అయినా.. మనిషి మార(టం) లేదు!
సమకాలీనం
ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్రతీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక.
'పారిస్‌పై దాడి జరిపిన ఉగ్రవాదుల తుపాకీ చప్పుళ్లు వినిపించినంతగా... ఉపద్రవంలో క్షతగాత్రులైనవారి మౌనరోదనలు మనలో ప్రతిధ్వనించ లేదు... వాతావరణ మార్పు దుష్పరిణామాల గురించి ఆందోళన చెందు తున్న గొంతుల తీవ్రతను పరిగణనలోకి తీసుకోవడంలో ఇక ఏ మాత్రం ఆలస్యం కూడదు' అని పారిస్‌లోనే జరుగుతున్న పర్యావరణ సదస్సుకు, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ సందేశమిచ్చారు. పాల్గొన్న 150కి పైగా దేశాల ప్రతినిధుల్లో ఎందరు ఈ సూక్ష్మార్థాన్ని గ్రహించారో కాని, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై ఇందుకు ఓ పాఠమే. వాతావరణ మార్పుల ఫలితంగా అకాల, అసాధారణ వర్షాలకు మనం, మన పాలకుల రూపంలో మానవ తప్పిదం తోడైంది. భళ్లున వర్షం కురిసినట్టే, చెన్నై రోదన మిన్నంటింది. తక్షణ సహాయం అందించడానికి కూడా వీల్లేనంత అతలాకుతలమైంది. ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్ర తీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక. కష్టాల్లో ఉన్న సాటివారిని ఆదుకునేందుకు చూపుతున్న మానవత్వంలో నాలుగో వంతు శ్రద్ధయినా ముందు జాగ్రత్తల విషయంలో తీసుకుంటే ఇలాంటి ఉపద్రవాల్ని అరికట్టడం, లేదా తీవ్రత తగ్గించడం చేయవచ్చని నిపుణులు అభిప్రాయం.
హెచ్చరికల్ని బేఖాతరన్నందుకే!
వాతావరణ విభాగం లెక్కల ప్రకారం చెన్నై తీవ్ర వరద ప్రమాద ప్రాంత మేమీ కాదు. తూర్పున బంగాళాఖాతమున్న ఈ నగరం సగటు సముద్ర మట్టానికి అయిదారు మీటర్ల ఎత్తునుంది. కానీ, చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కనీస సముద్ర మట్టం కన్నా 27 అంగుళాల ఎత్తులోనే ఉన్నాయి! ఇక్కడ డ్రైనేజీ నిర్వహణ కొంత కష్టం. చెన్నైలో తరచూ అక్టోబర్-డిసెంబర్ లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 1200 మి.మీ నుంచి 1300 మి.మీ సగటు వర్షపాతం కురిసేది, క్రమంగా పెరుగుతోంది. అల్పపీడనం, తుపానుల వల్ల 1976, 1985, 1996, 1998, 2005, 2008, 2010లో, మళ్లీ ఇప్పుడు కుంభవృష్టి కురిసి భారీ నష్టం సంభవించింది. 1901 తర్వాత, అంటే 114 సంవత్సరాల్లో నమోదైన అతి పెద్ద వర్షపాతం ఇదే. గత అనుభ వాల దృష్ట్యా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడటానికి, ముందు జాగ్రత్త చర్యలకు అవకాశమున్నా పాలకులు నిర్లక్ష్యం చేశారు. చెరువులు-కుంటల పరిరక్షణలో, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో, ఘనవ్యర్థాల్ని నగరం బయటకు తరలించ డంలో విఫలమయ్యారు. స్పృహ కొరవడ్డ పౌరుల సహకారం కూడా అంతంతే! స్థానిక విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్కిటెక్ట్ కె.లావణ్య జరిపిన అధ్యయనంలో చాలా విషయాలు వెలుగు చూశాయి. చెన్నైలో ఒకప్పుడు 650 చెరువులుండేవి. ఇప్పుడు 40కి లోపే మిగిలాయి. చిత్తడి ప్రాంతాలన్నింటా నిర్మాణాలొచ్చాయి. నగరంలో ప్రవహించే మూడు నదులు కుపుం, అడ యార్, కోనసత్తలయార్ పరీవాహక ప్రాంతాలన్నీ అక్రమణలకు గురయ్యా యి. నగరం నుంచి వచ్చే వాననీటిని గ్రహిస్తూ ప్రవహించే బకింగ్‌హామ్ కాలువ దాదాపు మూసుకుపోయింది. అక్కడక్కడ మిగిలిపోయిన కుంటలు, బహిరంగ లోతట్టు ప్రాంతాల్లో చెత్త, చెదారం వేస్తూ ఘనవ్యర్థాలతో నింపు తున్నారు. దేశంలో మరే నగరంలో లేనంత అత్యధిక తలసరి ఘన వ్యర్థాల్ని (0.6 కి.గ్రా/రోజు) ఉత్పత్తి చేస్తున్న నగరమిది.
హై'డర్'బాదూ సురక్షితమేం కాదు!
నిన్నటి చెన్నై వర్షం మన చారిత్రక హైదరాబాద్ నగరంలో కురిస్తే... అన్న ఊహ చాలా మందిని గగుర్పాటుకు గురిచేసింది. 2000 సంవత్సరంలో భారీ వర్షం జంటనగరాలను అతలాకుతలం చేసింది. నగరం నడిమధ్యన ప్రవ హించే మూసీ పోటెత్తింది. నాటి వర్షం దాదాపు 20 సెంటీ మీటర్లే! నిన్నటి వర్షం ఏకంగా 49 సెంటీ మీటర్లు! మన నగరంలో తాగునీటి సరఫరా- మురుగునీటి వ్యవస్థకు కాలం చెల్లింది. దురాక్రమణల వల్ల చెరువులు- కుంటలు కనుమరుగయ్యాయి. ఆదర్శ ప్రణాళిక అటకెక్కి, ముందు చూపు కొరవడటంతో చిన్నపాటి వర్షానికే మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు నూరేళ్ల కింద మూసీ వరదల్ని నియంత్రించడం, నగర తాగునీటి అవసరాలు తీర్చడం, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం విశ్వ విఖ్యాత ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేశారు. నియంత నిజాం రాజైనా కొంత అమలు చేశాడు కానీ, ప్రజాస్వామ్య పాలకులై ఉండీ, దీన్ని దశలవారీగా అమలుచేయడంలో గ్రేటర్ విభాగాలు దారుణంగా విఫలమౌతున్నాయి. నగర జనాభా నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నపుడు నిజాం వినతి మేరకు విశ్వేశ్వరయ్య పూనిక వహిం చారు. ఇప్పుడు... గ్రేటర్ జనాభా 80 లక్షలకు చేరువైంది. గృహసముదాయాలు సుమారు 20 లక్షలున్నాయి. 35 లక్షల మందికి మురుగు కష్టాలు నిత్యనరకం చూపుతున్నాయి. నగరంలోకి తాగునీరు తెప్పించేందుకు చేసే కృషిలో నాలుగో వంతు కూడా వాడిన నీటిని బయటికి పంపడంపై పాల కులకు శ్రద్ద లేదు. రోజువారీగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు రెండువేల మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమౌతోంది. ఇది సాఫీగా వె ళ్లేందుకు కనీసం 4500 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరం. అందుబాటులో ఉన్నది 3,000 కిలోమీటర్లే.
మేల్కొంటేనే సరైన నిద్ర!
ఒక్క చెన్నై, హైదరాబాద్ ఘోష కాదిది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగ రాల పరిస్థితీ ఇదే! మేఘాలావర్తించి వర్షం మొదలైతే.... నగరాల వాసు లకిక నిద్రలేని రాత్రులే! కలకత్తాకూ లోగడ కష్టాలు తప్పలేదు. 2005 నాటి వర్షాలకు ముంబై ముద్దయింది. 24 గంటల్లో కురిసిన 944 మి.మీ వర్షం, పొంగి ప్రవహించిన మురుగునీటితో కలిసి నగరాన్ని ముంచెత్తింది. కృష్ణా తీరంలో ఇప్పుడు నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికను కాదని జరుపుతున్న నిర్మాణమని మరచిపోవద్దు. వందేళ్ల చరిత్ర సృష్టించిన వర్షం తమిళనాడులో కురిస్తే... పక్క తెలుగు రాష్ట్రాల్లో జీవనదులు, కృష్ణా-గోదావరి నూరేళ్లలో లేనంత ఎండిపోయి తీర నగరాలు-పట్టణాల్ని దప్పికతో అల్లాడిస్తు న్నాయి. నగరాలు నాగరికత చిహ్నాలంటారు. అది అవునో... కాదో? కానీ, నరకానికి నకళ్లు మాత్రం కాకూడదు.
వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ మెయిల్: dileepreddy@sakshi.com