బాలయ్య అలా...మాల్యా ఇలా? | common man suffers as currancy Difficulties | Sakshi
Sakshi News home page

బాలయ్య అలా...మాల్యా ఇలా?

Published Fri, Nov 18 2016 8:13 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

బాలయ్య అలా...మాల్యా ఇలా? - Sakshi

బాలయ్య అలా...మాల్యా ఇలా?

సమకాలీనం

నల్ల సంపదలో పది శాతం కూడా లేని నగదు రూప నల్లధనంపై ఇంత పోరు చేస్తున్న వారు.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతాదారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? సామాన్యులను ఇన్ని కష్టాలు పెట్టి బ్యాంకులకు చేర్చే లక్షల కోట్ల నల్లధనం వల్ల సమకూరే ప్రయోజనాలను సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపిన చందంగా కార్పొరేట్లకు మేలు చేస్తారా? బ్యాంకుల మొండి బకాయిలను రద్దు పద్దులకు బదలాయించడాన్ని చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇద్దరు భారతీయులు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లక్ష్యాలతో విదేశాలకెళ్లారు. అంతిమంగా విభిన్న ఫలితాలు సాధించారు.

► చేసిన చిన్నపాటి బ్యాంకు అప్పుతీర్చడానికి ఇక్కడి వ్యవసాయం గిట్టుబాటుగాక, రేయింబవళ్లు కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసైనా అప్పు తీర్చొచ్చని మెదక్‌ జిల్లా ధర్మారం రైతు వర్దా? బాలయ్య దుబాయ్‌ వెళ్లాడు. ఆశించిన సంపాదన కుదరక, వెనక్కి తిరిగి వచ్చి సొంత భూమి అమ్మే క్రమంలో సర్కారు వారి ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయమే పెనుశాపమై కుటుం బంతో సహా విషం తీసుకొని చనిపోయాడు.

► చేసిన పెద్ద మొత్తం బ్యాంకు అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టి, కోర్టు శిక్షల నుంచి తప్పించుకోవడానికి ‘కింగ్‌’ఫిషర్‌ విజయ్‌ మాల్యా లండన్‌ వెళ్లాడు. తను వెనక్కి తిరిగి రాకపోగా 1200 కోట్ల రూపాయల అప్పును మొదట బ్యాంకు నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా, ఇప్పుడేకంగా రద్దు (రైటాఫ్‌) పద్దుగా ప్రక టింపజేసుకొని బ్యాంకులు–ఖాతాదారుల సత్సంబంధాల సంస్కృతినే చంపే శాడు.

అదీ, సామాన్యునికి కార్పొరేట్‌కి మధ్య తేడా! అంతే అనుకుంటే పొర పాటు! సదా ప్రజాపక్షం వహించాల్సిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా సామాన్యుల్ని పట్టించుకోకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్పొరేట్లకు మేలు చేసే చర్యల వైపే మొగ్గుతున్నాయి. ఇది ప్రమాద సంకేతం. నల్లధనం విధ్వంసానికి చర్యలు సరే సామాన్యుని ఇబ్బందుల్ని పరిష్కరించే చర్యలు చేపట్టండని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి బుధవారం దిశానిర్దేశం చేసింది. ‘మీరేమో ఇది సర్జికల్‌ స్రై్టక్‌ అంటున్నారు, ప్రతివాదు లేమో కార్పెట్‌ బాంబింగ్‌ (ప్రజలపై విచక్షణా రహితంగా బాంబులు కురిపిం చడం) అంటున్నారు. ఏదైనా లక్ష్యం నల్ల కుబేరులైనపుడు సామాన్యులపై సర్జికల్‌స్ట్రైక్స్ సరికాదు.

అమాయకులకు వాటిల్లే నష్టం (కొల్లేటరల్‌ డ్యామేజి) ఎక్కువ లేకుండా చూసుకొమ్మ’ని నిర్దిష్టంగా సూచించింది. అదే రోజున మాల్యా మొండి బకాయిల రద్దు అంశం పార్లమెంటులో వివాదాస్పదమ వడం, కుటుంబ సభ్యులందరికీ కోడి కూరలో విషం కలిపి తినిపించి  రైతు బాలయ్య ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛికమే అయినా, పరస్పరం సంబంధంలేని అంశాలేం కావు. ఒకదానితో మరొకటి ముడిపడిందే! ఇది మన కరెన్సీతో, బ్యాంకులతో, ఆర్థిక వ్యవస్థతో, ప్ర«భుత్వ ప్రాధాన్యాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న అంశం. ముఖ్యంగా సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న నల్ల కుబేరుల కుంభస్థలంపై కొట్టాలని, అవినీతికి, అక్రమ వ్యవహారాలకు, ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న నల్లధనాన్ని నలిపేయా లని కేంద్రం ‘పెద్ద నోటు రద్దు’ నిర్ణయం ప్రకటించిన తర్వాతి పరిణామాలు వెలువరిస్తున్న కీలక సంకేతం! ఎవరికి దన్నుగా ఉంటున్నాం? ఎవరిని ఇబ్బం దుల పాలుచేస్తున్నాం? ఏ సంస్కృతిని నలిపేసి మరే విష సంస్కృతికి ఊపిరి పోస్తున్నాం? అన్నది చాలా కీలకాంశం.

వాదన సరే, వాస్తవమేంటి?

బ్యాంకుల్ని ముంచిన విజయ్‌ మాల్యా పన్నెండొందల కోట్లు సహా మొత్తం రూ. 48,000 కోట్ల మొండి బకాయిల్ని రద్దు చేసిన నిర్ణయం ఎవరికి మేలు చేసేది? ‘రద్దంటే రద్దూ కాదు....’ అని మన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ సమర్థింపు రాగం తీశారు. అంతా గోప్యంగా జరిగిపోతుండగా, ‘డీఎన్‌ఏ’ పత్రిక ఇచ్చిన కథనం వల్ల రేగిన వివాదంతో పార్లమెంటు వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘రద్దు (రైటాఫ్‌) పద ప్రయోగం సాంకేతికమే, ఖాతాదారుల నుంచి బకాయలు ఖచ్చితంగా వసూలు చేసి తీరుతాం’ అని వివరణ ఇస్తూ చెప్పకనే ఓ చేదు నిజం చెప్పారు.

‘బ్యాంకు పుస్తకాల్లో లెక్కల కోసం, మొండి బకాయిలు(ఎన్‌పీఏలు)గా ఉన్న వాటిని ఆ పద్దు నుంచి తొలగించి, మరో పద్దు కింద చూపడం అంతే!’ అన్నారు. అంటే, బ్యాంకుల స్థితిగతుల్ని చూపేటప్పుడు, సాంకేతికంగానే అయినా... వసూలు కావాల్సిన వాటిని బకాయిలుగా కాక, ఇక ఎప్పటికీ వసూలుకు ఆస్కారం లేని పద్దు కింద చూపించడంతో ఇవి లెక్కలోకి రావు. కాబట్టి బ్యాంకు ఆర్థిక స్థితి బాగున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎవర్ని మోసం చేయడానికి? అప్పు తీసుకున్నది నిజం, చెల్లించని మాట నిజం, వసూలు చేయాల్సిన అవసరం ఉన్న మాట నిజం, మరి పద్దు మార్పెందుకు? సమా ధానం లేదు. ‘ఏం చేస్తారో తెలీదు, వచ్చే 2017 మార్చి నాటికి వాటిని ఒదిలించుకోండి....’ అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెబుతూ వచ్చిన ‘క్లీన్‌ అప్‌’(ప్రక్షాళన)లో భాగంగా జరిగిందే ఇది! నల్లధనంపై తాజాగా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల డిపాజిట్లు, ఆరోగ్యకర లావాదేవీలు పెరుగనున్న తరుణంలో ఈ చర్యలు అవసరమా? అన్న సందేహం కలుగు తుంది.

నల్ల సంపదలో పది శాతం కూడా లేని నల్లధనం (కరెన్సీ)పై ఇంత పోరు చేస్తున్నవారు, బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతా దారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? అని సామాన్యులు కూడా ప్రశ్ని స్తున్న తరుణంలో తాజా ‘రద్దు’ అవసరమా? పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు పొంది, తిరిగి చెల్లించని ఇతర ఎగవేత దారులకు ఎటువంటి సంకేతాలిస్తున్నాం? అన్నది ముఖ్యం. మొండి బకాయిల్లో ప్రపంచంలోనే మన పరిస్థితి అధ్వానం. మొత్తం రుణాల్లో ఎన్‌పీఏలు (మొండి బకాయిలు) 8.6 శాతంగా ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, గ్రీస్‌ మాత్రమే మనకంటే అధ్వా నంగా ఉన్న దేశాలంటేనే పరిస్థితి తీవ్రత స్పష్టమౌతోంది.

కాకుల్ని కొట్టి గద్దలకేస్తారేమో?

‘సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... దీర్ఘకాలికంగా ప్రస్తుత చర్య మేలు చేసేదే’అనే అభిప్రాయం మెజారిటీ ఆర్థిక మేధావి వర్గంలో వ్యక్తమౌతోంది. ఈ చర్యతో చలామణిలో ఉన్న 87 శాతం డబ్బు (రద్దయిన పెద్ద నోట్లు) ఎటు తిరిగి ఈ 50 రోజుల్లో తప్పనిసరిగా బ్యాంకు గవాక్షానికి రావాల్సిందే! అక్కడ ఏ లెక్కకా లెక్క తేలుతుంది. ఫలితంగా దొంగ నోట్లు నూరు శాతం గల్లంతే! ఆకాంక్ష, అంచనా  ప్రకారం ఈ దెబ్బతో... లెక్కలకెక్కకుండా మరుగునున్న నల్లధనం బ్యాంకులకు రాకూడదు.

తద్వారా అది ఇక శాశ్వతంగా లేకుండా పోవాలి. కానీ, పాత–కొత్త నోట్ల మార్పిడిని సైక్లింగ్‌ పద్ధ్దతుల్లో జరిపించడం, పరిమితికి లోబడే అయినా తమవి కాని ఖాతాల్లో డిపాజిట్‌ చేయించి–తిరిగి పొందడం... తదితర పద్ధతుల్లో నల్లధనాన్ని అక్రమార్కులు తెల్ల ధనంగా మారుస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీన్ని ఎలా అడ్డుకుంటారో, ఏ పద్ధతిన నియంత్రిస్తారో ప్రభుత్వ ఆర్థిక నిపుణులే చెప్పాలి. ఐటీ కొరడా బెదిరిం పులతో కొన్ని నియంత్రణ చర్యలిప్పటికే చేపట్టారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న సదాలోచనా పరులూ కొన్ని సూచనలు చేస్తున్నారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి ఈ ఒక్క చర్యే సరిపోదు.

అక్రమ, సక్రమ పద్ధతుల్లో సంపాదించి, పన్ను పరిధిలోకి తేకుండా పోగు చేసిన నల్ల సంపద అనేక రూపాల్లో ఉంది. అందులో, నల్లధనం (కరెన్సీ) పదిశాతం లోపే (ఏడెనిమిది శాతాన్ని మించదనేది మరో లెక్క) అన్న అభిప్రాయం ఉంది. ఏదైతేనేం, ఇదొక మంచి ప్రారంభం అనుకున్నా... ఇంకా చాలా చర్యలను పరంపరగా కొనసాగించాలని, ఒకదానితో మరొకదాన్ని ముడిపెట్టాలని, అప్పుడే ప్రభా వమైనా, ఫలతిమైనా  ఉంటుందని వారి అభిప్రాయం.

కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవడానికి చేసే రుణమాఫీ అమలుకు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసే బ్యాంకర్లు, అధికారిక ఆర్థికవేత్తలు కార్పొరేట్లకిచ్చే దొడ్డిదారి వెసలుబాట్లను ఎందుకు ప్రశ్నించరు? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యవసాయ రుణ మాఫీ ప్రకటించే వారు, అధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక ప్రాథమ్యాలు మార్చు కొని ఆ మేర బడ్జెట్‌ కేటాయింపులతో మాఫీ చేస్తామన్నా.... ‘అది బ్యాంకుల రుణ సంస్కృతిని, ఖాతాదారుల చెల్లింపు సంస్కృతిని చెడగొడుతుంద’ని నీతి మాటలు చెప్పే పెద్దలు, ఈ కార్పొరేట్‌ మొండి బకాయిల ‘రద్దు’ ఏ సంస్కృ తిని పెంచుతుందంటారో! మొన్నటి బ్యాంకుల ‘విలీనాలు’, నిన్నటి‘ క్లీన్‌ అప్‌’లు, నేటి ‘రద్దు పద్దు’లను చూస్తుంటే రేపటి వెలుగును కూడా చీకటి చేస్తారేమోనని భయమేస్తోంది.

ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు రూ. 3 లక్షల కోట్ల నల్ల« దనం బ్యాంకులకు రాదనుకున్నా... పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకు లకు వచ్చి చేరుతుంది. ప్రస్తుత చర్యలతో పాటు తదుపరి చర్యలూ ఇక కఠినతరంగా ఉంటాయి కనుక బ్యాంకింగ్‌ డిపాజిట్లు, సక్రమ లావాదేవీలు పెరిగి వడ్డీరేట్లు తగ్గుతాయి. ఆ మేర ద్రవ్యోల్బణమూ తగ్గుతుంది. ఈ ప్రయో జనాల్ని సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపినట్టు కార్పొరేట్లకే మేలు చేస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలను (ఎన్‌పీఏలను) రద్దు పద్దులకు బదలాయించిన చర్యలు పంపుతున్న సంకేతాలు ఈ అనుమానాల్ని బలోపేతం చేస్తున్నాయి.

కసరత్తు జరక్కే కష్టాల కొలిమి!

కుబేరుల నుంచి కూలీల వరకు, చిత్ర పరిశ్రమ నుంచి చిరు వ్యాపారి దాకా దేశంలోని అందరినీ ప్రత్యక్షంగా ప్రభావితుల్ని చేసిన ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం వెల్లడికి ముందు అవసరమైన కసరత్తు జరగలేదు. జరిగుంటే, తగు ముందస్తు ఏర్పాట్లు, పౌరులకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకొచ్చేవి. వందనోట్లు, అంతకన్నా చిన్నవి విరివిగా లభించేవి. ఇప్పుడున్న ఏటీఎంలే ఉపయోగపడేలా రూ. 2,000 నోటు తగిన సైజులో వచ్చేది. అసలు అదెం దుకు వచ్చిందో హేతుబద్ధ్దమైన కారణం దొరికేది. వెయ్యి నోటు వస్తుందో, రాదో సందిగ్ధం తొలగేది. కొత్త రూ. 500 నోటు కొరత తీరేది. ఆ కసరత్తు అసలే జరగలేదనడానికి ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, రోజు రోజుకూ మారుతున్న ప్రభుత్వ నిర్దేశాలే అందుకు నిదర్శనం.

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్‌బీఐ వంటి బ్యాంకు నిపుణుల సూచనలు, సలహాలు ఎందుకు తీసుకో లేదో అర్థం కాదు. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించి, ఆచరిస్తున్నపుడు తగు కసరత్తు జరిగి ఉండాల్సిందని ఎవరైనా కోరుకుంటారు. ప్రజలకు ఇబ్బం దులు రాకుండా జేసే ముందు చూపును విడనాడి, దూకుడుగా చేసిన ప్రక టనతో ఆశించిన రాజకీయ ప్రయోజనమే ఎక్కువున్నట్టు స్పష్టమౌతోంది. నల్లసంపద/నల్లధనంపై యుద్ధం వద్దని ఎవరూ అనరు.

ఈ సర్జికల్‌ స్రై్టక్‌తోనే సరిపెడతారా? అసలైన యుద్ధం చేసే ఆలోచన పాలకులకుందా? అన్నదే సందేహం! దేశీయ నల్లధనంపై దాడితో పాటు విదేశీ నల్లధనంపై, వివిధ రూపాల్లోని నల్ల సంపదపై, బ్యాంకుల్ని ముంచుతున్న మొండి బకాయి దారులపై చర్యలకు పూనుకుంటేనే నిజమైన యుద్ధం. అసలు యుద్ధం వేరు. పరిమితమైన సర్జికల్‌ స్రై్టక్స్‌ వేరు. సరిహద్దు నుంచి అర కిలోమీటరు లేదా ఒకటిన్నర కిలోమీటర్లకు మించని శతృభూభాగంలో చేసే లక్ష్యిత దాడులే సర్జికల్‌స్ట్రైక్స్. విజయ్‌ మాల్యా మొండి బకాయిల రద్దు ద్వారా..... నిర్యుద్ధ భావనలే సర్కారు సంకేతాలయితే, ఇన్ని కష్టాలు, త్యాగాలతో రేపటి వెలు గుల కోసం నిరీక్షిస్తున్న దేశ పౌరులు స్వల్ప పరిధికి పరిమితమైన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్ తో సరిపెట్టుకోవాల్సిందే!

http://img.sakshi.net/images/cms/2015-07/61438290637_295x200.jpg
ఈ–మెయిల్‌
dileepreddy@sakshi.com
దిలీప్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement