Indias Daughter
-
ఇండియాస్ డాటర్‌కు పెళ్లి సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : గీత గుర్తుందా! ఏడేళ్ల వయసులో ప్రమాదవశాత్తూ పాకిస్తాన్లోకి వెళ్లి 2015లో తిరిగి భారత్‌కు చేరుకున్న మూగ, బధిర గీతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గీతకు వరుడు కావలెను అని ఇటీవల ఫేస్బుక్లో ఇచ్చిన ప్రకటన చూసి ఇప్పటికే20 మంది పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు.వారిలో ఒక రచయిత, పురోహితుడు కూడా ఉన్నారు. గీత తల్లిదండ్రులను వెతకడంలో పాలుపంచుకున్న ఇండోర్‌కు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్ ఫేస్బుక్లో... ఇండియాస్ డాటర్ గీతకు 25 ఏళ్లకు పైగా వయసు గల గుణవంతుడు, అందంగా ఉన్న మూగ అబ్బాయి కావాలని ప్రకటన ఇవ్వగా స్పందన వచ్చింది. అంతేకాదు వరుడిని స్వయం గా గీత ఎంపిక చేసుకుంటుందని కూడా అందులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటామని బయోడేటా పంపిన వారిలో 12 మంది దివ్యాంగులు , ఉండగామిగతా వారు సలక్షణంగా ఉన్నారని జ్ఞానేంద్ర అన్నారు.గీతను మాతృభూమికి రప్పించడంలో కీలకపాత్ర పోషించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పురోహిత్‌కు గీతకు సంబంధం కుదిర్చే పని అప్పగించారు. -
'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..'
లాస్ ఏంజిల్స్ : 'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..' అంటూ ప్రముఖ భారతీయ యువ శబ్దగ్రాహకుడు రెసూల్ పోకుట్టి ట్వీట్ చేశారు. రెసూల్ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న మోషన్ పిక్చర్స్ సౌండ్ ఎడిటర్స్ 63వ 'గోల్డెన్ రీల్ అవార్డ్స్' వేడుకలో 'బెస్ట్ సౌండ్' అవార్డును సొంతం చేసుకున్నారు. 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీకి సమకూర్చిన శబ్దానికిగాను రెసూల్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు భారతీయ యువతలో ఉన్న నిజమైన చైతన్యానిదని, నిర్భయ ఆత్మకే చెందుతుందంటూ ట్వీట్ చేశారు. ఆసియాలో గోల్డెన్ రీల్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రెసూల్ పోకుట్టి కావడం విశేషం. 'ఇండియాస్ డాటర్', 'అన్ ఫ్రీడమ్' అనే రెండు చిత్రాలకు రెసూల్ పోకుట్టికి నామినేషన్లు లభించాయి. ఈ రెండు చిత్రాలు భారత్‌లో నిషేధానికి గురికావడం గమనార్హం. ఇదివరకే 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో మరో ఇద్దరితో కలిపి రెసూల్ ఆస్కార్ అందుకున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంగా వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ భారత్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసింది. And the Golden Reel goes to.... pic.twitter.com/cveHza7hJo — resul pookutty (@resulp) February 28, 2016 Is it true that I really got it....it's for the true spirit of the youth of India. This goes to Nirbhaya's soul..! pic.twitter.com/8ziq8mK7Zp — resul pookutty (@resulp) February 28, 2016 -
ఆస్కార్‌కు 'నిర్భయ' డాక్యుమెంటరీ!
'ఇండియాస్ డాటర్' పేరిట నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని ప్రముఖ హాలీవుడ్ కథానాయిక మెరిల్ స్ట్రీప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన సందర్భంగా ఆమె శుక్రవారం వీక్షించారు. డాక్యుమెంటరీ రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో దీనికి నామినేషన్ దక్కాలని జరుగుతున్న కాంపెయిన్లో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించి.. అమానుష హింస ఎదుర్కొని.. 13 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ధైర్యానికి ప్రతీకగా 'నిర్భయ' పేరుతో ఈ ఉదంతం నిలిచిపోయింది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై బ్రిటిష్ చిత్ర రూపకర్త లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, రేపిస్టులను ఈ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నిందితుల వాదనలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు గ్రహిత అయిన మెరిల్ స్ట్రీప్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ డాక్యుమెంటరీని మొదట చూసినప్పుడు నోటమాట రాకుండా అలా కాసేపు ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు. -
నేను పరిపూర్ణమైన పురుషుణ్ణి కాదు!
మగాడంటే ఎలా ఉండాలి?.. పది మందిని కొట్టేంత శక్తిమంతునిగా, ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా ఏడవకుండా నిబ్బరంగా ఉండేట్టుగా... ఎలాంటి పరిస్థితిలోనూ ఎవరి మీదా ఆధారపడకుండా.. ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలని కొంతమంది చెబుతుంటారు. ఒకవేళ మగతనానికి ఇవన్నీ నిర్వచనం అని ఎవరైనా బలంగా నమ్మితే, అప్పుడు నేను ‘పరిపూర్ణమైన పురుషుణ్ణి కాదు’ అని కొంచెం కూడా తడబడకుండా స్టేట్మెంట్ ఇచ్చారు ఆమిర్ ఖాన్. న్యూయార్క్‌లో జరిగిన ‘ప్రపంచంలో స్త్రీ శక్తి’ అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘సమస్యల్లోనే కాదు.. ఏ సమస్యా లేనప్పుడూ నేను నా భార్య చేతులు పట్టుకుంటాను. తన నీడని కోరుకుంటాను. అలాగే, తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు, మగాణ్ణి కదా అని నిగ్రహించుకోను.. ఏడ్చేస్తాను. పదిమందిని కొట్టలేను. ఇలా ఉండేవాళ్లని పరిపూర్ణమైన మగాడు కాదని ఎవరైనా అంటే.. సరే.. ‘నేను కాదు’ అని ఒప్పుకుంటా. మగపిల్లలను చిన్నప్పట్నుంచే ‘నువ్వు మగాడివి.. ఏడవకూడదు’ అని తల్లిదండ్రులు నియంత్రించడం తప్పు. ఆ విధంగా చెప్పడం ద్వారా పురుషాహంకారం ఏర్పడుతుంది. అతడి అహంకారం ఏ స్థాయిలో ఉంటుందంటే ‘భార్యను కొట్టేంత’. అందుకే ముందు సమాజంలో మార్పు రావాలి. పురుషుడంటే ఆధిపత్యం చెలాయించాలి... స్త్రీ అంటే అణకువగా ఉండాలి అనే భావనను వదిలిపెట్టాలి’’ అని ఉద్వేగంగా అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రముఖులు ఆమిర్ ప్రసంగానికి ముగ్ధులైపోయారు. కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు. భారతదేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారం గురించి ఇదే వేదికపై ఆమిర్ ప్రసంగించారు. దోషికి శిక్ష పడటానికి ఎక్కువ కాలం పడుతోందనీ, నేరాలు విరివిగా జరగడానికి అదొక కారణమనీ ఆమిర్ అన్నారు. అందుకే చట్టంలో కొన్ని మార్పులు రావాలని ఆయన పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన స్త్రీలు మానసికంగా ఇంకా కుంగిపోయేలా కొంతమంది పోలీసులు, వైద్యులు ప్రవరిస్తుంటారనీ, అది తగదనీ సూచించారు. ‘ఇండియాస్ డాటర్’ పేరిట తీసిన లఘు చిత్రాన్ని మీరు చూశారా? అని అక్కడివారు ప్రశ్నించినప్పుడు ‘‘భారతదేశంలో ఈ చిత్రంపై నిషేధం విధించడం దురదృష్టకరం. అందుకని చూడలేకపోయా’’ అని ఆమిర్ చెప్పారు. -
గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...!
మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకి ఆమెకు అనుమతి ఎవరిచ్చారో మీకు తెలియ దన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్‌వన్ నేరమని తీర్పిచ్చారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది? గొల్లపూడి మారుతీరావు గారూ! నిర్భయ గురించి నిర్భీతిగా మీరు రాసింది చూశాం. భారతదేశం గొప్పదనీ, ఆదర్శ ప్రాయమైనదనీ ప్రపంచమం తటా చాటాలన్న మీ తపన మాకెంతో ఆనందంకలిగించిం ది. అచ్చు మాలాంటి అభిప్రా యాలే మీకూ ఉన్నందుకు ముచ్చటేసింది. పైగా మనది గొప్పదేశం కాదనీ ఏ వలసవాది కానీ తప్పుడు ప్రచారం చేస్తే వాడి గుడ్లు పీకి వాడి చేతుల్లోనే పెట్టాలనేంత కోపం మాతోపాటే మీగ్గూడా నూటా యాభై ఏడు శాతం ఉండ టంతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించేశాం.పైగా మీ నటనకే కాదు సాహిత్యంలో, సినీ చరిత్ర అధ్యయనంలో మీకున్న ప్రతిభను చూసి అప్రతిభులవుతున్నవాళ్లమే. సినిమా ఫీల్డ్‌లో కూడా చదువుకున్న వాళ్లుంటారా అని ముందుగా మిమ్మల్నీ, మీలాంటి మరి అతి కొద్ది మంది నీ చూసి విస్తుపోయాం. మీ కాలమ్ ఏ పత్రికలో వచ్చినా ముందుగా దాన్నే చదివి అభిమానులమయ్యాం. మనల్ని బానిసత్వంలో మగ్గించిన ఒక దుష్టదేశం లో పుట్టిన దెష్ట మహిళ తప్పుడు మాటలు ఎవ్వరూ ఎప్పుడూ వినరాదనీ, కనరాదనీ మీరనుకున్నట్టే మేము అనుకున్నాం. మీకూ మాకూ జమిలిగా గల దేశభక్తి అలాంటిది. ఎవడో ఒక రేపిస్టూ ప్లస్ ఇద్దరు లా రేపిస్టు లూ చెప్పిన ముష్టిమాటలు... సకల భారతీయ మగ పురుషుల అభిప్రాయాలు కాదనీ గొంతుచించుకుని అర వాలనుకున్నాం. కానీ ఖర్మ కొద్దీ మీరు కాలమ్ రాయక ముందే మీరు చూడని డాక్యుమెంటరీ చూశాం. మీరు లెక్క చేయని కొన్ని డైలీలూ, మేగజైన్లూ చదివాం. పైగా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నట్టుగా ఈ జర్నలిజంలో నల భై ఐదేళ్లుగా ఉన్నవాళ్లం. ‘నిర్భయ’ ముందూ, ఆ తర్వా తా మన దేశంలో ప్రతి రోజూ సెలవుల్లేకుండా ఎడ తెరపి లేకుండా జరుగుతున్న రేప్‌లూ, మర్డర్లను ఈ పాపిష్టి చేతుల్తోనే రాస్తున్నాం. అందుకే ఆ డాక్యుమెంటరీ చూసి నప్పుడు మీరు చెప్పిన మానవమృగం ముఖేష్‌సింగ్ ఒంటరివాడు కాదనిపించింది. అతని డిఫెన్స్ లాయర్లి ద్దరూ కూడా బొత్తిగా ఒంటరివాళ్లు కానేకాదనిపించింది. ఆడదాని తిక్క కుదర్చడానికి గ్యాంగ్‌రేప్ శిక్షలు సాధికా రికంగా విధించే వందలు, వేల ఖాప్ పంచాయతీలు గుర్తొచ్చాయి. పెదరాయుళ్లు చినరాయుళ్లూ కలిసి ఆడ దాని ప్లేస్ ఎక్కడో చెప్పే ప్రబోధాలు వినిపించాయి. మగమహారాజులు లాగి తంతేనే జన్మధన్యమైనట్టుగా థ్రిల్లయి ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ అని పాడే బంగారు కోడిపెట్టలు కెవ్వున కేకేస్తూంటే, అది జాతినుద్దేశించిన సందేశంలా చక్కగా, సిగ్గు లేకుండా 70 ఎం.ఎం స్క్రీన్ మీద పరచుకుంటుంటే తమరి ధర్మాగ్రహం, సత్యా గ్రహం యాడబోయాయి. ‘ఈమెనే సర్వదావాడం డి’ అంటూ బోర్డుపెట్టి అసభ్యంగా చూపిన పచ్చి ఫ్యూడల్ దురహంకారాన్ని, పిచ్చి మేల్ షావనిస్టు పిగ్గరీ ని ఇంత కాలం మౌనంగా చూసిన, చేసిన మీకు ఇంత లోనే అంత కోపమెందుకో! పైగా ఆ సింగూ, ఈ సింగూ మరొకడూ తప్ప దేశమంతటా పురుగులెవరూ లేరనీ అంతా మహాపురుషులేనననీ మీరు జరిపించిన అఖిల భారత సర్వేలో తేలిందంటున్నారు. అది నిఖార్సైన, పదహారణాల పచ్చి అబద్ధం. అందుకే, ఈస్టిండియా కంపెనీ పెట్టిన ఆ దేశంలో పుట్టిన దెష్ట మహిళ చెప్పిందే నిజం, చూపిందే సత్యం అని జావేద్ అఖ్తరూ, షబనా అజ్మీ, బృందాకారత్, ఎన్.రామ్, నేనూ మావాళ్లూ ఇంకా అనేక మంది బుర్రా బుద్ధీ లేని మూర్ఖులం అందరం కూడబలుక్కుని గొంతులు చించుకుందామనుకున్నాం. అవసరమైతే చొక్కాలూ, గుండీలూ చించుకోవాలనీ, గుండెలు బాదుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. ఈ రేపిస్టులూ, వారిష్టులూ అయిన లాయర్ల మాటలు ప్రపంచంలో మన పవిత్ర భారతదేశం పరువు తీస్తున్నా యని మీరు బెంగపడడం బ్లాక్ అండ్ వైట్ అచ్చులో కనిపించింది. మీ ముక్కుల్లోంచీ, చెవుల్లోంచీ ఆగ్రహం పొగలుమియడం మల్టీకలర్లో చూశాం. మన పరువు కొత్తగా పోయేదేం లేదు. మన దేశం లో వరకట్న దహనాల్లో కాలి చచ్చిన అమ్మాయిల లిస్టు మన పత్రికల్లోనే కాదు, ఐరాసలో కూడా ఉంది. యాసిడ్ దాడుల్లో ముక్కులూ మొహాలూ కరిగిపోయిన అంద గత్తెల లెక్కలూ ఉన్నాయి. రోజువారీ రేప్‌లూ, హత్యల జాబితాలూ దొరుకుతాయి. ఇది మనందరం ఎంతో శ్రమించి ప్రేమించి కట్టుకున్న దుర్మార్గపు సమాజం. ఇందులో అంతర్భాగంగా ఉన్న ‘స్ట్రక్చరల్ వయొలెన్స్’ ఇదెవ్వరూ చూడకూడదనీ ఎవ్వరికీ కనిపించకూడదని మీ కాళ్లూ చేతులతో కప్పెట్టినా, చివరికి మీ నొటోరియస్ డబుల్ చిన్ అడ్డం వేసినా ఆగేది కాదు. ప్రపంచపుటద్దం ఉంది. ఎదురుగా మన దేశం మొహముంది. ‘ఇండియాస్ డాటర్’అని శ్వేతజాతి మహిళ ఉడ్విన్ డాక్యుఫిలిం తీయడమంటే మనల్ని భ్రష్టుపట్టించడానికే ననుకుందాం. మరి ‘గాంధీ’ సినిమా తెల్లతోలువాడైన అటెంబరో తీసినప్పుడు తమకు కోపమెందుకు రాలేదో. బ్రిటన్‌లో రేప్‌లు లేవని ఆవిడేం అనలేదు. పైగా ‘నేను రేప్విక్టమ్’నని చెప్పింది. ఆమెకి బ్రిటన్ మీద ప్రేమా లేదు ఇండియా మీద ద్వేషమూ లేదు. జర్నలిస్టు, ఆర్టిస్టు అంతే. ఇంతకాలం జర్నలిజంలో ఉన్నందుకు ఆ విదేశీ దెష్ట మహిళ చెప్పిన తప్పుడు మాటల్లాంటి వాటితో ఒక న్యూస్ స్టోరీ రాయగలిగి ఉంటే జన్మధన్యమై నట్టే ఫీలవుతాం. అలాంటి డాక్యుమెంటరీ చేయగలిగుంటే గొప్ప కర్తవ్యం ముగించి నట్టు సంతృప్తి పొందేవాళ్లం. ఇక ఉడ్విన్ నేరాలూ ఘోరాలను మీరు ఏకరువు పెట్టిన తీరు భలే ఫన్నీగా ఉంది. మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకు అను మతి ఎవరిచ్చారో మీకు తెలియదన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్ వన్ నేరమని ఢంకా బజాయించారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది. కాలమ్ రాసే ముందు కనీసం మూడు నాలుగు రోజులనాటి న్యూస్ పేపర్లూ తిరగేస్తే పోయేదే ముంది. నిర్భయ పేరునీ, ఫొటోనీ ప్రకటించిందట అంటూ టకారంతములేల. ఇంటర్నేషనల్ రిలీజ్లో అలా చేసుకోవచ్చని ఆమె అమ్మా, నాన్నలే అనుమతినిచ్చారు. ఈ పుకార్ల శృతపాండిత్యమెందుకు? డాక్యుమెంటరీని అధికారులకి చూపి సమ్మతిని తీసుకోలేదని మీకెలా తెలిసింది? అడుగడుగునా సకల అనుమతులూ తీసు కుందావిడ. కావాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపి స్తాం. ‘హిందూ’ పత్రిక ఎన్.రామ్‌ను అడిగితే సకల పత్రాలూ, సాక్ష్యాలూ చూపిస్తాడు. మరి ముఖేష్‌తో40 వేలకు బేరం కుదిరిందని తేలిన మీ ఇన్వెస్టిగేటివ్ రిపో ర్టింగ్కు ఆధారంగా ఓ చిత్తుకాయితం ముక్కయినా చూపించగలరా? పురపురా రాసేయడం కాదు. కాస్తంత వెనకా ముందూ చూసుకోవాలి. నరాలు ఉప్పొంగినప్పు డు నిజాలెందుకొస్తాయి. అవి టపామని తెగినప్పుడు రీజన్ చస్తుంది. ప్యూర్ ఫిక్షన్ వస్తుంది. ఆవిడ డబ్బు చేసుకోడానికే ఇంతటి పాతకానికి ఒడిగట్టిందంటు న్నారు. లక్షా ఇరవైవేల పౌండ్లు అప్పులో పడి మరీ ఎన్.డి.టి.వి.కి ఉచితంగా పైసా తీసుకోకుండా ప్రసారానికిచ్చింది! అన్నట్టు మీకు తెలుగుసరిగ్గా రాదని కొన్ని ఇంగ్లీషు పదాలు రాశారు. మేమందరం అంతే. అచ్చు మీలాగే బ్రిటీష్ బానిసలుగా పుట్టాం. అయినా ఒక సృజనాత్మక జర్నలిస్టును ‘షటప్’ అన్నా సరే మిమ్మల్ని మెకాలే వింగ్లిష్‌లో ‘గెటౌట్’ అనలేం. కారణం మీకున్న సమా చారం, నాలెడ్జి తెలుసు. ఇంత తెలిసివుండీ ఈ గుణమేం టోననుకుంటాం. ఇలాంటి బోలు వాదనలు చేసినా, మూర్ఖపు రాతలు రాసినా గౌరవం చావట్లేదు. కనికరమే గాని కసి కలుగుట లేదు. ఎడ్మిరేషన్తో... (అప్పుడు మీ నవలకి ముఖచిత్రం గీసిచ్చి, మీ ముచ్చట చూసి సరదా పడ్డ వెర్రి ఆర్టిస్టును, జర్నలిస్టును) - వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్ : 7702841384 - మోహన్ -
ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు!
దృశ్యం ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీపై ఒకవైపు చర్చోపచర్చలు, వాదవివాదాలు జరుగుతుండగానే, మరోవైపు నాగలాండ్‌లోని దిమాపూర్‌లో సంచలనాత్మక సంఘటన జరిగింది. అత్యాచారం కేసుకు సంబంధించిన నిందితుడిని వందలాదిమంది జైల్లో నుంచి వీధుల్లోకి లాక్కొచ్చి విపరీతంగా కొట్టి చంపేశారు. శవాన్ని మోటర్‌బైక్‌కు కట్టి తిప్పారు. క్లాక్‌టవర్ దగ్గర కంచెకు వేలాడదీశారు. ఆ తరువాత శవాన్ని తగలేసారు. ‘‘ఇదెక్కడి ఆటవిక రాజ్యం? వాళ్లు మనుషులా? రక్తం తాగే రాక్షసులా?’’ అని జరిగిన సంఘటనపై బాధ పడిన వాళ్లూ ఉన్నారు. ‘‘జై ళ్లు ఉన్నది ఎందుకు? నేరాన్ని కాదు, నేరమనస్తత్వాన్ని శిక్షించాలి’’ అన్న ప్రజాస్వామిక వాదులు, హక్కుల ప్రేమికులూ ఉన్నారు. జైలు అంటే గుర్తుకొచ్చింది... తీహార్ జైలు! ఇప్పుడు మనం తీహార్ జైల్లోకి వెళొద్దాం. ఇతడి పేరు ముఖేష్‌సింగ్. డిసెంబర్ 16 సంచలనాత్మక దుర్మార్గపు ఘటనలో బస్సు డ్రైవరు ఇతడే. ‘ఎన్ని జన్మలెత్తినా... మేము చేసిన పాపానికి పరిహారం లేదు’, ‘మేము అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించామో అర్థం కావడం లేదు’, ‘ఒకవేళ ఊరిశిక్ష ఖరారైతే... దేవుడు నాకు సరియైన శిక్ష విధించాడు అనుకుంటా. ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదిస్తే... కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా... ఆ ముఖేష్ వీడేనా... అని ఆశ్చర్యపోయేలా... మంచి పనులు ఎన్నో చేస్తా’ సారీ... పై మాటలు కల్పిత మాటలు. ‘ఇలా మాట్లాడితే బాగుణ్ణు’ అని రాసుకున్న మాటలు. అతని గొంతులో పశ్చాత్తాపంప్రతిధ్వనించాలని ఆశించి రాసుకున్న ఆశావహ మాటలు. మరి నిజమైన మాటలు ఎలా ఉన్నాయి? అవి వినేముందు ముఖేష్‌సింగ్ వైపు ఒకసారి పరిశీలనగా చూడండి. మాటవరుసకు కూడా అతని గొంతులో, కళ్లలో పశ్చాత్తాపం అనేది కనిపించదు. గుండె అనేది క్రూరత్వంతో, పైశాచికానందం అనే విషంతో నిండిపోయినప్పుడు, కళ్లలో మాత్రం పశ్చాత్తాపం ఎలా కనిపిస్తుంది? ‘‘ఆ సంఘటన ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నాను’’ అని ఒకటికి రెండుసార్లు అంటూనే ‘ఎలా జరిగిందో తెలుసా? ‘ఎందుకు జరిగిందో తెలుసా?’ అని చెప్పకనే చెబుతాడు ముఖేష్. ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ బి.బి.సి. యూట్యూబ్ పుణ్యమా అని ముఖేష్‌సింగ్ మాటలు ఆనోటా, ఈనోటా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని... ‘ఎందుకు జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి వల్లే’ ‘అబ్బాయిల వల్ల కాదు... అమ్మాయి వల్లే రేప్‌లు జరుగుతాయి’ (లడ్కీ జ్యాదా జిమ్మేదారి హై రేప్ కే లియే) ‘మంచి అమ్మాయిలు ఎవరూ అంత రాత్రివేళ ఇల్లు దాటి బయటికి రారు’ ‘ఒక్కసారి మా ఊళ్లో తప్ప... ఏ అమ్మాయితోనూ పడుకోలేదు’ ‘మా తమ్ముడు మాత్రం ఇలాంటివెన్నో చేశాడు. ఈసారి మాత్రం (ఢిల్లీ) అతని ఉద్దేశం రేప్ గానీ, దాడి గానీ కాదు. ‘ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లొస్తున్నారు?’ అని తమ్ముడు ఆ అమ్మాయితో పాటు ఉన్న యువకుడిని అడిగాడు. ‘నీకు అనవసరం’ అన్నాడు అతను. దాంతో ఆ యువకుడి చెంప చెళ్లుమంది. అలా ఘర్షణ మొదలైంది. లైట్లు స్విచ్ఆఫ్ అయ్యాయి. అమ్మాయిని బస్సు వెనక్కి లాక్కెళ్లారు. రేప్ మొదలైంది’ ‘రేప్ జరిగినా ఇంకేది జరిగినా ఆ ఇద్దరూ సిగ్గుతో బయటికి చెప్పుకోలేరు అనేది ధీమా. ఒక వేళ పోలీసులకు ఎవరు దొరికినా, ఇతరుల గురించి చెప్పొద్దు అనుకున్నాం’ ‘చచ్చింది. బయటికి లాగి పారేయండి... అరుపులు వినిపిస్తున్నాయి. స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను’ ‘ఆమెను లాగి బయట పారేయడానికి బ్యాక్‌డోర్ ఓపెన్ చేద్దామనుకున్నారు. ఓపెన్ కాలేదు. రక్తం... రక్తం... రక్తం... సీట్లకు, ఫ్లోర్‌కు... అక్షయ్, చిన్న కుర్రాడు బస్సు క్లీన్ చేశాడు. వినయ్ చేతులు రక్తంతో తడిసాయి...’ ఇప్పుడు మనం... డిఫెన్స్ లాయర్ ఫర్ ది రేపిస్ట్స్ ‘యం.ఎల్.శర్మ’ దగ్గరికి వచ్చాం. ఆయన చెబుతున్న ‘డైమండ్ థియరీ’ గురించి విందాం... ‘ఆడపిల్ల అనేది డైమండ్లాంటిది. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వీధుల్లో ఉంటే ఏమవుతుంది? కుక్కల పాలవుతుంది!’ ముఖేష్ మాటల్లో పశ్చాత్తాపం కనిపించకపోవడానికి ‘నిరక్షరాస్యత’ ‘అజ్ఞానం’ ‘వెనకబాటుతనం’ కారణం అనుకుందాం. మరి శర్మకు ఏమైంది? బాగా చదువుకున్నాడు. పేరు పొందిన లాయర్. మరి ఆయన కూడా మూర్ఖుడు ముఖేష్లాగే... మాట్లాడుతున్నాడు. అందుకే నిర్భయ తల్లి కళ్లనీళ్లతో అంటుంది ఇలా... ‘‘ఏ నేరం జరిగినా అమ్మాయిదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. నువ్విలా ఎందుకు చేశావు? అని నేరస్తుడిని ఎవరూ అడగరు’’. ఈ డాక్యుమెంటరీలో చాలామంది ప్రముఖులు మాట్లాడారట. జైల్ సైకియాట్రిస్ట్ ఆఫ్ ది రేపిస్ట్ డా. సందీప్ గోవిల్ మాటల్లో నుంచి నేరస్వభావాన్ని చూస్తామా? ‘మా వాడికేపాపమూ తెలియదు’ అనే ముఖేష్, రామ్‌సింగ్‌ల తల్లిదండ్రులు మంగిలాల్, కళ్యాణి మాటలు నమ్ముతామా? మెంబర్ ఆఫ్ రేప్ రివ్యూ కమిటీ మాజీ చీఫ్ జస్టిస్ లీలా సేథ్ మాటల్లో ఎలాంటి న్యాయాన్ని, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చరిత్రకారిణి, రచయిత్రి డా. మారియ మిశ్రా మాటల్లో ఏ చరిత్రను వెదుక్కుంటాము? సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా.రష్మీ అహుజా, పెట్రోలింగ్ మాన్ రాజ్‌కుమార్ మాటల్లో వినిపించే భయానకత్వానికి ఒళ్లు ఎలా జలదరిస్తుంది అనేది పక్కనపెడితే... ఈ హారిఫిక్ రియాలిటి హైయెస్ట్ రేటింగ్ డాక్యుమెంటరీ అనగానే గుర్తుకొచ్చేవి మాత్రం... ఆ రెండు కళ్లే. పశ్చాత్తాపం కనిపించని ఆ నెత్తుటి కళ్లే! - యాకుబ్ పాషా యం.డి -
భయం నిర్భయం నడుమ...?
ఎన్ని చర్యలు తీసుకున్నా, సంప్రదాయ నియంత్రణా పద్ధతులేవీ ఫలితాలివ్వనప్పుడు, మహిళల పట్ల పురుషల ఆలోచనా ధోరణిలోనే మార్పు తేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముందు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? నికృష్టుడి నీచపు వ్యాఖ్యలు మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగుకప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. ‘తలనొప్పి వచ్చిందీ!’ అనంటే, ‘తల తీసేస్తే పోలా?’ అన్నది మన పాల కుల వైఖరి. వారు అనుసరించే పద్ధతి కూడా అదే అనడానికి ‘భారతపుత్రి’ (ఇండియాస్ డాటర్) డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధించిన తీరే నిదర్శనం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన జబ్బేమీ కాదు. సత్యజిత్ రే వంటి ప్రపంచస్థాయి దర్శకుడు ‘పథేర్ పాంచాలి’ అనే ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తే, భారత పేదరికాన్ని బయటి ప్రపంచానికి ఎత్తి చూపు తున్నాడని బలమైన ఓ వర్గం విమర్శించిన నాటి నుంచీ ఈ ఒరవడి కొనసా గుతున్నదే! దేశభక్తి, సంస్కృతి, మత భావనలు, ఇతర భావోద్రేకాంశాలు వివాదాస్పదం కావడం ఇక్కడ మామూలే! వివాద సందర్భాల్లో భావ వ్యక్తీక రణ స్వేచ్ఛపై ఇటువంటి అధికారిక నిషేధాలు ఈ దేశంలో తరచూ జరుగుతు న్నవే! కానీ, ఆ ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నపుడు, భవిష్యత్ ప్రయోజనాలకు భంగకరమైన సంకేతాలిస్తున్నపుడు అంతా అప్ర మత్తం కావాల్సిందే! అత్యాచారాల సంస్కృతి, బాధితుల్నే తూలనాడే వైఖరి, దర్యాప్తుల్ని నీరుగార్చి నేరప్రవృత్తిగల వారిలో ధీమా పెంచే దుస్థితికన్నా కూడా... ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలియడమే పెద్ద ఘోరమ న్నట్టు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్టే ఈ డాక్యుమెంటరీ పరివ్యాప్తిని కూడా నిషేధం నియంత్రించలేకపోతోంది. బీబీసీ ఇప్పటికే దీన్ని ప్రసారం చేసింది. యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. బీబీసీకి నోటీ సిచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ప్రసారాల్ని అదుపుచేసే చర్యల్ని ప్రారంభించింది. రెండేళ్ల కింద, 2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ పాశవిక అత్యాచారం, హత్య కేసు పూర్వాపరాలు కథావస్తువుగా లెస్లీ ఉద్విన్ దాదాపు గంట నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. నిర్భయ కేసులో శిక్షపడిన దోషుల్లో ఒకరైన ముఖేష్‌సింగ్ ఇంటర్వ్యూ కూడా అందులో ఉంది. బాధితురాలిపైన, మొత్తం మహిళలపైన అతడు ఆ ఇంటర్వ్యూలో విపరీత వ్యాఖ్యలు చేశాడు. దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అం తకుముందు ఒక భారత టెలివిజన్ సంస్థతో కలిసి ప్రసారం చేస్తామని బీబీసీ ప్రకటించింది. దీంతో అందులో ఏముందోనని పత్రికల్లో కథనాలు రావడం, ఆ వెంటనే పార్లమెంట్లో దుమారం, ప్రసారాలపై నిషేధం.. అన్నీ చకచకా సాగిపోయాయి. నిజంగానే అదంత అభ్యంతరకరమా? అని కొందరు, ప్రజా స్వామ్యంలో ఒక డాక్యుమెంటరీపై నిషేధమా? అని ఇంకొందరు, ఒక దోషిని ఇంటర్వ్యూ చేయడమేమిటి, అతనలా నిస్సిగ్గుగా అమానవీయ వ్యాఖ్యలు చేయడమేమిటనే ఆగ్రహంతో మరికొందరు... కారణమేదైతేనేం చాలా మం దే డాక్యుమెంటరీని చూస్తున్నారు. చూడాలి కూడానని విజ్ఞుల అభిప్రాయం. అవునూ... చూస్తే తప్పేంటి? ఈ వివాదంపై ప్రస్తుతం మూడు రకాల ఆలోచనా ధోరణులు సాగుతు న్నాయి. నిషేధం తప్పు, డాక్యుమెంటరీని అంతా చూడాలన్నది ఒక అభిప్రా యమైతే, ఇది దురుద్దేశ్యంతో, తప్పుడు భావనల వ్యాప్తి కోసం రూపొందిం చిన డాక్యుమెంటరీ కనుక నిషేధమే సబబన్నది మరో అభిప్రాయం. మూడో అభిప్రాయమూ ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగా శిక్షపడిన ఖైదీగా ఉన్న దోషి అభిప్రాయాల్ని, వ్యాఖ్యల్ని జోడించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం సముచితం కాదన్నది ఈ భావన. అనైతిక పద్ధతుల్లో ముఖేష్ ఇంటర్వ్యూ సంపాదించడం, చట్ట విరుద్ధంగా తిహార్ జైలు అధికారులు ఆ అవకాశం కల్పించడం, ఇలాంటి అత్యాచారాలు అంతటా జరుగుతున్నపుడు ఒక దేశం, ఒక వర్గం, ఒక కేసునే ప్రాతిపదిక చేసి కథనం నడపడం... వంటి అంశాలపైనా వీరికి అభ్యంతరాలున్నాయి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపీడబ్ల్యూఏ) కార్యదర్శి కవితా కృష్ణన్ లాంటి వారు ఈ భావన లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రసారాల్ని వాయిదా వేయాలని స్థానిక మీడియా సంస్థల్ని కోరిన వీరు, తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరు పుతున్నారు. పాలక-విపక్షాలతో సహా కొన్ని రాజకీయపక్షాలు, మత, సామా జిక, సేవా సంఘాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు డాక్యుమెంటరీపై తీవ్ర ఆగ్ర హంతో ఉన్నాయి. ఎలా జరిగిందో తేల్చాలని అంతర్గత దర్యాప్తునకు ఆదే శించి, ప్రసారాలు పరివ్యాప్తం కాకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. వారికి రకరకాల అభ్యంతరాలున్నప్పటికీ, నిషేధానికి ప్రధానమైనదిగా చూపుతున్న కారణాలు మాత్రం రెండు. ఒకటి పాశవిక అత్యాచార నేరానికి పాల్పడ్డ దోషిని ఇంటర్వ్యూ చేసి, అమానుషమైన అతని వ్యాఖ్యల్ని ప్రచారంలోకి తేవడం. అత్యాచారాలకు, ఇతర హింసకు గురవుతున్న మహిళలపైనే కాక మొత్తంగా మహిళలపైనే దాడిగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు. రెండోది, పాశవిక అత్యాచారాలు, ఇతర నేరాలు ఒక్క మన దేశంలోనే జరుగుతున్నట్టు, ఇవికాక ఇక్కడ ఇంకేమీ లేనట్టు బయటి ప్రపంచంలో భారత్‌ను అప్రదిష్ట పాల్జేయాలని పనిగట్టుకొని తీసిన డాక్యుమెంటరీ ఇది అన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇదే వారి తీవ్ర ఆగ్రహానికి కారణం. చర్చ జరగడమే ఆరోగ్యకరం ప్రాధాన్యతగల అంశాల్ని మామూలుగా, అతి మామూలు విషయాల్ని అత్యం త ప్రాధాన్యతగల అంశాలుగా మన పాలకులు తిరగేసి చూస్తున్నారని ఎక్కు వగా వినిపిస్తున్న విమర్శ. తాజా ఉదంతంలో వారి వ్యవహారశైలే అందుకు తార్కాణం. మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి వాటిని నియంత్రించడంపై పెట్టాల్సిన శ్రద్ధాసక్తులను, వాటి వ్యతిరేక ప్రచారాన్ని నియంత్రించడంపై చూపుతున్నారు. నికృష్టుడు ముఖేష్ నీచపు వ్యాఖ్యలను మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. ‘దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్ని ఇది అద్దం పట్టి చూపింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగు కప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. నిర్భయ ఉదంతం తర్వాత ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు లేచాయి. సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తక్కువ సమయంలో ఇం తటి వ్యవస్థీకృత ఉద్యమాన్ని మున్నెప్పుడూ చూడలేదు. ‘ఇంత ఘోరమా!’ అని లోకమంతా ఒక్క గొంతై అరిచింది. ప్రభుత్వాలు స్పందించాయి. దర్యా ప్తును ముమ్మరం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరచి, విచారణను వేగిరపరిచి నిందితుల్ని దోషులుగా నిర్ధారించి మరణదండన విధించారు. కానీ, ఇదే వేగం, నిక్కచ్చితనం ఇతరత్రా వందలు, వేల అత్యాచార కేసుల్లో జరగటం లేదు. ఇది కేవలం భద్రతా చర్యలు, పోలీసు దర్యాప్తులు, న్యాయ విచార ణలు, చట్టాల్లో పొందుపరచిన శిక్షలు తదితర అంశాలకు మాత్రమే సంబం ధించినది కాదని తేటతెల్లమైంది. ఇంకేదో జరగాలి, అప్పుడే ఈ నేరాలు అదు పులో కొస్తాయని స్పష్టమైంది. బలంగా పాతుకుపోయిన ఈ పురుషాధిక్య వ్యవస్థలో ఆలోచనా ధోరణి మారాలనే అభిప్రాయం బలపడుతూవచ్చింది. ఇందుకవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజాసంఘాలు, అధ్య యన నివేదికలు స్పష్టంచేస్తున్న తరుణంలో... ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా భద్రత, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటి సంప్రదాయ నియంత్రణా పద్ధతులు ఫలితాలివ్వనప్పుడు, మహిళలపట్ల పురుషల ఆలో చనా ధోరణిలోనే మార్పుతేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముం దు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? ‘భారత పుత్రి’ డాక్యుమెంటరీలో ఉన్నదదే. మహిళలపట్ల స్థాయీ భేదాలు లేకుండా ఉన్న ధోరణి ఏంటో అద్దం పట్టింది. దోషితోనే కాకుండా దోషుల తల్లిదండ్రులతో, బాధితురాలి తల్లిదండ్రులతో, రిటైర్డు న్యాయమూర్తితో, న్యాయవాదులతో, సామాజిక కార్యకర్తలతో, బాధితురాలి మిత్రుడితో... ఇలా వివిధ వర్గాల వారితో మాట్లాడించి రూపొందించిన ఆ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితిని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అది ఖచ్చితంగా ఓ ఆరోగ్యకరమైన చర్చకు దారితీస్తుంది. మహిళలపట్ల పురుషుల ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో చెబుతుంది. ఎలా ఉండాలనే వైపు చర్చను రేకెత్తిస్తుందని, ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమేనని పరిశీలకుల అభిప్రాయం. మాట్లాడకుండా ఎవరినాపగలిగామని? నిర్భయ కేసు దోషుల చర్యల్ని, వారి అమానుష ఆలోచనా ధోరణిని, అను చిత వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరు. పైగా అసహ్యించుకుంటారు. అవిద్య, అజ్ఞానం, మురికివాడల్లో పెరిగిన నేపథ్యం కలిగిన ముఖేష్ వ్యాఖ్యలు దారుణం, అభ్యంతరకరం. అయితే, ఆయన తరపు న్యాయవాది వ్యక్తీకరణ, భావజాలం, మహిళలపట్ల అతని ఆలోచనా ధోరణి ముఖేష్ మాటలకన్నా నీచంగా ఉండటం గమనార్హం. మహిళలపై అత్యాచారాలు జరగొద్దంటే, వారెలా ఉండాలి, ఎలా బట్టలేసుకోవాలి, ఎప్పుడెప్పుడు-ఎక్కడెక్కడికి- ఎవరితో వెళ్లాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి...అని చెప్పే పెద్ద మనుషుల జాబితా చాంతాడంత. ఒక న్యాయవాది, ఒక సాధుమహరాజ్, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి, ఒక మంత్రి, ఓ పార్టీ అధినేత, ఒక ఎమ్పీ, ఒక డీజీపీ... ఇలా పెద్ద పెద్ద హోదాలున్న మహానుభావులు మహిళల పట్ల వ్యక్తం చేసిన చిల్లర అభిప్రాయాలు ముఖేష్ మాటల కన్నా తక్కువ నీచమైనవేం కావు. వాటిని నిషేధించవద్దా? నిషేధించామా? నిషేధించగలమా? వాటిని నిషేధిం చలేనపుడు, అవి యథేచ్ఛగా షికార్లు చేస్తున్నప్పుడు, అవి ఏ నష్టమూ కలగ జేస్తలేవనుకున్నప్పుడు, ముఖేష్ ముతక మాటలే తీరని నష్టం కలిగిస్తాయ నడంలో అర్థమేముంది? డాక్యుమెంటరీపై నిషేధం సాధించగల ప్రయోజన మేముంటుంది? ముఖేష్ వ్యాఖ్యలనైనా తొలగించి డాక్యుమెంటరీని ప్రసారం చేయనిస్తే బాగుండేది. పురుషుల ఆలోచనా ధోరణి మారేలా భావజాల వ్యాప్తి జరగాలి. మహిళలపై ధాష్టీకాలకు వ్యతిరేకంగా ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు రావాలి. పాలకులు వారి మాట వినాలి, వారితో చర్చించాలి. మహిళలపై జరుగుతున్న ధాష్టీకాలకు వ్యక్తుల్ని, కుటుంబాల్ని, సమాజాల్ని, ప్రభుత్వాల్ని, న్యాయస్థానాల్ని అందర్నీ బాధ్యుల్ని చేస్తూ, జవాబుదారుగా నిలపాలి. స్త్రీ, పురుషుల మధ్య హెచ్చు తగ్గులు లేవు, ఆకాశంలో కాదు, నేల మీద సగం నువ్వు, సగం నేను కావాలి. ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
బీబీసీకి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ను బీబీసీ ప్రసారం చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు అందజేసింది. ఆ సంస్థ ఎలాంటి బెరుకు లేకుండా లండన్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేసి భారత ప్రభుత్వ హెచ్చరికలను పక్కకు పెట్టింది. పైగా ఆ వీడియోను యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసింది. కాగా బీబీసీ భారత్‌లో మాత్రం ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. బీబీసీకి లీగల్ నోటీసులు పంపింది. ఒప్పందానికి విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకున్నందున చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందిగా నోటీసులో స్పష్టంచేసింది. ‘‘డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకునేందుకు ముందు బీబీసీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే నోటీసు ఇచ్చాం. స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆ వీడియోను ప్రసారం చేయడానికి బీబీసీ ప్రణాళిక రచించింది. అయితే ముందుగానే మార్చి నాల్గో తేదీనే ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కల్గించిందని హోం శాఖ తెలిపింది. దీనిలో భాగంగానే ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యూ ట్యూబ్ లో పెట్టిన ఆ వివాదస్పద వీడియోను తొలగించారు. -
'ఆ వ్యాఖ్యలు ఉచ్చరించడానికే నీచం'
నిర్భయ కేసు దోషి ముకేష్ సింగ్ వ్యాఖ్యలను యునైటెడ్ నేషన్స్ ఖండించింది. బాధితురాలిని బాధ్యురాల్ని చేస్తూ ముకేష్ అన్న మాటలు ఉచ్చరించరానంత నీచంగా ఉన్నాయని పేర్కొంది. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. స్త్రీలపై దాడి జరిగిన ప్రతీసారి గట్టిగా నినదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై హింసను అడ్డుకోవడానికి పురుషులు సంసిధ్దులు కావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే 'ఇండియన్ డాటర్' డాక్యుమెంటరీ ప్రసారం నిషేధంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఇది ఇలా ఉంటే... ఇండియన్ డాటర్ పేరుతో బ్రిటీష్ ఫిలిం మేకర్ లెస్లీ ఉడ్విన్ తీసిన డాక్యుమెంటరీని అనుకున్నదాని కంటే ముందుగానే బీబీసీ, అంటే బుధవారం రాత్రి 10 గంటలకే ప్రసారం చేసింది తాము చాలా బాధ్యతాయుతంగా ఈ సమస్యను చిత్రీకరించామంటూ బీబీసీతన వైఖరిని సమర్థించుకుంది. నిర్భయ గ్యాంగ్ రేప్ ఉదంతంపై బీబీసీ చానెల్‌కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ ఇండియాస్ డాటర్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. నిజానికి... ఈ డాక్యుమెంటరీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ప్రసారం చేయడానికి ఉద్దేశించింది. -
డాక్యుమెంటరీ ఎందుకు బ్యాన్ చేశారు: నిర్బయ తండ్రి
'ఇండియా డాటర్' డాక్యుమెంటరీ ప్రదర్శన తప్పేం కాదని, ఎందుకు మన దేశంలో దానిపై నిషేధం విధించారని నిర్భయ తండ్రి ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఆ డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాల్సినదని, భారతదేశంలో వ్యక్తుల ఆలోచన విధానానికి, సమాజానికి ఆ డాక్యుమెంటరీ అద్దం పట్టేదన్నారు. 2012లో తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని బీబీసీ డాక్యుమెంటరీగా తీసిందని చెప్పారు. 'ప్రతి ఒక్కరు ఆ చిత్రాన్ని చూడాలి. జైలులో ఉన్న ఓ వ్యక్తి (ముఖేశ్‌ను ఉద్దేశించి) అలా మాట్లాడగలుగుతున్నాడంటే.. అతడిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంక ఏం మాట్లాడుతాడో ఊహించుకోండి' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్నే ఆ డాక్యుమెంటరీ చూపించిందని, నేరస్తులపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం దానిని అంగీకరించడం తప్ప ఏమి చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. కాగా ఇండియా డాటర్ డాక్యుమెంటరీని బీబీసీ చానెల్‌కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీశారు. ఇందుకోసం వారు నిర్భయ తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని ప్రశ్నించి దీనిని రూపొందించారు.