బస్తర్ అడవుల్లో మహిళా డైనమైట్
బస్తర్ అడవుల్లో మహిళా డైనమైట్
Published Wed, Jan 11 2017 1:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
బస్తర్ అడవులు.. ఈ పేరు చెబితేనే తుపాకుల మోతలు, మందుపాతరల పేలుళ్లు, ఆదివాసీల తిరుగుబాట్లు ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతమైన ఇక్కడ పనిచేయాలంటే భద్రతాదళాలకు కత్తిమీద సామే. మావోయిస్టుల దాడులతో పాటు దోమకాటు వల్ల మలేరియా వచ్చి కూడా సీఆర్పీఎఫ్ తదితర బలగాల్లోని కొంతమంది సిబ్బంది మరణిస్తారు. అలాంటి చోట పనిచేయడానికి తొలిసారిగా సీఆర్పీఎఫ్‌లో ఒక మహిళా అధికారి ముందుకొచ్చారు. ఆమె పేరు ఉషా కిరణ్ (27). గిరిజన ప్రాంతాల్లో పనిచేసే సీఆర్పీఎఫ్ బలగాలు, సైన్యం పదేపదే అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలకమైన పీఆర్ బాధ్యతలలో ఆమెను నియమించారు.
2015 అక్టోబర్ నెలలో నిర్వహించిన ఓ ఆపరేషన్ సందర్భంగా 16 మంది గిరిజన మహిళలపై భద్రతా దళాలు అత్యాచారం చేశాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తేల్చిచెప్పిన సరిగ్గా రెండు రోజుల తర్వాత ఉషాకిరణ్ నియామకం జరిగింది. సీఆర్పీఎఫ్‌కు చెందిన 80వ బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఆమె పనిచేస్తున్నారు.
ఆమె రాకముందు అసలు భద్రతాదళాలంటేనే గిరిజన మహిళలు వణికిపోయేవారు. కానీ, ఆమె వచ్చిన తర్వాత పరిస్థితి బాగా మారిందని బస్తర్ ప్రాంత సీఆర్పీఎఫ్ డీఐజీ సంజయ్ యాదవ్ చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి భద్రతాదళాలకు సులువుగా ఉంటోందన్నారు. ట్రిపుల్ జంప్ విభాగంలో జాతీయ స్థాయి క్రీడాకారణి అయిన ఉషాకిరణ్.. సీఆర్పీఎఫ్‌లో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరు. మరో మహిళ అర్చనా గౌరా మాత్రం కొండగావ్ వద్ద పనిచేస్తున్నారు. అక్కడ మావోయిస్టుల ప్రభావం మరీ అంత ఎక్కువ ఉండదు. ఉషాకిరణ్ తండ్రి, తాత కూడా సీఆర్పీఎఫ్‌లో పనిచేసినవారే. దాంతో ఆమె సైతం ఈ బలగాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. ఆమె రావడం వల్ల బస్తర్ ప్రాంతంలో తమ పని చాలా సులువైందని దర్భా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి వివేక్ ఉయికె చెప్పారు.
Advertisement
Advertisement