ఈసారి ఆస్కార్ పురస్కారం బామ్మకా? భామకా? | sandra bullock, Judi Dench, amy adams may get Oscar nominations | Sakshi
Sakshi News home page

ఈసారి ఆస్కార్ పురస్కారం బామ్మకా? భామకా?

Published Sat, Jan 18 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

sandra bullock, Judi Dench, amy adams may get Oscar nominations

కథానాయికల కెరీర్ మన దేశంలో అయితే ఇప్పుడు పది నుంచి పదిహేనేళ్లు ఉంటుందేమో. అంటే.. పదహారు నుంచి ముప్ఫయ్ ఏళ్లు లోపు ఉన్న తారలే హీరోయిన్లుగా చలామణీ అవ్వగలుగుతారు. కానీ, హాలీవుడ్‌లో ఇందుకు పూర్తి భిన్నం. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు ప్రతిభ, ఓపిక ఉన్న ఎవరైనా కథానాయికలుగా రాణించవచ్చు. అందుకు ఓ ఉదాహరణ ఈ ఏడాది ‘ఉత్తమ నటి’ విభాగంలో నిలిచిన తారల జాబితా. నాలుగు పదుల వయసు నుంచి ఎనిమిది పదుల వయసున్నవారి దాకా ఈ విభాగంలో పోటీపడుతున్నారు. మరి.. ఈ పోటీలో బంగారు బొమ్మ భామకు దక్కుతుందా? బామ్మకా? అనేది మార్చి 2న జరగబోయే ఆస్కార్ వేడుకలో తెలుస్తుంది. ఇక, ఈ తారల్లో ఎవరెవరు ఎన్నిసార్లు నామినేషన్ దక్కించుకున్నారు? ప్రస్తుతం ఏయే సినిమా ద్వారా పోటీలో నిలిచారో చూద్దాం...

సాండ్రాకు రెండోసారి... ఆస్కార్
అందం, అభినయానికి చిరునామాగా సాండ్రా బుల్లక్‌ని హాలీవుడ్‌వారు అభివర్ణిస్తుంటారు. ఒక ఏడాది తక్కువ ఐదు పదుల వయసులో ఉన్న ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇప్పటివరకు రెండుసార్లు ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు సాండ్రా. వాటిలో ‘ది బ్లైండ్ సైడ్’ ఒకటి కాగా, మరో సినిమా ‘గ్రావిటీ’. ‘ది బ్లైండ్‌సైడ్’కి ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్ అవార్డ్ కూడా గెల్చుకున్నారు.
 
ఇక, ‘గ్రావిటీ’ చిత్రంలో డా. ర్యాన్ స్టోన్ పాత్ర ఆమెకు ఈ ఏడాది నామినేషన్ దక్కేలా చేసింది. . ఓ కార్యసాధన నిమిత్తం ఒక వ్యోమగామితో అంతరిక్షంలోకి వెళ్లే ర్యాన్ స్టోన్ పాత్రలో సాండ్రా ఒదిగిపోయిన వైనానికి ప్రేక్షకులు శభాష్ అన్నారు. ఆస్కార్ కమిటీకి కూడా అదే అనిపిస్తే, సాండ్రా రెండోసారి ఈ ప్రతిమను గెల్చుకోవడం ఖాయం. ఇక, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటితో పాటు ఇతర విభాగాలతో కలిపి ‘గ్రావిటీ’ సినిమా పది నామినేషన్లు దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

ఆస్కారం లేకపోలేదు!
ఈ ఏడాది ‘అమెరికన్ హజిల్’ చిత్రంతో తొలిసారి ఉత్తమ నటిగా నామినేషన్ సంపాదించుకున్నారు అమీ ఆడమ్స్. అయితే గతంలో నాలుగు చిత్రాలకు సహాయనటిగా నామినేట్ అయ్యారు కానీ, చివరి ఫలితాల్లో చుక్కెదురు అయ్యింది. ఈసారైనా నామినేషన్‌తో సరిపెట్టుకోకుండా అవార్డ్‌ని ఇంటికి తీసుకెళతాననే నమ్మకంతో ఉన్నారు అమీ. ఇక ‘అమెరికన్ హజిల్’ చిత్రం విషయానికొస్తే... దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ కుంభకోణం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.  
 
 ఓ లోన్ స్కామ్‌లో ఇరుక్కునే సిడ్ని ప్రొసెసర్ అనే యువతిగా నటించారు అమీ ఆడమ్స్. కొంతమంది నేరస్తులను పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఆమె ఎలా సహాయపడుతుంది? అనే కథాంశంలో నెగటివ్ నుంచి పాజిటివ్ సైడ్‌కి మారే పాత్ర తనది. ఈ పాత్రను అమీ సమర్థవంతంగా పోషించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఆమె నటన ప్రధాన కారణం. కాబట్టి ఆస్కార్ దక్కించుకునే ఆస్కారం ఆమెకు లేకపోలేదు.

నమ్మకం నిజమవుతుందా? : కేట్ బ్లాంచెట్‌
ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకోవడం కేట్ బ్లాంచెట్‌కి ఇది మొదటిసారి కాదు. 1998లో ‘ఎలిజబెత్’ చిత్రానిగాను ఆమె తొలిసారి నామినేట్ అయ్యారు కానీ, అవార్డ్ రాలేదు. ఆ తర్వాత ‘ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్’, ‘ఐయామ్ నాట్ దేర్’, తాజాగా ‘బ్లూ జాస్మిన్’ చిత్రాలకు ఉత్తమనటి విభాగంలో నామినేట్ అయ్యారు. అలాగే, ఉత్తమ సహాయనటిగా రెండు సినిమాలకు నామినేషన్ దక్కించుకోగా, ఓ సినిమాకి అవార్డ్ పొందారు.
 
ఉత్తమ నటిగా ఈసారైనా బంగారుప్రతిమ తనను వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు కేట్. ‘బ్లూ జాస్మిన్’ అనే చిత్రంలో ఓ మోసగాడితో జీవితం పంచుకునే జాస్మిన్ అనే మహిళ పాత్రద్వారా ఆమె ఆస్కార్‌కి పోటీపడుతున్నారు. భర్త మోసం తెలుసుకుని అతనికి దూరంగా ఒంటరిగా బతికే జాస్మిన్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆమె పడిన కష్టాలేంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. మరి.. ఈసారి ఆస్కార్ ఖాయం అనే కేట్ నమ్మకం నిజం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

వంక పెట్టలేని అభినయం
ఆస్కార్ బరిలో పోటీపడుతున్న తారల్లో జూడి డెంచ్ తర్వాత పెద్దావిడ మెరిల్ స్ట్రీప్. ఆమె వయసు 65. ఇప్పటివరకు ఉత్తమ సహాయ నటిగా రెండు ఆస్కార్‌లు, ఉత్తమ నటిగా ఓ ఆస్కార్‌ని తన అల్మారాలో భద్రంగా దాచుకున్నారు మెరిల్. అలాగే, 18 సార్లు నామినేషన్ దక్కించుకున్న రికార్డ్ ఆమె సొంతం. ‘ఆగస్ట్: ఒసేజ్ కంట్రీ’ చిత్రంలో చేసిన వయొలెట్ పాత్రకుగాను ఆమె పోటీపడుతున్నారు. ఈ చిత్రంలో నోటికేన్సర్‌తో బాధపడే మహిళ పాత్రను చేశారామె. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారు. అలా, గ్లామరస్ రోల్స్ చేసినప్పుడు ఆ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయిన మెరిల్ ఈ వయొలెంట్ పాత్రలో జీవించారు. ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఆమె నటించారని క్రిటిక్స్ సైతం మెరిల్‌ని అభినందించారు. ఈ పాత్రకు పలు చిత్రోత్సవాల్లో అవార్డ్ పొందారామె. మరి.. ఆస్కార్ కమిటీ ఏం నిర్ణయిస్తుందో?

 కంట తడి పెట్టించిన బామ్మగారు
 ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో నిలిచినవారిలో జూడి డెంచ్ చాలా సీనియర్. ఆమె వయసు 80. ఈ ఏడాది ‘ఫిలోమెనా’ చిత్రంతో కలిపి ఇప్పటివరకు ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో ఐదు నామినేషన్లు దక్కించుకున్నారు జూడి. 1998లో ‘షేక్స్‌పియర్ ఇన్ లవ్’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. ఇక ‘ఫిలోమెనా’ విషయానికొస్తే... ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేశారు. పెళ్లి కాకుండా తల్లయ్యే ఫిలోమెనా అనే యువతి సమాజానికి భయపడి తన కొడుకుని అనాథ శరణాలయంలో చేరుస్తుంది. ఆ తర్వాత 50 ఏళ్లకు తన కొడుకుని వెతకడం మొదలుపెడుతుంది. ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం ఇది. తొందరపాటుతో బిడ్డకు దూరమై, కుమిలిపోయే తల్లి పాత్రలో జూడి నటన ప్రేక్షకులను కంట తడిపెట్టించింది. కాబట్టి, ఆస్కార్ కమిటీవారి హృదయాన్ని తాకుతుందనే అంచనాలు ఉన్నాయి. సో... అందాల ఆస్కార్ బొమ్మ ఈ బామ్మగారిని వరించే అవకాశం మెండుగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement