ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు! | incident of nirbaiah case | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు!

Published Wed, Mar 11 2015 11:22 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు! - Sakshi

ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు!

దృశ్యం
 
‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీపై ఒకవైపు చర్చోపచర్చలు, వాదవివాదాలు జరుగుతుండగానే, మరోవైపు నాగలాండ్‌లోని దిమాపూర్‌లో సంచలనాత్మక సంఘటన జరిగింది. అత్యాచారం కేసుకు సంబంధించిన నిందితుడిని వందలాదిమంది జైల్లో నుంచి వీధుల్లోకి లాక్కొచ్చి విపరీతంగా కొట్టి చంపేశారు. శవాన్ని మోటర్‌బైక్‌కు కట్టి తిప్పారు. క్లాక్‌టవర్ దగ్గర కంచెకు వేలాడదీశారు. ఆ తరువాత శవాన్ని తగలేసారు.

‘‘ఇదెక్కడి ఆటవిక రాజ్యం? వాళ్లు మనుషులా? రక్తం తాగే రాక్షసులా?’’ అని జరిగిన సంఘటనపై బాధ పడిన వాళ్లూ ఉన్నారు. ‘‘జై ళ్లు ఉన్నది ఎందుకు? నేరాన్ని కాదు, నేరమనస్తత్వాన్ని శిక్షించాలి’’ అన్న ప్రజాస్వామిక వాదులు, హక్కుల ప్రేమికులూ ఉన్నారు.
 జైలు అంటే గుర్తుకొచ్చింది... తీహార్ జైలు!
   
ఇప్పుడు మనం తీహార్ జైల్లోకి వెళొద్దాం.

 
ఇతడి పేరు ముఖేష్‌సింగ్. డిసెంబర్ 16 సంచలనాత్మక దుర్మార్గపు ఘటనలో బస్సు డ్రైవరు ఇతడే. ‘ఎన్ని జన్మలెత్తినా... మేము చేసిన పాపానికి పరిహారం లేదు’, ‘మేము అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించామో అర్థం కావడం లేదు’, ‘ఒకవేళ ఊరిశిక్ష ఖరారైతే... దేవుడు నాకు సరియైన శిక్ష విధించాడు అనుకుంటా. ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదిస్తే... కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా... ఆ ముఖేష్ వీడేనా... అని ఆశ్చర్యపోయేలా... మంచి పనులు ఎన్నో చేస్తా’

సారీ... పై మాటలు కల్పిత మాటలు. ‘ఇలా మాట్లాడితే బాగుణ్ణు’ అని రాసుకున్న మాటలు. అతని గొంతులో పశ్చాత్తాపంప్రతిధ్వనించాలని ఆశించి రాసుకున్న ఆశావహ మాటలు.
 
మరి నిజమైన మాటలు ఎలా ఉన్నాయి?

 
అవి వినేముందు ముఖేష్‌సింగ్ వైపు ఒకసారి పరిశీలనగా చూడండి. మాటవరుసకు కూడా అతని గొంతులో, కళ్లలో పశ్చాత్తాపం అనేది కనిపించదు. గుండె అనేది క్రూరత్వంతో, పైశాచికానందం అనే విషంతో నిండిపోయినప్పుడు, కళ్లలో మాత్రం పశ్చాత్తాపం ఎలా కనిపిస్తుంది?

‘‘ఆ సంఘటన ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నాను’’ అని ఒకటికి రెండుసార్లు అంటూనే ‘ఎలా జరిగిందో తెలుసా? ‘ఎందుకు జరిగిందో తెలుసా?’ అని చెప్పకనే చెబుతాడు ముఖేష్. ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ బి.బి.సి. యూట్యూబ్ పుణ్యమా అని ముఖేష్‌సింగ్ మాటలు ఆనోటా, ఈనోటా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని...  ‘ఎందుకు జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి వల్లే’
 ‘అబ్బాయిల వల్ల కాదు... అమ్మాయి వల్లే రేప్‌లు జరుగుతాయి’ (లడ్కీ జ్యాదా జిమ్మేదారి హై రేప్ కే లియే)
 ‘మంచి అమ్మాయిలు ఎవరూ అంత రాత్రివేళ ఇల్లు దాటి బయటికి రారు’  ‘ఒక్కసారి మా ఊళ్లో తప్ప... ఏ అమ్మాయితోనూ పడుకోలేదు’  ‘మా తమ్ముడు మాత్రం ఇలాంటివెన్నో చేశాడు. ఈసారి మాత్రం (ఢిల్లీ) అతని ఉద్దేశం రేప్ గానీ, దాడి గానీ కాదు.
 ‘ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లొస్తున్నారు?’ అని తమ్ముడు ఆ అమ్మాయితో పాటు ఉన్న యువకుడిని అడిగాడు.
 ‘నీకు అనవసరం’ అన్నాడు అతను. దాంతో ఆ యువకుడి చెంప చెళ్లుమంది. అలా ఘర్షణ మొదలైంది. లైట్లు స్విచ్‌ఆఫ్ అయ్యాయి. అమ్మాయిని బస్సు వెనక్కి లాక్కెళ్లారు. రేప్ మొదలైంది’
 
‘రేప్ జరిగినా ఇంకేది జరిగినా ఆ ఇద్దరూ సిగ్గుతో బయటికి చెప్పుకోలేరు అనేది ధీమా. ఒక వేళ పోలీసులకు ఎవరు దొరికినా, ఇతరుల గురించి చెప్పొద్దు అనుకున్నాం’ ‘చచ్చింది. బయటికి లాగి పారేయండి... అరుపులు వినిపిస్తున్నాయి. స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను’ ‘ఆమెను లాగి బయట పారేయడానికి బ్యాక్‌డోర్ ఓపెన్ చేద్దామనుకున్నారు. ఓపెన్ కాలేదు. రక్తం... రక్తం... రక్తం... సీట్లకు, ఫ్లోర్‌కు... అక్షయ్, చిన్న కుర్రాడు బస్సు క్లీన్ చేశాడు. వినయ్ చేతులు రక్తంతో తడిసాయి...’
   
ఇప్పుడు మనం... డిఫెన్స్ లాయర్ ఫర్ ది రేపిస్ట్స్ ‘యం.ఎల్.శర్మ’ దగ్గరికి వచ్చాం. ఆయన చెబుతున్న ‘డైమండ్ థియరీ’ గురించి విందాం... ‘ఆడపిల్ల అనేది డైమండ్‌లాంటిది. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వీధుల్లో ఉంటే ఏమవుతుంది? కుక్కల పాలవుతుంది!’
 
ముఖేష్ మాటల్లో పశ్చాత్తాపం కనిపించకపోవడానికి ‘నిరక్షరాస్యత’ ‘అజ్ఞానం’ ‘వెనకబాటుతనం’ కారణం అనుకుందాం. మరి శర్మకు ఏమైంది? బాగా చదువుకున్నాడు. పేరు పొందిన లాయర్. మరి ఆయన కూడా మూర్ఖుడు ముఖేష్‌లాగే... మాట్లాడుతున్నాడు. అందుకే నిర్భయ తల్లి కళ్లనీళ్లతో అంటుంది ఇలా...  ‘‘ఏ నేరం జరిగినా అమ్మాయిదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. నువ్విలా ఎందుకు చేశావు? అని నేరస్తుడిని ఎవరూ అడగరు’’.
 
ఈ డాక్యుమెంటరీలో చాలామంది ప్రముఖులు మాట్లాడారట. జైల్ సైకియాట్రిస్ట్ ఆఫ్ ది రేపిస్ట్ డా. సందీప్ గోవిల్ మాటల్లో నుంచి నేరస్వభావాన్ని చూస్తామా? ‘మా వాడికేపాపమూ తెలియదు’ అనే ముఖేష్, రామ్‌సింగ్‌ల తల్లిదండ్రులు మంగిలాల్, కళ్యాణి మాటలు నమ్ముతామా? మెంబర్ ఆఫ్ రేప్ రివ్యూ కమిటీ మాజీ చీఫ్ జస్టిస్ లీలా సేథ్ మాటల్లో ఎలాంటి న్యాయాన్ని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ చరిత్రకారిణి, రచయిత్రి డా. మారియ మిశ్రా మాటల్లో ఏ చరిత్రను వెదుక్కుంటాము? సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా.రష్మీ అహుజా, పెట్రోలింగ్ మాన్ రాజ్‌కుమార్ మాటల్లో వినిపించే భయానకత్వానికి ఒళ్లు ఎలా జలదరిస్తుంది అనేది పక్కనపెడితే... ఈ హారిఫిక్ రియాలిటి హైయెస్ట్ రేటింగ్ డాక్యుమెంటరీ అనగానే గుర్తుకొచ్చేవి మాత్రం... ఆ రెండు కళ్లే. పశ్చాత్తాపం కనిపించని ఆ నెత్తుటి కళ్లే!
 
 - యాకుబ్ పాషా యం.డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement