పల్లె బతుకుపై నగదు పిడుగు | demonetization effects to farmers and village economy | Sakshi
Sakshi News home page

పల్లె బతుకుపై నగదు పిడుగు

Published Fri, Nov 25 2016 1:23 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

పల్లె బతుకుపై నగదు పిడుగు - Sakshi

పల్లె బతుకుపై నగదు పిడుగు

సమకాలీనం
పెద్ద నోట్ల రద్దు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం ఎప్పటికప్పుడు మారుతున్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి డబ్బు పోగవుతున్నా నగదు ఇవ్వలేని స్థితిలో బ్యాకులున్నాయి. లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. గ్రామీణ జన జీవనం కుంటు పడింది. ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, గ్రామాలు బాగుపడ తాయని అంటున్నారు. కానీ పరిమితంగా ఉన్న రైతాంగపు బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం వంటివి చూస్తుంటే అది అంత తేలిక కాదనిపిస్తుంది.
 
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఇప్పుడు దేశ గ్రామీణార్థిక వ్యవస్థ స్థితి. నగదు కొరత దాని నడ్డినే విరిచింది. స్థూలంగా చూస్తే తమ ప్రమేయం లేని నల్ల డబ్బును నిర్మూలించే క్రతువు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మెరుపులు లేని పిడుగులా విరుచుకు పడింది. నగదు కొరతైపై గగ్గోలు పెడుతున్నది సంఘటిత రంగమే అయినా, బాగా కుదేలయింది అసంఘటిత రంగం. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న, కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు, సేవలు తదితర రంగాలకూ చేష్టలుడిగినట్ట యింది.
 
రెండేళ్ల వరుస కరువు తర్వాత ఈ ఏడు మంచి వర్షాలు కురిసినా కూడా రైతు కంట కన్నీరుబుకుతోంది. ఖరీఫ్ పంట అమ్మితే డబ్బుల్లేవు. రబీ పంటకు పెట్టుబడి లేదు. పాలు, పళ్లు, కూరగాయలు, కోళ్ల పెంపకం, చేపలు తదితర ఆహారోత్పత్తి రంగం అప్రకటిత సెలవుతో కకావికలమైంది. దినసరి కూలీ, ఉపాధి అవకాశాలపై నేరుగా దెబ్బపడింది. నల్ల సంపదపై పోరులో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెర వేరుతుందో తెలియదు. కానీ సగటు జీవితం దుర్భరమైంది. పాత నోట్లు చెల్లకుండా, కొత్త నోట్లు అందుబాటులోకి రాక ఈ పక్షం రోజుల చేదు అను భవం వర్తమానాన్ని కష్టాల కొలిమిలో కాలుస్తోంది. భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో దాదాపు 60% జనాభా వ్యవసాయ, అను బంధ రంగాలపై ఆధారపడ్డారు.

మనది 80%కుపైగా బ్యాంకేతర సంప్ర దాయ ఆర్థిక వ్యవస్థ కావడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. నగదు కొరత సమస్యను సత్వరం పరిష్కరించకుంటే స్వల్ప, మధ్య కాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే పెను ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు హెచ్చరి స్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని, వృద్ధి మందగిస్తుందని పెట్టుబడుల సేవా సంస్థ ‘మూడీస్’ తన తాజా నివేదికలో పేర్కొంది. అదే జరిగితే, ప్రధానంగా ప్రభావితమయ్యేది మళ్లీ గ్రామీణార్థిక వ్యవస్థే అనడం నిస్సందేహం. ఈ చర్య తగు  ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం గురువారం రాత్రి వరకూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి బ్యాంకు  రికార్డుల్లో డబ్బులు పోగవుతున్నా... నగదు ఇవ్వలేని స్థితిలో అవి ఉన్నాయి. దీంతో లావాదేవీలన్నీ నిలిచిపో యాయి. మొత్తం గ్రామీణ జన జీవనమే కుంటి నడకన సాగుతోంది. కోలు కునేదెన్నడో అంతుబట్టడం లేదు.
 
కష్టం ఒక్క తీరున లేదు
ప్రపంచంలో ఏ దేశం నగదు రద్దు చర్యలు తీసుకున్నా, పకడ్బందీ ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది. కొత్త నోట్లు, చెల్లుబాటయ్యే నోట్లతో రద్దయిన నోట్లు మార్చుకునే సదుపాయం కల్పిస్తుంది. పైగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు, గతంలోని ఆయా సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను ఇంతగా కుదపక పోవడానికి కారణం రద్దయిన నోట్ల నిష్పత్తి తక్కువగా ఉండటమే! నేడు రద్దయిన నోట్లు 85% కావడంతో ప్రభావ తీవ్రత పెరిగి, అంత మేరకు  ద్రవ్య వ్యవస్థ స్తంభించినట్టయింది. గడువు తర్వాత చెల్లవనడంతో పాత నోట్లన్నీ క్రమంగా డిపాజిట్ అవుతున్నాయి. పలు పరిమితుల నడుమ పాత, కొత్త నోట్లు మార్చుకునే సదుపాయం కల్పించినా అది పెద్దగా అవసరాలు తీర్చ లేదు. కొత్త, చెల్లుబాటయ్యే నోట్లు బ్యాంకుల్లోకి రాలేదు.

దాంతో తెరిచిన ఒకటి, రెండు గంటల్లోనే డబ్బు లేదని బ్యాంకులు, ఏటీఎమ్‌లు చేతులెత్తు తున్నాయి. జరుగుబాటుకు డబ్బు దొరక్క జనం... పేద, ఎగువ, దిగువ మధ్య తరగతి వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ప్రధాని, ఆర్థిక మంత్రి చెప్పినట్టు రెండు, మూడు రోజులో, వారమో ఉంటుం దనుకున్న ఈ సమస్య పక్షం రోజులైనా తగ్గలేదు. పైగా ముదురుతోంది. ఖర్చులు బాగా తగ్గించుకొని పౌరులు సంపూర్ణ సహకారం అందిస్తున్నా... నగదు తరిగిపోతుండటంతో దినసరి వ్యవహారాలను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. వ్యాపారాలు, వ్యాపకాలు, అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ నిలిచి పోయాయి.
 
ఈ మేర ఉత్పత్తి రంగంపైన, ముఖ్యంగా నిలువ ఉండని పాలు, పూలు, కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయోత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర ఉత్పత్తులదీ ఇదే గతి! ఉపాధి అవకాశాలూ దెబ్బతింటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షలల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి వర్షాలు కురిసినా... సమయానికి ఎరువులు, విత్తనాలు కొనేందుకో, కూలీ లకిచ్చేందుకో చేతిలో డబ్బుల్లేక నానా పాట్లు పడుతున్నారు. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులకూ కష్టంగానే ఉంది. ఐదారు రోజుల్లో డిసెంబరు వస్తుంది. నెల మొదలైన తొలి వారంలో ఉండే అవసరాలకు నగదెట్ల? అంతు బట్టకుండా ఉంది. నల్లడబ్బును నలిపేసే సంగతి సరే, మా డబ్బు మేం తీసు కోలేని ఈ దురవస్థ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ వ్యవస్థీకృత, చట్టబద్ధ లూటీగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం రాజ్యసభలో అభివర్ణించారు. ‘బ్యాంకులో దాచుకున్న తమ డబ్బును ఖాతా దారులే పొందలేని దుస్థితి, ఇప్పుడిక్కడ తప్ప... ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదు’ అన్నారు.
 
ఈ పులి మీద స్వారీ....కడదాకా సాగేనా?
గమ్యం మాత్రమే కాదు, అందుకు నిర్ణయించుకున్న మార్గమూ అంతే ముఖ్యమని గాంధీజీ ఊరకే అనలేదు. కుటుంబ నియంత్రణను అందరూ సమర్థిస్తారు. కానీ, ఎమర్జెన్సీ కాలంలో దాన్ని అమలుపరచిన తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నేటి ‘నల్ల ధనంపై పోరు’ను అమలుచేస్తున్న తీరు కూడా అలాంటిదే! ప్రజల కష్టాలు చూసి దీన్ని విమర్శించిన వారిపై మొదట్లో ఒంటి కాలిపై లేచిన ‘అధికారిక దేశభక్తులు’ సైతం సామాజిక మాధ్యమాల నుంచి మెల్లగా తోక ముడుస్తున్నారు. నిర్వహణ వైఫల్యాల వేడి తమకూ తాకేసరికి కాస్త మెత్తబడ్డారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో నోట్ల రద్దు అనుకూల పోస్టింగ్‌లు తగ్గాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండు విపక్షాల నుంచి, పౌర సమాజం నుంచి పెరుగుతోంది. నగదు అందుబాటు ప్రక్రియను వేగవంతం చేసి, తక్షణమే నగదు కొరతను తీర్చ కపోతే అన్ని రంగాల్లో అశాంతికి దారి తీస్తుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఫలితం, ఆర్థిక వ్యవస్థ మందగించడమే కాదు, దీర్ఘకాలికంగా ఇది దేశ ఆర్థిక, రాజకీయ భవితవ్యాన్నే శాసిస్తుంది.

బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని చేసిన ప్రసంగాన్ని బట్టి దేశంలో నల్లసంపదను తొలగించే సుదీర్ఘ ప్రక్రియలో పెద్ద నోట్ల రద్దు ఆరంభం మాత్రమే! గొలుసు కట్టు చర్యలుంటాయని సంకేలించారు. ప్రస్తుతానికి బంగారం క్రయ, విక్రయాలపై నిఘా, హవాలా నియంత్రణ, బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్‌ల అదుపు, సమగ్ర పన్ను వసూళ్లు, అధికార అవినీతి నిర్మూలన. రాజకీయ-ఎన్నికల సంస్కరణల అమలు ఈ క్రమంలో రావాల్సిన తదుపరి చర్యలు. నల్లధనంపై తమ చర్యలకు 90% ప్రజల మద్దతుందని ప్రధాని పేర్కొనడంపై బయటి వారి సంగతెలా ఉన్నా, స్వపక్షీయులే కొందరు సందేహాలు వ్యక్తం చేస్తు న్నారు. ప్రధాని ‘యాప్’కు వచ్చిన ప్రజాభిప్రాయాన్ని ఆయన కార్యాలయం ఎలాగైనా చెప్పుకోవచ్చన్నది ఈ సందేహం వెనుక సహేతుకత! ‘80% తాగు బోతులున్న రాష్ట్రంలోనూ, తాగుడు గురించి జనాభిప్రాయ సేకరణ చేయండి, తాగడం మంచిది కాదనే అభిప్రాయమే వస్తుంది’ అని ఓ సామాజిక విశ్లేషకుడు చెప్పిన మాట ఇందుకు సరిపోతుంది.

ఎమర్జెన్సీ కాలంలోనూ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అత్యధిక దేశ ప్రజలు అభిప్రాయ పడుతున్నట్టు నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అధికారిక సర్వేలు అందాయి. నల్ల డబ్బును లేకుండా చేస్తామంటే ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఆ అంశంపై తీసుకున్న విధాన నిర్ణయం అమలులోని నిర్వహణా లోపాలు, వైఫల్యాలు పౌరులను సుదీర్ఘంగా కష్టపెడితే వారు సహించరనేది చరిత్ర చెప్పిన సత్యం. వారి అభిప్రాయం అందుకు సరిగ్గా వ్యతిరేకంగా మారే ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే, ఈ సమస్య ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించి, వృద్ధి రేటును మందగిపజేయడంతోనే ఆగదు. ఏడాదిలో జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్ని కల్లో పాలకపక్షం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. అది నల్ల సంపదపై యుద్ధానికి భవిష్యత్తులో తలపెట్టనున్నామంటున్న ఆరంచెల సంస్కరణల అమలూ ఎన్డీఏ ప్రభుత్వానికి  కష్టమౌతుంది.
 
నిబద్ధత చూపకుంటే... ఆచరణపై అనుమానాలు
ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, వడ్డీరేట్లు- ద్రవ్యోల్బణం తగ్గి గ్రామాలు బాగుపడతాయని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ, రైతాంగపు పరిమితమైన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, నగదు రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు సాగించే కుటుంబాల నిష్పత్తి... ఇవన్నీ చూస్తుంటే లక్ష్య సాధన అంత తేలిక కాదనిపిస్తుంది. ఆర్థిక సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేపట్టినా మార్పు లకు సమయం పడుతుంది. నగదు రహిత బ్యాంకింగ్ పద్ధతుల్ని ప్రోత్స హించడాన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించాయి. ‘మీరు రక్తం చిందించండి, నేను మీకు స్వాతంత్య్రం సాధించిపెడ్తాను’ అని సుభాష్ చంద్రబోస్ అన్నట్టు... ‘50 రోజులు కష్టాలు భరించండి, మీకు అవినీతి రహిత భారత్‌ను అందిస్తాను’ అని ప్రధాని అన్నారు. దీంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు బాగా పెరిగాయి. కానీ, జరుగుతున్న పరిణామాలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో, నగదు మార్పిళ్లలో జరుగుతున్న అవకతవకలే అందుకు నిదర్శనం. ఆర్బీఐ నుంచి బ్యాంకుల దాకా చాలా తప్పుడు వ్యవహారాలు నిరాటంకంగా సాగుతు న్నాయి. కోట్ల రూపాయల కొత్త నోట్లు దారి మళ్లుతున్నాయి. లైన్లలో గంటలు, రోజుల తరబడి నిరీక్షించిన వారిని ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరి స్తున్నాయి. పలుకుబడి కలిగిన, కమిషన్ శాతాలు చెల్లించగలిగిన వారి నోట్ల కట్టలే అక్రమంగా మారుతున్నాయి. అక్కడక్కడ కేసులు కూడా నమోదవు తున్నాయి. 10, 20, 30 శాతం కమీషన్‌తో పాత-కొత్త నోట్ల మార్పిళ్ల మార్కెట్ రహస్యంగా సాగుతూనే ఉంది.
 
వీటిని అడ్డుకొని కొత్త విశ్వాసాన్ని కలిగించాలి. ప్రభుత్వం కుహనా ప్రతిష్టకు పాకులాడక విపక్షాల విమర్శల్ని నిర్మాణాత్మక సూచనలుగా తీసు కోవాలి. ఈ పరిణామాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలి. లోపాలు సరిదిద్ది పౌరుల కష్టాలు తొలగించడానికి, భవిష్యత్ విధానాల రూపకల్పనకు నేతలు, నిపుణులు, మేధావులతో కమిటీ వేయాలి. చిత్తశుద్ధితో కృషి చేసి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలే తప్ప, పొదుపు ముసుగు కప్పి నిర్బంధపు వ్యయ పరిమితులు విధించడం సరికాదు. ఇదే ప్రజల ‘వ్యయ సంస్కృతి మార్పు’ అని గప్పాలు కొట్టడం సమంజసం కాదు. బాపూజీ అన్నట్టు ‘భారతదేశం గ్రామాల్లో ఉన్నద’ని గ్రహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బతికించాలే తప్ప చంపరాదు.


దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement