అన్నం గిన్నే తొణికితే అరిష్టం | 86 farmers have committed suicide in six months | Sakshi
Sakshi News home page

అన్నం గిన్నే తొణికితే అరిష్టం

Published Fri, Dec 26 2014 12:50 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

దిలీప్ రెడ్డి - Sakshi

దిలీప్ రెడ్డి

 సమకాలీనం
 సంక్షోభానికి తట్టుకోలేక గడచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది 90 పైనే అని మానవహక్కుల వేదిక చెబుతోంది. ‘‘ఆత్మహత్యలా? ఏవీ? ఎక్కడ? ఏ రాష్ట్రంలో?’’ అని తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ ముఖ్య మంత్రి వెటకారం చేశారు. అదే ధోరణిని సాక్షాత్తూ చట్టసభ వేదికపైనా కనబరిచారు. చేతనైతే, రుణ మాఫీ అమలుకానందునే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా ఇవ్వాలని విపక్షాన్ని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతు విధిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దాని అర్థమేంటి? రుణమాఫీ జరగనందుకే అని విడిగా ఎలా నిరూపిస్తారు?
 
 ఈ భూమ్మీద తన ఉత్పత్తికి తాను ధర నిర్ణయించని వారెవరైనా ఉన్నారంటే ఒక్క రైతులే! భూమి, నీళ్లు, పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, విద్యుత్తు ఇలా... వ్యవసాయోత్పత్తుల కోసం వినియోగించే ప్రతి వస్తువుకు, సేవలకు ధరల్ని వాటి యజమానులో, ఉత్పత్తిదారులో నిర్ణయి స్తారు. కానీ, అన్ని పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన మీదట, ప్రకృతి దయానుసారం తన చేతికి దక్కే పంటకు మాత్రం ధర వేరేవారు నిర్ణయిస్తారు. లాభానికీ నష్టానికీ సిద్ధపడి ఉత్పత్తిపై సర్వహక్కులు కలిగిన రైతు ధర నిర్ణయించడు. గిట్టుబాటు కాకపోయినా, అత్యధిక సందర్భాల్లో ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువే లభించినా... అమ్ముకోక తప్పని దయనీయ స్థితి రైతుది. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచంలో వేరెక్కడా ఉండదు. ఇంత తేలికైన ఆర్థిక సమీకరణాన్ని కూడా పాలకులు అర్థం చేసుకోవటం లేదు. ఎన్ని అధ్యయనాలు జరిపినా... గతితప్పిన ఈ ఆర్థిక సూత్రమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద లాది రైతు కుటుంబాలు ఈ రోజు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోదిస్తు న్నాయి. ఆహారోత్పత్తిలో తలమునకలై బతుకు బండిలాగే రైతు, ప్రపంచానికి అన్నం పెట్టి తాను పస్తులుంటే, ఆత్మహత్య చేసుకుంటుంటే మిగతా ప్రపంచం ఇంత స్పందనా రహితంగా ఉండటమే ఆశ్చర్యకరం. ముఖ్యంగా ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి క్షమించరానిది.  తిండిగింజల ఉత్పత్తికి కారకుడిగా కాదు, కనీస పౌరులుగా కూడా గణించడం లేదు. ఆ వంకర చూపు కూడా ఎన్నికల ముందొకలా-వెనుకొకలా పూర్తి భిన్నంగా ఉంటోంది. ముందు ఓటు బ్యాంకులుగా పరిగణించి హామీలతో వారి ఓట్లు కొల్లగొట్టి, ఆపై అధికారం లోకి వచ్చాక  మొండిచేయితో ఎదురు బుకాయింపులకు పాల్పడుతున్నాయి. నిన్నటికి నిన్న ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ విపరిణామానికి వేదికయినాయి. రుణమాఫీపై ఎంతో కొంత స్పష్టత వస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతుకు ఒట్టి వేదనే మిగిలింది. బలవన్మరణాలకు గురైన రైతు కుటుంబాల ఆర్తి హారతి కర్పూరమైంది.
 వైఖరిలోనే లోపం
 రైతు పట్ల, వ్యవసాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడి  వైఖరిలోనే లోపముంది. ఇది చాలాసార్లు రుజువైంది. ఉచిత విద్యుత్తు విషయం లోనూ తడవకో మాట చెప్పిన వైనమే ఈ వైఖరి లోపానికి నిలువెత్తు నిదర్శనం. ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని మొదట, ‘నేనూ ఇస్తానని చెప్పి ఉండాల్సింది, ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్లం, తప్పయిపోయింది’ అని మరోమారు, ‘ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఉచిత విద్యుత్తే కారణం-అందుకే నేను మొదట్నుంచీ చెబుతున్నాను, ఇవ్వడం సరికాద’ని ఇంకోమారు.. ఇలా తడవకో మాట చెప్పారు. ఇప్పుడు రుణమాఫీ విషయంలోనూ అదే జరుగుతోంది. ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. తర్వాత పంట రుణాలు మాత్రమే నన్నారు. అందులోనూ రకరకాల ఆంక్షలు, షరతులు వర్తింపజేసి లబ్ధిని- లబ్ధిదారుల్ని కుదిస్తున్నారు. ఆయన హామీని అమలు చేస్తారని నమ్మిన రైతులి ప్పుడు కుమిలిపోతున్నారు. షరతులు పెట్టి మాటమార్చడంతో రుణమాఫీ కాస్తా హామీ మాఫీగా మారిన దుస్థితి. సంక్షోభానికి తట్టుకోలేక గడచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది 90 పైనే అని మానవహక్కుల వేదిక చెబుతోంది. ‘‘ఆత్మహత్యలా? ఏవీ? ఎక్కడ? ఏ రాష్ట్రంలో?’’ అని తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ ముఖ్య మంత్రి వెటకారం చేశారు. అదే ధోరణిని సాక్షాత్తూ చట్టసభ వేదికపైనా కనబరి చారు. చేతనైతే, రుణ మాఫీ అమలుకానందునే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా ఇవ్వాలని విపక్షాన్ని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతు విధిలేక ఆత్మ హత్య చేసుకున్నాడు. దాని అర్థమేంటి? రుణమాఫీ జరగనందుకే అని విడిగా ఎలా నిరూపిస్తారు. ఫోరెన్సిక్ నివేదికే కాదు, ఇప్పుడు నష్టపరిహారం పొందడా నికి సమర్పించాల్సిన 13 పత్రాల్లో ఏదీ ఆ విషయాన్ని నిరూపించలేదేమో! ఇది, సమస్య పట్ల-సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రైతు పట్ల పాలకుల బాధ్యతా రాహిత్యాన్ని, పలాయనవాదాన్నే వెల్లడి చేస్తోంది. అదే ముఖ్యమంత్రి రెండు రోజులాగి, ‘రైతు ఆత్మహత్యలు బాధాకరం, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని గొంతు మార్చారు. ఇలా, అవసరాన్ని బట్టి మాట మార్చే పాలకుల అవకాశవాద ధోరణి రైతులకు శాపంగా మారి నైరాశ్యంలో వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మిగిలిన రైతాంగానికి వ్యవసాయమంటేనే భయం కలిగిస్తోంది.
 దీన రైతుకిక దిక్కెవ్వరు?
 కన్నతల్లి దయ్యమైతే ఇంట్లో తొట్టెల కట్టే  చోటెక్కడ? అన్న సామెత చందంగా మారింది రైతు పరిస్థితి. రాష్ట్రాధినేతే రైతు ఆత్మహత్యలు అంతగా లేవంటే, ఇక గోడు ఎవరికి చెప్పుకునేది. ఇదే ధోరణి అధికార వ్యవస్థకు కూడా అలవాటైపోతే, ఇక రైతు ఆత్మహత్యలన్నింటినీ ఇతరేతర కారణాల వల్ల జరిగిన సాధారణ ఆత్మహత్యలుగానే రికార్డులకెక్కిస్తారు. ‘...ఒక్క రైతులే ఏమిటి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రేమలో విఫలమైన యువత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి చెప్పిన పోలిక రాష్ట్రంలో చాలా మందికి జీర్ణం కాలేదు. ఇది రైతు సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపేదిగానూ కనిపించింది. ఇప్పటికే, దుర్భర పరిస్థితుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందడానికి కుటుంబీకులు 13 పత్రాల్ని అధికారులకు సమర్పించి, సంతృప్తిప రచాల్సి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా, ఆత్మహత్యా యత్నం నేరం కాదంటూ, ఐపీసీ సెక్షన్ 309 ని తొలగిస్తూ చట్ట సవరణ తెచ్చాక ఇంకెన్ని ఇబ్బందులో! అసలు కేసులు సక్రమంగా రికార్డవుతాయా? అన్నది పెద్ద సందేహం. రైతు ఆత్మహత్యల విషయంలో పోలీసు రికార్డులకు, ప్రభుత్వ శాఖలు అంగీకరించే లెక్కలకు ఇప్పటికే పొంతన లేదు. 2010లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 2,525 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు జాతీయ పోలీసు నేర నమోదు విభాగం (పీసీఆర్‌బీ) చెబితే, 158 మంది మాత్రమే చనిపోయి నట్టు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కేసులోనూ ఎఫ్.ఐ.ఆర్, పంచనామా, పోస్టుమార్టమ్, ఫోరెన్సిక్, ఫైనల్ రిపోర్టు వంటి అయిదు పత్రాల్ని పోలీసుల నుంచి తేవాల్సివస్తోంది. ఇంకా ప్రయి వేటు-బ్యాంకు రుణపత్రాలు, పాస్‌బుక్, డిపెండెంట్ సర్టిఫికెట్, రేషన్‌కార్డు, మూడేళ్ల పహాణి, మండల స్థాయి, డివిజన్ స్థాయి పరిశీలన కమిటీ నివేదిక... ఇలా పలు పత్రాలు సమర్పించాల్సిన ప్రక్రియ సంక్లిష్టతే ఈ వ్యత్యాసానికి కారణమౌతోంది. ఏ ఒక్క పత్రం సరిగాలేక సదరు అధికారుల్ని సంతృప్తిపరచ లేకపోయినా అది రైతు ఆత్మహత్య కాదు.
 బాధ్యత వహిస్తేనే బతుకులు నిలిచేది
 సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పెమైరుగులతో పబ్బం గడపాలనుకునే ప్రభు త్వాల వైఖరి మారాలి. అప్పుడు గాని రైతు స్థితిలో మార్పు రాదు. సమస్య శాశ్వ త పరిష్కారం కన్నా తక్షణ విరుగుడు చర్యలపై దృష్టి పెట్టే పాలకుల  దాటవేత ధోరణే తాజా దుస్థితికి కారణం. పాతికేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లాలో సర్‌సిల్క్ ఫ్యాక్టరీ లాకౌట్‌తో మూతపడింది. నెలల తరబడి జీతాలు లేని కార్మికులు ఒక్క సారిగా రొడ్డునపడ్డారు. ఏదోరకంగా ఆదుకుంటామన్న ప్రభుత్వం ఆపై ముఖం చాటేసింది. ‘అన్ని మార్గాల్లో యత్నించా. ఎక్కడా డబ్బు పుట్టలేదు. బతుకు దుర్భరంగా ఉంది. వెంటనే కొంతైనా జీతం బకాయి ఇప్పించండి, లేకుంటే ఫలానా 21వ తేదీన ఫ్యాక్టరీ గేటుముందున్న వేపచెట్టుకు నేను, నా భార్య, ఇద్ద రు పిల్లలం ఉరేసుకొని చనిపోతాం’ అని విలేకరులను పిలిచి మొరపెట్టుకు న్నాడో కార్మికుడు. ఏ ప్రభుత్వ ప్రతినిధీ చొరవ తీసుకొని ఊరడించలేదు! అను నయించే యత్నం చేయలేదు. కానీ, సరిగ్గా 20వ తేదీ రాత్రి నుంచి మాత్రం సదరు వేపచెట్టు చుట్టూ 8 మంది పోలీసులతో కాపలా పెట్టారు. ఆ రోజు కాదు గానీ, కొన్ని రోజుల వ్యవధిలో తన స్వగ్రామపు పొలిమేరల్లో చెట్టుకు ఉరేసుకొని ఆ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మన ప్రభుత్వాల పద్ధతి. ఈ వైఖరి పోవాలి. జాతీయ నమూనా సర్వే (ఎన్నెస్సెస్వో) నివేదిక, అప్పులు-పెట్టుబ డుల సర్వే (ఎ.ఐ.డి.ఐ.ఎస్) నివేదిక, జయతీఘోష్ కమిషన్ నివేదిక, ఆత్మహ త్యలపై అధ్యయనపు ప్రత్యేక (ఆశా) నివేదిక... ఇలా ఎన్ని నివేదికలైనా, చెప్పిం దొకటే! రైతు సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వాలు పట్టించుకోవ డంలేదు. పెట్టుబడి వ్యయం తగ్గేలా చూడాలి. వ్యవస్థీకృత రుణాలు పెంచాలి. రుణాల ఊబిలోంచి రైతును గట్టెక్కించాలి. మార్కెటింగ్ సదుపాయం కల్పిం చాలి. మంచి మద్దతు ధర ప్రకటించాలి. అదైనా దక్కేలాచూడాలి. స్వామినాథన్ లాంటి విశ్వసనీయత కలిగిన పెద్దమనిషి చిత్తశుద్ధితో ఎప్పుడో ఇచ్చిన నివేదిక కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే, 2004 జూన్‌లో ఆయన ప్రభుత్వం ఒక ఉత్తర్వు (జి.వో.నం:421) ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం, యాభై వేల రూపాయల వరకు రుణం తీర్చడం, పిల్లల్ని సాంఘిక సంక్షేమ బడుల్లో, వసతి గృహాల్లో చేర్చడం, ఇళ్లు ఇప్పించడం, వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం, పెన్షన్ ఇప్పించడం వంటివి అందులో ఉన్నాయి. వాటన్నింటికీ మించి ఇంకొకటి కూడా ఉంది. ‘‘దయనీయ స్థితిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది, తిండిపెట్టే పోషకుడిని పోగొట్టు కుంటున్న ఆయా కుటుంబాల దుఃఖం మాత్రమే కాదు, తన రైతును కోల్పో యిన రాష్ట్ర దుఃఖం కూడా...’ అన్న మాట సదరు ఉత్తర్వులో ఉంది. పాలకులకు ఆ మానవతా హృదయం ఇప్పుడు కావాలి.
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement