విఠల్ మృతదేహం మారుతి మృతదేహం
బోథ్ (ఆదిలాబాద్): పత్తికి సోకిన గులాబీ పురుగు ఓ గిరిజన రైతును బలిగొంది. దిగుబడి రాదనే బెంగతో మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన సెడ్మకి మారుతి(33) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి తనకున్న 3 ఎకరాల్లో గత ఏడాది పత్తి వేశాడు. పంట కోసం రూ.లక్ష అప్పు తెచ్చాడు. ఇంతలోనే పత్తికి గులాబీ పురుగు సోకి దిగిబడి అమాంతం పడిపోయింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. తెచ్చిన అప్పు మీదపడింది. ఈ ఏడాది మళ్లీ రూ.లక్ష అప్పు తెచ్చి పత్తి వేయగా తొలి దశలోనే పత్తి పువ్వులో గులాబీ పురుగు ఉధృతంగా ఉండటంతో దిగుబడిపై దిగులు చెందాడు. మొత్తం రెండు లక్షల అప్పు ఉండటంతో మనస్తాపం చెందాడు.
శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అప్పు విషయమై గ్రామ పెద్దలతో చర్చించేందుకు భార్య కవిత బయటికి వెళ్లింది. మూడేళ్ల కూతురు ధనలక్ష్మి, ఎనిమిది నెలల బాబు సోమేశ్వర్‌ల ముందే మారుతి పురుగుల మందు తాగాడు. హుటాహుటినా గ్రామస్తులు బోథ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మారుతికి భార్య, కూతుళ్లు పూజ(4), ధనలక్ష్మి(3), 8 నెలల బాబు సోమేశ్వర్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్‌బాకీ తెలిపారు.
జైనథ్ మండలంలో ఒకరు..
జైనథ్: మండలంలోని గూడ గ్రామానికి చెందిన రైతు అమ్ర విఠల్(42) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. విఠల్ తన భార్య వెంకటమ్మ, ఇద్దరు పిల్లలతో ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసం ఆదిలాబాద్‌లో ఉంటూ గూడలో తమకున్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేశాడు. శుక్రవారం ఎప్పటిలాగానే భార్యాభర్తలిద్దరు చేనుకు వెళ్లారు. కాగా ఉదయం 10గంటలకు భార్య పనులు చేస్తుండగా, విఠల్ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య పక్క చేన్లో ఉన్న భగవాండ్లు అనే రైతు సహాయంతో ఎడ్లబండిపై గూడకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఆటోలో రిమ్స్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. కాగా గిమ్మ బీవోఎం బ్యాంకులో విఠల్‌కు రూ.లక్ష అప్పు ఉంది. పత్తి పంట సరిగ్గా రాలేదని, కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేకపోవడంతో అత్మహత్యకు పాల్పడినట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment