సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాలకులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందు లేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారిపోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకుమించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఈ పద్ధతి మారాలి.ౖ రెతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. రైతుకు దయనీయ స్థితి రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి.
ప్రకృతి ఒడిలో, పంచభూతాల సాక్షిగా రైతు నిరంతరం ఆశనే శ్వాసిస్తుంటాడు. అందులో నెరవేరేవి కొన్ని, నీరుగారి నీరసింపజేసేవి కొన్ని! కోటి ఆశలతో భారత రైతాంగం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భమిది! గత కొన్నేళ్లుగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఎడతెరిపి లేని సమస్యలకు శీర్షంలా... ఆటుపోట్లను చవిచూపిన 2021 నేటితో ముగు స్తోంది. ఆశలు కల్పిస్తూ 2022 ఆహ్వానిస్తోంది. దేశానికి వెన్నెముక, తిండిపెట్టేవాడు రైతే. జనాభాలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం వ్యవసాయం. సమస్త జనాభాకు ఆహారాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ఠిని, పారిశ్రామిక రంగానికి ముడి సరుకుని, తగు విదేశీ మారకాన్నీ అందిస్తున్న కీలక వ్యవసాయ రంగం... పలు కారణాలతో నేడు కుదేలైంది. (చదవండి: ఆధార్‌తో శర (అను) సంధానం)
భూతాపోన్నతి వల్ల ‘వాతావరణ మార్పు’ ప్రమాదమై ముంచుకొస్తున్న ప్రకృతి వైపరీత్య తీవ్రత, ఉన్న సమస్యకు తోడైంది. పెట్టుబడి వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, ఆదాయం రమారమి పడిపోయి, పిల్లల విద్య– వైద్యం–పెళ్లిల్లు వంటి వ్యయభారాలతో క్రుంగి, రైతు కుటుంబాలు ప్రత్యామ్నాయ జీవనోపాధుల వైపు చూసే దుర్దశ! ఎన్ని చేసినా ఆగని రైతు ఆత్మహత్యలు, బలవన్మరణాలు! వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఎక్కడో తప్ప... ఎన్నికల ముందరి హామీలకు అంతిమంగా సాధించే ఫలితాలకు పొంతన ఉండటం లేదు. సమగ్ర వ్యవసాయ విధాన లోపం ఒకటైతే, ఉన్నవి సవ్యంగా అమలు కాని దురవస్థ మరొకటి! అన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొని తృణమో, పణమో పండించినా, చేతికి వచ్చిన పంటకు ధర రాక రైతు నెత్తికి చేతులు పెట్టే దైన్యం! ప్రపంచ వాణిజ్య ఒప్పందాల నీడలో... శాస్త్ర సాంకేతిక బదలాయింపును మించి, కార్పొరేట్ దోపిడి పెరిగి రైతు నడ్డి విరుగుతోంది. ప్రజాస్వామ్యమే అయినా. నిలదీసి రైతులు వ్యవ సాయ అనుకూల విధానాలను సాధించుకోలేకపోతున్నారు. పైగా ప్రతికూల విధానాల్ని ఎదురించి పోరాటాలే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో నిరసన తెలిపినందుకే, విచ్ఛిన్న శక్తులని, దేశద్రోహులని, నక్సలైట్లని, ఉగ్రవాదులని అపవాదు మోయాల్సి వస్తోంది. ఇదీ నేటి వ్యవసాయ భారతావని! అడుగడుగున సవాళ్లు, అదే మోతాదులో అవకాశాలూ ఉన్నాయి. అమలుకు చిత్తశుద్ది ఉండాలి!
రాబడి పెంచాలి...
రైతు రాబడి రెట్టింపు చేస్తామన్నది ఎన్నికల హామీ! ఆ దిశలో నిర్దిష్ట చర్యలే లేవు. పైగా, అసమగ్ర విధానాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల మరింత దిగజారిన పరిస్థితి! ‘నువ్వు కారణమం’టే, ‘కాదు నువ్వు’ అనే కాట్లాటల్లో నలుగుతున్న లేగదూడ రైతాంగం. గిట్టుబాటు ధర గణించడమే అశాస్త్రీయం! ప్రకటించింది కూడా లభించక, కడకు ధాన్యం కొనే దిక్కే లేక... కల్లాల్లోనే రైతులు కాలం చేయటం, మార్కెట్ ముంగిట ధాన్యరాశుల మీద రైతు అసువులు బాయటమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం! అర్థ శతాబ్ది కిందటి ‘హరిత విప్లవం’ అధిక ఉత్పత్తి సాధించిందన్న మాటే గాని, మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసింది. కట్టడి లేని ‘వ్యవసాయ రసాయనీకరణ, విత్తన సంకరీకరణ’ స్థూలంగా దేశ వ్యవసాయ ప్రక్రియపైనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. విత్తనాల నుంచి, విష రసాయన ఎరువులు, ప్రమాదకర క్రిమిసంహారకాలు పెట్టుబడి వ్యయాన్ని అసాధారణం చేశాయి. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిందే కానీ...)
మద్దతు ధర సంగతి మరచి పోయినా, కనీస గిట్టుబాటు ధర కూడా లభించక రైతాంగం ఆర్థికంగా అతలాకుతలమౌతోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తగినన్ని అప్పులు దొరక్క అధిక వడ్డీకి ప్రయివేటు రంగంలో తెచ్చే అప్పుల ఊబీ, రైతును లోనికి లాక్కొని తుదముట్టిస్తోంది. ఉత్పత్తుల్ని మార్కెట్‌కు తీసుకువెళితే నిలువ చేసే వసతి, శీతల గిడ్డంగులు, మద్దతు ధర ఇప్పించే వ్యవస్థలు లేక రైతు ఆల్లాడుతున్నాడు. కొనుగోళ్లకు భరోసా ఇచ్చే మార్కెట్ వ్యవస్థ లేదు. రైతు రాబడి పెంచాలంటే, నిర్దిష్ట చర్యలతో ఆస్కారముంది. రసాయన ఎరువులు–క్రిమిసంహారకాలు– కలుపు నివారకాల్ని వదిలేసి, సహజ–సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. క్రమంగా భూసారాన్ని మెరుగు చేసి దిగుబడి పెంచుకోవాలి. పంటకు తగిన ధర లభించేలా చూడాలి. ఇప్పుడున్నట్టు కాక, పూర్తి భిన్నంగా.... పెట్టుబడి ముడిసరుకును టోకు ధరలకు రైతు కొనేలా, తన పంటను చిల్లర ధరకు విక్రయించేలా రైతులో, రైతు సంఘాలో, సహకార వ్యవస్థలో చూసుకుంటే వ్యవసాయ రాబడి పెరుగుతుంది. (చదవండి: నవచరిత్రగా... రైతు విజయగాథ)
సర్కార్ల సమన్వయం కీలకం
వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని రాజ్యాంగం చెబుతోంది. కానీ, వ్యవసాయ ప్రక్రియను ప్రభావితం చేసే చాలా అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాతో లంకెగల కొన్ని అంశాల ఆసరాతో, కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేసే సందర్భాలూ ఉంటాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని రాష్ట్రాలు విమర్శిస్తుంటాయి. మొన్న అమలై–రదై్దన మూడు వ్యవసాయ చట్టాలు అలాంటివే! అందుకే, మొత్తంగా ఆ చట్టాలు రద్దవడానికి ముందే, పలు రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకొని, సదరు కేంద్ర చట్టాల ప్రభావం లేకుండా చేశాయి. దేశం నైసర్గికంగా, వాతావరణపరంగా పలు వ్యవ సాయ జోన్లుగా విడిపోయి ఉన్నందున, ఎక్కడికక్కడి ప్రాధాన్యతలు, పరిస్థితుల్ని బట్టి రాష్ట్రాల వారిగా వ్యవసాయ విధానాల అమలే మంచిది! అయితే, మార్కెటింగ్, ఆహార సరఫరా–పంపిణి, దిగు మతి–ఎగుమతులు, ఆహారభద్రత, పౌరసరఫరాలు–ప్రజా పంపిణీ వంటి పలు ప్రభావక అంశాల దృష్ట్యా ‘వ్యవసాయ జాతీయ స్థూల విధానం’ఉండాలంటారు. వ్యవహారకర్తలుగా రాష్ట్రాలుండి, సదరు విధానాన్ని సమన్వయపరిచి, సౌకర్యాలు కల్పిస్తూ కేంద్రం మద్దతి వ్వాలని ‘భారత రైతు సంఘాల పరిషత్’ (సిఫా) అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన పరిషత్ పలు అంశాలు చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. (చదవండి: రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం)
ఒకటికొకటి విరుద్ధం కాదు... తోడవ్వాలి!
సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాల కులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందులేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారి పోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకు మించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. లోపభూయిష్ట ఆహార పంపిణీ వ్యవస్థ వల్ల... ఒక ఊళ్లో పండే పంటను నేరుగా అక్కడి వినియోగదారులు కొని, తినే పరిస్థితి ఉండదు. గ్రామం నుంచి టౌన్, అక్కడ్నుంచి రాజధాని, తిరిగి టోకు వ్యాపారుల ద్వారా టౌన్‌కు, చిల్లర వర్తకుల ద్వారా అదే గ్రామానికి, రెట్టింపు ధరతో వచ్చినపుడు ఆ గ్రామస్తులు కొంటుంటారు.
ఈ పద్దతి మారాలి. ఎక్కడికక్కడ ఆహార సరఫరా విధానాన్ని అనుసరిస్తే, పలు ప్రయోజనాలు! నేల చదును, విత్తన శుద్ధి నుంచి ఆహార వినియోగం వరకు రైతుకు కొంత సంప్రదాయిక పరిజ్ఞానం ఉంటుంది. సదరు జ్ఞానానికి ఆధునిక శాస్త్ర–సాంకేతికత తోడైతే అద్భుతమైన ఫలితాలుం టాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగమైనపుడు... మన వ్యవ సాయోత్పత్తుల నాణ్యత–ఆమోదం పెంచుకోవడం, అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం, ఎగుమతుల వృద్ధి ముఖ్యం! రైతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. విశ్వనరుడు గుర్రం జాషువా అన్నట్టు, ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/సస్యరమ పండి పులకించ సంశయించు/ వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు/భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు’ (గబ్బిలం) అన్న దయనీయ స్థితి రైతుకు రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి.
- దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment