Meryl Streep
-
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
హాలీవుడ్ ప్రముఖ నటి మెరిల్ స్ట్రీప్ ఆనందంలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన పామ్ డి ఓర్ గౌరవ పురస్కారానికి మెరిల్ స్ట్రీప్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమె ఆనందానికి కారణం ఇదే. ఈ ఏడాది మెరిల్ స్ట్రీప్‌కు, జపాన్‌కు చెందిన యానిమేషన్ ‘స్టూడియో ఘిబ్లి’ నిర్వాహకులకు, హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ వాల్టన్ లూకాస్ జూనియర్ (స్టార్ వార్స్, ఇండియానా జోన్స్’ ఫేమ్)కు పామ్ డి ఓర్ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా మెరిల్ స్ట్రీప్ మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డుకు ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్ భాగాస్వామ్యులైన కాన్స్ వేదికగా నేను ఈ అవార్డును గెలుచుకోవడం అనేది ఫిల్మ్ మేకింగ్ రంగంలో నాకు దక్కిన ఓ అద్భుత విజయంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. గతంలో హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, మైఖేల్ డగ్లస్, హారిసన్ ఫోర్డ్ వంటివారికి పామ్ డీ ఓర్ అవార్డు దక్కింది. -
అభిమానుల ప్రేమే నా బలం
హీరోయిన్గా ఐశ్వర్యా రాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అందాల సుందరి సాధించిన అవార్డులు, చేసిన పాత్రలను బట్టి ఆమె కొత్త కథానాయికలకు ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఐశ్వర్యా రాయ్‌లోని ఇలాంటి లక్షణాలే ఆమెకు ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఉమెన్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా (డబ్ల్యూఐఎఫ్‌టి) –2018 అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమం అమెరికాలో జరిగింది. ఈ వేడుకలో తల్లి బ్రిందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలసి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నారు. ‘‘ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. శ్రేయోభి లాషులు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నా బలం’’ అని అవార్డ్ సీక్వరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్యా రాయ్. అలాగే ఈ వేడుకలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, డైరెక్టర్ జోయా అక్తర్ కూడా పాల్గొన్నారు. జాన్వీ కపూర్‌కు ‘ధడక్’ సినిమాకు బెస్ట్ డెబ్యూ కేటగిరీలో డబ్ల్యూఐఎఫ్‌టి ఎమరాల్డ్ అవార్డు రాగా, జోయా అక్తర్‌కు వైలర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డైరెక్షన్ అవార్డ్ దక్కింది. ‘‘నా మిసెస్‌కి ఈ అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. అక్కడున్న ఆరాధ్య తనకు ప్రేమతో హగ్ ఇస్తుంది. నేనేమో ఆ ఫోటో చూస్తూ ప్రౌడ్ హస్బెండ్‌లా ఫీల్ అవుతున్నాను’’ అని అభిషేక్ తన ఆనందాన్ని ట్వీటర్లో పేర్కొన్నారు. -
టామ్ హ్యాంక్స్ భయపడ్డాడు!!
టామ్ హ్యాంక్స్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. లెజెండ్. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెయ్యలేని పాత్రంటూ లేదనిపిస్తాడు. ఎలాంటి పాత్రనిచ్చినా అలవోకగా నటించేస్తాడు. అలాంటి నటుడు భయపడ్డాడు!! అదీ.. ఏ కొత్త పాత్ర చేయడానికో, ఏ దర్శకుడో చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకోలేకో, మరింకోటో కాదు. తనతో పాటు కలిసి నటించే నటిని చూసి భయపడ్డాడు. ఆ భయానికి కారణం ఏంటంటే అక్కడున్నది మెరిల్ స్ట్రీప్. ఆమె కొన్ని జనరేషన్స్ స్టార్స్‌కి ఇన్స్పిరేషన్. అవార్డ్ విన్నింగ్ యాక్టర్. అలాంటి స్టార్ టామ్ హ్యాంక్స్తో కలిస్తే? అభిమానులకు ఎలాంటి పండగో చెప్పక్కర్లేదు. తాజాగా విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న ‘ది పోస్ట్’లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ పోటీ పడి నటించారీ సినిమాలో. ఇక వీరికి తోడు దర్శకుడు స్పీల్బర్గ్ మ్యాజిక్ కూడా తోడవ్వడంతో ‘ది పోస్ట్’ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకుంటోంది. ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలో నటించడం అదృష్టం అంటాడు టామ్ హ్యాంక్స్. మెరిల్ స్ట్రీప్‌తో కలిసి నటించడం కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ అంటాడు. నిజానికి సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు మెరిల్ స్ట్రీప్‌తో నటించడానికి భయపడ్డాడట హ్యాంక్స్. ‘ఎందుకూ?’ అనడిగితే, ‘ఏమో! మెరిల్ స్ట్రీప్‌తో నటించడం అంటే భయమేసింది’ అంటున్నాడు. ఆస్కార్స్‌లో ఈ సినిమా మెయిన్ అవార్డులన్నీ పట్టుకెళుతుందని హాలీవుడ్ అంచనా వేసుకుంటోంది. పోటీ పడి నటించిన ఈ స్టార్స్‌లో ఎవరో ఒకరు అవార్డు దక్కించుకునేలాగే ఉన్నారు కూడా!! -
ఆస్కార్‌కు 'నిర్భయ' డాక్యుమెంటరీ!
'ఇండియాస్ డాటర్' పేరిట నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని ప్రముఖ హాలీవుడ్ కథానాయిక మెరిల్ స్ట్రీప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన సందర్భంగా ఆమె శుక్రవారం వీక్షించారు. డాక్యుమెంటరీ రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో దీనికి నామినేషన్ దక్కాలని జరుగుతున్న కాంపెయిన్లో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించి.. అమానుష హింస ఎదుర్కొని.. 13 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ధైర్యానికి ప్రతీకగా 'నిర్భయ' పేరుతో ఈ ఉదంతం నిలిచిపోయింది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై బ్రిటిష్ చిత్ర రూపకర్త లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, రేపిస్టులను ఈ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నిందితుల వాదనలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు గ్రహిత అయిన మెరిల్ స్ట్రీప్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ డాక్యుమెంటరీని మొదట చూసినప్పుడు నోటమాట రాకుండా అలా కాసేపు ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు. -
ఈసారి ఆస్కార్ పురస్కారం బామ్మకా? భామకా?
కథానాయికల కెరీర్ మన దేశంలో అయితే ఇప్పుడు పది నుంచి పదిహేనేళ్లు ఉంటుందేమో. అంటే.. పదహారు నుంచి ముప్ఫయ్ ఏళ్లు లోపు ఉన్న తారలే హీరోయిన్లుగా చలామణీ అవ్వగలుగుతారు. కానీ, హాలీవుడ్లో ఇందుకు పూర్తి భిన్నం. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు ప్రతిభ, ఓపిక ఉన్న ఎవరైనా కథానాయికలుగా రాణించవచ్చు. అందుకు ఓ ఉదాహరణ ఈ ఏడాది ‘ఉత్తమ నటి’ విభాగంలో నిలిచిన తారల జాబితా. నాలుగు పదుల వయసు నుంచి ఎనిమిది పదుల వయసున్నవారి దాకా ఈ విభాగంలో పోటీపడుతున్నారు. మరి.. ఈ పోటీలో బంగారు బొమ్మ భామకు దక్కుతుందా? బామ్మకా? అనేది మార్చి 2న జరగబోయే ఆస్కార్ వేడుకలో తెలుస్తుంది. ఇక, ఈ తారల్లో ఎవరెవరు ఎన్నిసార్లు నామినేషన్ దక్కించుకున్నారు? ప్రస్తుతం ఏయే సినిమా ద్వారా పోటీలో నిలిచారో చూద్దాం... సాండ్రాకు రెండోసారి... ఆస్కార్ అందం, అభినయానికి చిరునామాగా సాండ్రా బుల్లక్‌ని హాలీవుడ్వారు అభివర్ణిస్తుంటారు. ఒక ఏడాది తక్కువ ఐదు పదుల వయసులో ఉన్న ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇప్పటివరకు రెండుసార్లు ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు సాండ్రా. వాటిలో ‘ది బ్లైండ్ సైడ్’ ఒకటి కాగా, మరో సినిమా ‘గ్రావిటీ’. ‘ది బ్లైండ్‌సైడ్’కి ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్ అవార్డ్ కూడా గెల్చుకున్నారు. ఇక, ‘గ్రావిటీ’ చిత్రంలో డా. ర్యాన్ స్టోన్ పాత్ర ఆమెకు ఈ ఏడాది నామినేషన్ దక్కేలా చేసింది. . ఓ కార్యసాధన నిమిత్తం ఒక వ్యోమగామితో అంతరిక్షంలోకి వెళ్లే ర్యాన్ స్టోన్ పాత్రలో సాండ్రా ఒదిగిపోయిన వైనానికి ప్రేక్షకులు శభాష్ అన్నారు. ఆస్కార్ కమిటీకి కూడా అదే అనిపిస్తే, సాండ్రా రెండోసారి ఈ ప్రతిమను గెల్చుకోవడం ఖాయం. ఇక, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటితో పాటు ఇతర విభాగాలతో కలిపి ‘గ్రావిటీ’ సినిమా పది నామినేషన్లు దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్కారం లేకపోలేదు! ఈ ఏడాది ‘అమెరికన్ హజిల్’ చిత్రంతో తొలిసారి ఉత్తమ నటిగా నామినేషన్ సంపాదించుకున్నారు అమీ ఆడమ్స్. అయితే గతంలో నాలుగు చిత్రాలకు సహాయనటిగా నామినేట్ అయ్యారు కానీ, చివరి ఫలితాల్లో చుక్కెదురు అయ్యింది. ఈసారైనా నామినేషన్‌తో సరిపెట్టుకోకుండా అవార్డ్‌ని ఇంటికి తీసుకెళతాననే నమ్మకంతో ఉన్నారు అమీ. ఇక ‘అమెరికన్ హజిల్’ చిత్రం విషయానికొస్తే... దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ కుంభకోణం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఓ లోన్ స్కామ్‌లో ఇరుక్కునే సిడ్ని ప్రొసెసర్ అనే యువతిగా నటించారు అమీ ఆడమ్స్. కొంతమంది నేరస్తులను పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఆమె ఎలా సహాయపడుతుంది? అనే కథాంశంలో నెగటివ్ నుంచి పాజిటివ్ సైడ్‌కి మారే పాత్ర తనది. ఈ పాత్రను అమీ సమర్థవంతంగా పోషించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఆమె నటన ప్రధాన కారణం. కాబట్టి ఆస్కార్ దక్కించుకునే ఆస్కారం ఆమెకు లేకపోలేదు. నమ్మకం నిజమవుతుందా? : కేట్ బ్లాంచెట్ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకోవడం కేట్ బ్లాంచెట్కి ఇది మొదటిసారి కాదు. 1998లో ‘ఎలిజబెత్’ చిత్రానిగాను ఆమె తొలిసారి నామినేట్ అయ్యారు కానీ, అవార్డ్ రాలేదు. ఆ తర్వాత ‘ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్’, ‘ఐయామ్ నాట్ దేర్’, తాజాగా ‘బ్లూ జాస్మిన్’ చిత్రాలకు ఉత్తమనటి విభాగంలో నామినేట్ అయ్యారు. అలాగే, ఉత్తమ సహాయనటిగా రెండు సినిమాలకు నామినేషన్ దక్కించుకోగా, ఓ సినిమాకి అవార్డ్ పొందారు. ఉత్తమ నటిగా ఈసారైనా బంగారుప్రతిమ తనను వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు కేట్. ‘బ్లూ జాస్మిన్’ అనే చిత్రంలో ఓ మోసగాడితో జీవితం పంచుకునే జాస్మిన్ అనే మహిళ పాత్రద్వారా ఆమె ఆస్కార్‌కి పోటీపడుతున్నారు. భర్త మోసం తెలుసుకుని అతనికి దూరంగా ఒంటరిగా బతికే జాస్మిన్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆమె పడిన కష్టాలేంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. మరి.. ఈసారి ఆస్కార్ ఖాయం అనే కేట్ నమ్మకం నిజం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. వంక పెట్టలేని అభినయం ఆస్కార్ బరిలో పోటీపడుతున్న తారల్లో జూడి డెంచ్ తర్వాత పెద్దావిడ మెరిల్ స్ట్రీప్. ఆమె వయసు 65. ఇప్పటివరకు ఉత్తమ సహాయ నటిగా రెండు ఆస్కార్లు, ఉత్తమ నటిగా ఓ ఆస్కార్‌ని తన అల్మారాలో భద్రంగా దాచుకున్నారు మెరిల్. అలాగే, 18 సార్లు నామినేషన్ దక్కించుకున్న రికార్డ్ ఆమె సొంతం. ‘ఆగస్ట్: ఒసేజ్ కంట్రీ’ చిత్రంలో చేసిన వయొలెట్ పాత్రకుగాను ఆమె పోటీపడుతున్నారు. ఈ చిత్రంలో నోటికేన్సర్తో బాధపడే మహిళ పాత్రను చేశారామె. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారు. అలా, గ్లామరస్ రోల్స్ చేసినప్పుడు ఆ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయిన మెరిల్ ఈ వయొలెంట్ పాత్రలో జీవించారు. ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఆమె నటించారని క్రిటిక్స్ సైతం మెరిల్‌ని అభినందించారు. ఈ పాత్రకు పలు చిత్రోత్సవాల్లో అవార్డ్ పొందారామె. మరి.. ఆస్కార్ కమిటీ ఏం నిర్ణయిస్తుందో? కంట తడి పెట్టించిన బామ్మగారు ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో నిలిచినవారిలో జూడి డెంచ్ చాలా సీనియర్. ఆమె వయసు 80. ఈ ఏడాది ‘ఫిలోమెనా’ చిత్రంతో కలిపి ఇప్పటివరకు ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో ఐదు నామినేషన్లు దక్కించుకున్నారు జూడి. 1998లో ‘షేక్స్పియర్ ఇన్ లవ్’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. ఇక ‘ఫిలోమెనా’ విషయానికొస్తే... ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేశారు. పెళ్లి కాకుండా తల్లయ్యే ఫిలోమెనా అనే యువతి సమాజానికి భయపడి తన కొడుకుని అనాథ శరణాలయంలో చేరుస్తుంది. ఆ తర్వాత 50 ఏళ్లకు తన కొడుకుని వెతకడం మొదలుపెడుతుంది. ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం ఇది. తొందరపాటుతో బిడ్డకు దూరమై, కుమిలిపోయే తల్లి పాత్రలో జూడి నటన ప్రేక్షకులను కంట తడిపెట్టించింది. కాబట్టి, ఆస్కార్ కమిటీవారి హృదయాన్ని తాకుతుందనే అంచనాలు ఉన్నాయి. సో... అందాల ఆస్కార్ బొమ్మ ఈ బామ్మగారిని వరించే అవకాశం మెండుగానే ఉంది. -
హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి
ఒకప్పుడు భారతీయ సినిమాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తార శ్రీదేవి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ఇటీవలే ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రవిజయంతో ఐదుపదుల వయసులోనూ తనకు తిరుగు లేదని నిరూపించేసుకున్నారామె. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవికి బోల్డన్ని అవకాశాలు వచ్చినా, దేనికీ పచ్చజెండా ఊపలేదు. చేస్తే మళ్లీ హిట్ సినిమానే చేయాలనే పట్టుదలతో ఉన్నారామె. ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ చెప్పిన కథ నచ్చి, ఆమె ఒప్పుకున్నారు. తాజాగా, శ్రీదేవిని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించిందని సమాచారం. హాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెరిల్ స్ట్రీప్, శ్రీదేవి కాంబినేషన్లో జెరిమీ వాల్, జెర్రీ లీడర్ ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి ‘కౌబోయ్స్ అండ్ ఇండియన్స్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని, దీనికి అమీ రెడ్ఫోర్డ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇటీవలే ఈ చిత్రం గురించి శ్రీదేవితో చర్చించారట. అయితే శ్రీదేవి మాత్రం అధికారికంగా సైన్ చేయలేదని వినికిడి. ఈ అవకాశం వచ్చింది నిజమేనని, కథ కూడా తమ చేతికొచ్చిందని శ్రీదేవి భర్త బోనీకపూర్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుమార్తె జాన్వీ ఈ కథ చదివిన తర్వాతే అసలు విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ శ్రీదేవి ఈ సినిమా ఒప్పుకుంటే హాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి సినిమా అవుతుంది. వాస్తవానికి శ్రీదేవి ఎప్పుడో హాలీవుడ్లో చేయాల్సి ఉంది. ఆలస్యం అయినా తన దైన ఓ మార్క్ చూపిస్తారని అభిమానుల ఆకాంక్ష.