జనం దృష్టిలో తనే దోషి! | Dileep Reddy Writes Guest Coloumn About Local Body Elections | Sakshi
Sakshi News home page

జనం దృష్టిలో తనే దోషి!

Published Fri, Mar 20 2020 12:52 AM | Last Updated on Fri, Mar 20 2020 12:56 AM

Dileep Reddy Writes Guest Coloumn About Local Body Elections - Sakshi

ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానమే పాల నను నిర్ధారించే గీటురాయి. మాయదారి ఎత్తు గడలు, చౌకబారు వ్యూహాలతో తాత్కాలిక గెలుపు సంబరం సాధ్యమేమో కాని, అవే తుది విజయాలు కాజాలవు. పైగా పరాభవాలు తప్పవు! ఇది చరిత్ర చెప్పిన సత్యం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలే నట్టే... కుట్రపూరిత ఎత్తుగడలతో ప్రజాహిత సత్కార్యాన్ని నిలువరించలేమన్నది రాజకీయ నేతలు గ్రహించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విపక్షనేత చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన పాఠమిది. శాశ్వతంగా, చివరకు తాత్కాలికంగానైనా ప్రజా ప్రయోజనాలకు అడ్డు తగలడం రాజకీయాల్లో ఆత్మహత్యా సదృశం! 1999 ఎన్నికలప్పుడు ‘దీపం’ పథకం విషయంలో కాంగ్రెస్‌ చేసిన వ్యూహపరమైన తప్పిదానికి ‘లబ్దిదారు’ అయిన చంద్ర బాబుకీ విషయం బాగా తెలుసు.

బడుగులకు రాజకీయ సాధికారత, గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపన, పాతిక లక్షలకు పైబడ్డ కుటుంబాలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టివ్వడం... ఇలా బహువిధ కార్యాచ రణ మొగ్గతొడిగి ఏపీలో ఇప్పుడిపుడే ప్రగతి రూపుదిద్దుకుంటోంది. అసాధారణ పథకాలతో దేశానికే ఏపీ దిక్సూచి అయ్యే సందర్బాన్ని దిగ్విజయంగా అడ్డుకున్నామనే సంబరం కొన్ని రాజకీయ పక్షాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ దుర్యోచన మేళానికి చంద్రబాబు కేంద్ర బిందువు! వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబం ధించి... వాతావరణం ఎలా ఉండింది, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చేసిందేమిటి, సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది, చివరకు ఏం జరుగుతోందన్నది తెలుగు ప్రజలు గమనిస్తున్నారు. 

కరోనా వ్యాధి నివారణ కోసమే ఎన్నికల వాయిదా ఆశిస్తే, చంద్ర బాబు ఆయన పరివారం చంకలు గుద్దుకొని సంబరపడాల్సిందేమీ లేదు! రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించి కరోనా మహమ్మారి పెనుముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు గంభీరంగా నిలబడాల్సిన సమయమిది. కానీ, అందుకు భిన్నంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. తాము ఆశించినట్టే ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఇది పాలకపక్షానికి ‘షాక్‌’ అని తెగ సంబరపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల సత్వర అమలును, కేంద్రం నుంచి నిధుల రాకను వాయిదా వేస్తున్నామన్న వాస్తవాన్ని సదరు శక్తులు గ్రహిం చడం లేదు. వారి చర్య, ప్రస్తుత ప్రగతి రథానికి ఒక స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదే!  నిజానికి, ఈ పరిణామాన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే... రాజకీయంగా తామెదుర్కోబోయే ఘోర పరాజయ పరాభవాన్ని ఓ ఆరు వారాలు వాయిదా వేసుకోవడమే తప్ప బాబు–బృందం సాధించేది ఏమీ ఉండదు. ఇది క్షేత్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి! శాసనసభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇటువంటి వాస్తవాలనెన్నింటినో గ్రహించని చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారు. రాజకీయంగా ఓ పతనం నుంచి మరో పతనానికి జారిపోతున్నారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తన రాజకీయ శవపేటికపై తానే చివరి మేకు దిగ్గొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టు మేధావి వర్గం విశ్లేషిస్తోంది.

