ఆస్కార్కు 'నిర్భయ' డాక్యుమెంటరీ!
'ఇండియాస్ డాటర్' పేరిట నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని ప్రముఖ హాలీవుడ్ కథానాయిక మెరిల్ స్ట్రీప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన సందర్భంగా ఆమె శుక్రవారం వీక్షించారు. డాక్యుమెంటరీ రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో దీనికి నామినేషన్ దక్కాలని జరుగుతున్న కాంపెయిన్లో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు.
ఢిల్లీలో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించి.. అమానుష హింస ఎదుర్కొని.. 13 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ధైర్యానికి ప్రతీకగా 'నిర్భయ' పేరుతో ఈ ఉదంతం నిలిచిపోయింది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై బ్రిటిష్ చిత్ర రూపకర్త లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, రేపిస్టులను ఈ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నిందితుల వాదనలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు గ్రహిత అయిన మెరిల్ స్ట్రీప్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ డాక్యుమెంటరీని మొదట చూసినప్పుడు నోటమాట రాకుండా అలా కాసేపు ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు.