నేను పరిపూర్ణమైన పురుషుణ్ణి కాదు!
మగాడంటే ఎలా ఉండాలి?.. పది మందిని కొట్టేంత శక్తిమంతునిగా, ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా ఏడవకుండా నిబ్బరంగా ఉండేట్టుగా... ఎలాంటి పరిస్థితిలోనూ ఎవరి మీదా ఆధారపడకుండా.. ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలని కొంతమంది చెబుతుంటారు. ఒకవేళ మగతనానికి ఇవన్నీ నిర్వచనం అని ఎవరైనా బలంగా నమ్మితే, అప్పుడు నేను ‘పరిపూర్ణమైన పురుషుణ్ణి కాదు’ అని కొంచెం కూడా తడబడకుండా స్టేట్‌మెంట్ ఇచ్చారు ఆమిర్ ఖాన్. న్యూయార్క్‌లో జరిగిన ‘ప్రపంచంలో స్త్రీ శక్తి’ అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘సమస్యల్లోనే కాదు.. ఏ సమస్యా లేనప్పుడూ నేను నా భార్య చేతులు పట్టుకుంటాను. తన నీడని కోరుకుంటాను.
అలాగే, తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు, మగాణ్ణి కదా అని నిగ్రహించుకోను.. ఏడ్చేస్తాను. పదిమందిని కొట్టలేను. ఇలా ఉండేవాళ్లని పరిపూర్ణమైన మగాడు కాదని ఎవరైనా అంటే.. సరే.. ‘నేను కాదు’ అని ఒప్పుకుంటా. మగపిల్లలను చిన్నప్పట్నుంచే ‘నువ్వు మగాడివి.. ఏడవకూడదు’ అని తల్లిదండ్రులు నియంత్రించడం తప్పు. ఆ విధంగా చెప్పడం ద్వారా పురుషాహంకారం ఏర్పడుతుంది. అతడి అహంకారం ఏ స్థాయిలో ఉంటుందంటే ‘భార్యను కొట్టేంత’. అందుకే ముందు సమాజంలో మార్పు రావాలి. పురుషుడంటే ఆధిపత్యం చెలాయించాలి... స్త్రీ అంటే అణకువగా ఉండాలి అనే భావనను వదిలిపెట్టాలి’’ అని ఉద్వేగంగా అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రముఖులు ఆమిర్ ప్రసంగానికి ముగ్ధులైపోయారు.
కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు. భారతదేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారం గురించి ఇదే వేదికపై ఆమిర్ ప్రసంగించారు. దోషికి శిక్ష పడటానికి ఎక్కువ కాలం పడుతోందనీ, నేరాలు విరివిగా జరగడానికి అదొక కారణమనీ ఆమిర్ అన్నారు. అందుకే చట్టంలో కొన్ని మార్పులు రావాలని ఆయన పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన స్త్రీలు మానసికంగా ఇంకా కుంగిపోయేలా కొంతమంది పోలీసులు, వైద్యులు ప్రవరిస్తుంటారనీ, అది తగదనీ సూచించారు. ‘ఇండియాస్ డాటర్’ పేరిట తీసిన లఘు చిత్రాన్ని మీరు చూశారా? అని అక్కడివారు ప్రశ్నించినప్పుడు ‘‘భారతదేశంలో ఈ చిత్రంపై నిషేధం విధించడం దురదృష్టకరం. అందుకని చూడలేకపోయా’’ అని ఆమిర్ చెప్పారు.