రాష్టం ఎంతో నష్టపోయింది...
స్థానిక స్వపరిపాలనపై బాబుకు సదభిప్రాయం లేదని గడచిన పాతి కేళ్ల రాజకీయ చరిత్ర చెబుతోంది. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా ఉంటే, తన హయాంలో స్థానిక సంస్థలకు ఒకే మారు (2001) ఎన్నికలు జరిపించారు. మిగతా అన్ని మార్లూ వాయిదాలే! పైగా రాజ్యాంగ లక్ష్యానికి, రాజీవ్‌గాంధీ హయాంలో జరిపించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం నుంచి స్థానిక సంస్థలకు అధికారాలు, నిధుల బదలాయింపులకు ఆయనెప్పుడూ విముఖమే! అందుకే, ఏనాడూ ఈ బదలాయింపులకు ముందుకు రాలేదు. బాబు హయాం ముగిసి డా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే సదరు బదలా యింపులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత తాను తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగక ఆర్థికంగా రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2018 లో, ఎంపీపీ, జడ్పీలకు ఎన్నికలు 2019 లోనే జరిగి ఉండాల్సింది. ఈ జాప్యం వల్ల పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావాల్సినంత రాలేదు. పదిహేనో ఆర్థిక సంఘం నిధులూ దక్కని ప్రమాదానికి పరిస్థితిని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్లుగా దాదాపు అయిదువేలకోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయి. ఇంకా జాప్యం జరిగితే, మరో రెండు వేల కోట్లకూ ఇబ్బందే! తన స్వీయ అనుభవంతో  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నట్టు, తర్వాత కూడా ఆ నిధులు రాబట్టుకోవచ్చనేది నిజమే కావచ్చు! కానీ, సర ళంగా నిధులు వచ్చే అవకాశాన్ని చేజార్చుకొని, ప్రత్యేక వినతులతో కేంద్రం వద్ద పడిగాపులు గాచే పరిస్థితి అంత గొప్పదేం కాదు. వచ్చి తీరుతాయన్న నమ్మకం కూడా లేదు. అదే నిజమైతే, పద్నాలుగో ఆర్థిక సంఘం రెండో విడత రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఎందుకు రాలేదు? న్యాయస్థానం లోగడ నిర్దేశించినట్టు ఎన్ని కల ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి తాజా పరిణామాలతో గండి పడింది.

తేటతెల్లమైన దురుద్దేశాలు
వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్‌ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. సంప్రదించకుండానే ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని తప్పబట్టింది. అమల్లో ఉంటుందన్న ఎన్నికల నియమావళి (కోడ్‌)ని రద్దు చేయాలనీ నిర్దేశించింది. కోడ్‌ కొనసాగించడంలో హేతుబద్ధత ఏమిటన్న న్యాయ స్థానం ప్రశ్నకు ఎస్‌ఈసీ వద్దగాని, విపక్షం దగ్గర గానీ సమాధానమే లేదు. రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎన్నికల ముందు అడ్డుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ తలంపు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఆశించిన పౌర సదుపాయాలు కల్పించ కూడదనేది వారి ఆశ! అందుకనుగుణంగానే, రాష్ట్రంలో కొనసాగు తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగించేలా ఎస్‌ఈసీ వ్యవహరించిందనేది పాలకపక్షం అభియోగం.

ఎన్నికల నియమావళిలో చెప్పి, ప్రభుత్వం ఏర్పడగానే పథకం రచించి, నిధులు కేటాయించి, భూసేకరణ జరిపి, లబ్దిదారుల్ని గుర్తించి, ఉగాదికి ముహూర్తం ఖరారు చేసిన ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను ఈసీ నిలిపివేయమనడమే ఆశ్చర్యకరం. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నియ మావళిని కొనసాగించడం సదరు దురుద్దేశాన్ని రుజువుపరిచింది. సర్వోన్నత న్యాయస్థానం కోడ్‌ అమలు వద్దంది. తదుపరి షెడ్యూల్‌ ఖరారైనపుడే కోడ్‌ అమల్లోకి తేవాలని నిర్దేశించింది. ఫలితంగా, ఇప్పుడు పాతిక లక్షల కుటుంబాల్లో సంతోషం ఉగాది ఉషస్సుగా మారనుంది. సొంతంగా స్థలాలున్న వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, లేని వారికి ఇప్పుడు స్థలాలు ఇచ్చి, రానున్న నాలుగేళ్లలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఈ పథకం సమగ్ర స్వరూపం. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలుంటే, సుమారు 30 లక్షల కుటుం బాలకు సొంతిళ్లు లేవని, దేశంలో మరెక్కడా లేని విధంగా వారందరికీ (సంపూర్ణ/సంతృప్తికర స్థాయి) ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి విఘ్నం తొలగినట్టే! అందుకే, ఎటూ పాలుపోని విపక్షం ఇప్పుడొక కొత్త ‘లేఖా ప్రహసనా’నికి తెరలేపింది. రాజ్యాంగ, రాజకీయ, ఆశ్రిత మీడియా వ్యవస్థల నడుమ అదొక అంతర్నాటక మని తేలిపోతోంది.

ఉనికికి ప్రమాదమనే!
పంచాయతీ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలంటూ సమాంతర రాజ్యాంగేతర వ్యవస్థల్ని నడిపిన వారికి నిజంగానే కష్ట కాలమొచ్చింది. ఇప్పుడు పాలకపక్షం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి తెచ్చింది. అన్ని పౌర సదు పాయాలు ఊళ్లోనో, వార్డులోనో దొరుకుతున్నాయి. కుల ధ్రువీకరణ నుంచి భూ యాజమాన్య హక్కుల వరకు, బర్త్‌ సర్టిఫికేట్‌ నుంచి వైద్య సదుపాయాల వరకు అన్నీ ముంగిట్లోనే లభించే వ్యవస్థ నెలకొంది. ఇవన్నీ కూడా ప్రజలతో ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్ల నియంత్రణ లోనే జరుగుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని పౌరులకు లేదు.

పైరవీ కారుల్ని ప్రాధే యపడే అవసరం రాదు. అధికారులకు లంచాలివ్వాల్సిన దురవస్థ అంతకన్నా తలెత్తదు. చనువున్న పాకలపక్ష నాయకులే కొందరు ముఖ్యమంత్రి వద్ద సనుక్కుంటున్నారు. ‘అన్నా... ప్రజలు మా వైపు చూడట్లేదు, వారికి ఎక్కడికక్కడే అన్ని పనులూ జరిగిపోతున్నాయి’ అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా చట్టాలు చేయడం, విధానాలు రూపొందించడం, వాటి అమలు కృషి వంటి రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి  నాయకులకు ఏర్పడింది. ప్రజలు హర్షిస్తు న్నారు. విపక్షాలకిది గిట్టినట్టు లేదు. ఈ వ్యవస్థ ఇంతే సజావుగా సాగితే, ఇక తమ రాజకీయ ఉనికికే ప్రమాదమన్న భయం పట్టుకున్న ట్టుంది. లేకుంటే, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు.

ప్రజలు అంతా గ్రహిస్తున్నారు
నూరు వేటల్ని తిన్న రాబందు ఒక్క గాలివానతో కూలిందని సామెత! చిన్న చిన్న ఈదురు గాలుల్లో తప్పించుకున్నా... పెద్ద గాలివానలో నేల కూలడం ఖాయం. గత ఎన్నికల్లో  వెల్లువలా వచ్చిన ప్రజాతీర్పును కూడా మన్నించకుండా, అన్నిసార్లూ తమ కుయుక్తులే ఫలిస్తాయను కోవడం రాజకీయ అవివేకం! వాయిదాలు తాత్కాలిక తృప్తినిస్తా యేమో గాని తుది విజయాల్ని అందించవు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామమే గుండెకాయ. సదరు గ్రామ పరిపాలన రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య పంథాలో సాగే ప్రక్రి యల్ని అడ్డుకోవడం రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకోవడం వంటిది! ఈ వైఖరి మార్చుకోకుంటే, సంక్షేమ–అభివృద్ధి కార్యక్ర మాల్ని ఆశించే సగటు పౌరుల దృష్టిలో చంద్రబాబు నిరంతర దోషిగా నిలవటం ఖాయం! పదేపదే తగిన మూల్యం చెల్లించడం అనివార్యం!


వ్యాసకర్త : దిలీప్‌రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement