ్రులే కారణమని ప్రియుడు ఉషాకిరణ్ ఆరోపించడంతో ఆసుపత్రి వద్ద ఇరువురి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురి బంధువులతో పాటు ఉషాకిరణ్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాగా, తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని సుప్రజ తల్లి వరలక్ష్మి పోలీసులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.