ప్లాన్ లేని ఫ్లై ఓవర్..ట్రాఫిక్ టై | Who do not plan to fly to tie ovartraphik | Sakshi
Sakshi News home page

ప్లాన్ లేని ఫ్లై ఓవర్..ట్రాఫిక్ టై

Published Thu, Sep 4 2014 3:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్లాన్ లేని ఫ్లై ఓవర్..ట్రాఫిక్ టై - Sakshi

ప్లాన్ లేని ఫ్లై ఓవర్..ట్రాఫిక్ టై

  •       అక్కరకు రాని ఐదు ఫ్లై ఓవర్లు
  •      ప్రణాళిక లేకుండా నిర్మాణం
  •      మౌలిక వసతుల కల్పనకు దూరం
  •      తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు
  •      కోల్‌కతా మార్గం అనుసరణీయం
  • సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా ఫ్లైఓవర్ నిర్మించారంటే అర్థమేంటి? ఆ దారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలని. ఘనత వహిం చిన అప్పటి మన ప్రభుత్వ పెద్దలు, అధికారులు ముందు చూపులేకుండా ముందుకెళ్లిపోయారు. ఆలోచన లేకుండా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పూనుకున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య పరి ష్కారం కాకపోగా... ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతోంది. సిటీలో ఉన్న 16 ఫ్లైఓవర్‌లలో కీలక ప్రాంతాల్లో ఉన్న ఐదు పూర్తి స్థాయిలో అక్కరకు రాకుండా పోయాయి. వీటి నిర్మాణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వీటికి అనుబంధంగా ఉండే జంక్షన్లు, రహదారుల అభివృద్ధిని మర్చిపోయారు. నయాపూల్‌లోని సమాంతర వంతెన (ప్యార్లల్ బ్రిడ్జ్) సైతం ఈ కోవకు చెందినదే.
     
    పీఎన్‌టీ  ఫ్లైఓవర్
     
    పీఎన్‌టీగా పిలిచే ప్రకాష్ నగర్ ‘టి’ జంక్షన్ ఫ్లైఓవర్ బేగంపేట విమానాశ్రయం వద్ద దాదాపు 700 మీటర్ల పొడవున నిర్మితమైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ముందు ఇదే అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో అక్కడికి వచ్చే ప్రముఖులు, ఇతరులకు పీఎన్‌టీ వద్ద ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను బేగంపేట వైపు మరో 500 మీటర్ల పొడిగిస్తే అత్యంత రద్దీ చౌరస్తాల్లో ఒకటైన రసూల్‌పుర మీదుగా ప్రయాణించే వారికి కొంత ఊరట లభించేది. అలా చేయకపోవడం ప్రధాన లోపం. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగా అప్పట్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా బాగుండేదనేది రవాణా రంగ నిపుణుల మాట.
     
    సీటీఓ ఫ్లైఓవర్:
     
    బేగంపేట-సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య పీఎన్‌టీ ఫ్లైఓవర్‌కు కొనసాగింపుగా నిర్మించిందే చీఫ్ టెలికామ్ ఆఫీసర్ (సీటీఓ) ఫ్లైఓవర్. దీని పొడవు దాదాపు 700 మీటర్లు. వాస్తవానికి దీని నిర్మాణ సమయంలోనే ట్రాఫిక్ అధికారులు, నిపుణుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటికే ఇటు బేగంపేట వైపు పీఎన్‌ఈ ఫ్లైఓవర్ ఉండటం, అటు సంగీత్ వైపు మరొకటి నిర్మించనున్న నేపథ్యంలో దీని డిజైన్‌లో మార్పు చేయాలంటూ గగ్గోలు పెట్టారు. పీఎన్‌టీకి కొనసాగింపుగా నిర్మించే బదులు దీన్ని అడ్డంగా తిప్పి ప్యారడైజ్ హోటల్ రోడ్-బాలమ్ రాయ్/తాడ్‌బండ్ చౌరస్తా మధ్య ట్రాఫిక్ కోసం కేటాయించాలని కోరారు. దీని వల్ల జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాలకు ఉపయుక్తంగా ఉండటంతో పాటు బేగంపేట-సంగీత్ మధ్య ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ‘సీటీఓ’ పూర్తి స్థాయిలో ఉపయోగపడకుండా పోయింది.
     
    మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్

    లక్డీకాపూల్-మెహదీపట్నం మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు మహావీర్ ఆస్పత్రి నుంచి ఎన్‌ఎమ్‌డీసీ వరకు దాదాపు 900 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అవసరమైన వెడల్పుతో ఇది లేకపోవడం ప్రధాన లోపం. నిపుణుల సూచనల ప్రకారం ఈ ఫ్లైఓవర్‌ను విజయ్‌నగర్ కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఖాజా మాన్షన్ వరకు నిర్మించాల్సి ఉంది. అప్పుడు లక్డీకాపూల్-మెహదీపట్నం మార్గాన్ని మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలోని సిగ్నల్‌తో పని లేకుండా నేరుగా నడిపే అవకాశం ఉండేది. ఈ ఫ్లైఓవర్‌కు పక్కగా పీటీఐ భవనం వైపు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉన్నా దీని విస్తరణ విషయం పట్టించుకోలేదు. ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా చింతల్‌బస్తీ-ఖైరతాబాద్ రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉండగా, ఆ విషయాన్నీ ప్రభుత్వం విస్మరించింది.
     
    నారాయణగూడ ఫ్లైఓవర్

    మాసబ్‌ట్యాంక్, సీటీఓ ఫ్లైఓవర్ల మాదిరిగానే  నారాయణగూడలో నిర్మించిన దానిలోనూ ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి. లిబర్టీ-ఉస్మానియా వర్సిటీ మార్గాల మధ్య ట్రాఫిక్‌కు ఇది కేవలం నారాయణగూడ చౌరస్తాను మాత్రమే తప్పిస్తుంది. మిగిలిన చోట్ల ఇబ్బందులు యథాతథం. ఈ ఫ్లైఓవర్ సైతం తగినంత వెడల్పు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా ప్రమాదాలకూ నెలవుగా మారింది. వాస్తవానికి దీని కింది నుంచి వెళ్లే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్-వైఎంసీఏ మధ్యనే ఎక్కువ రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులు ఆ మార్గానికి సమాంతరంగా నిర్మించాలంటూ విన్నవించినా నిర్మాణ సమయంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న దానికీ రెండు వైపుల  రహదారులను విస్తరించకపోవడంతో ఈ ఫ్లైఓవర్ వల్ల ఉపయోగం లేకుండాపోయింది. అప్పట్లోనే దీన్ని నిర్మించడం వృధా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
     
    తెలుగు తల్లి ఫ్లైఓవర్
     
    రాజధానిలోని ఫ్లైఓవర్లలో అత్యధిక కాలం నిర్మితమైందిగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు రికార్డు ఉంది. అనేక బాలారిష్టాలను అధిగమిస్తూ 1.1 కిమీ పొడవుతో ఇది అందుబాటులోకి రావడానికి ఆరేళ్లకు పైగా పట్టింది. ఇక్బాల్ మీనార్-కట్టమైసమ్మ దేవాలయం మధ్య నిర్మించిన ఈ ఫ్లైఓవర్ డిజైన్‌నూ మార్చాలని అప్పట్లోనే అనేక మంది ఇంజినీరింగ్, రవాణా రంగ నిపుణులు సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో కంటే ఇటు ఇక్బాల్ మీనార్... అటు లిబర్టీ జంక్షన్లను దాటేలా డిజైన్‌లో మార్పులు చేస్తే ఫలితాలుంటాయని గగ్గోలు పెట్టారు. ఆది నుంచీ అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ నిర్మాణాన్ని అనుకున్న ప్రకారం పూర్తి చేయించడంలోనూ సర్కారు విఫలమైంది. ప్రభుత్వ స్థాయిలో పక్కాగా వ్యవహరించలేకపోవడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది.
     
    ఏడు కిలోమీటర్లలో మూడు ఫ్లైఓవర్లు
     
    బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్-సికింద్రాబాద్‌లో ఉన్న సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య గరిష్ఠంగా ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో బాబు హయాంలో అనాలోచితంగా మూడు ఫ్లైఓవర్లను నిర్మించారు. రహదారిలో దాదాపు సగం (2.4 కిమీ) ఫ్లైఓవర్ల పైనే ప్రయాణం ఉంటుంది. దీని ప్రభావం బేగంపేట, మెట్టుగూడలపై తీవ్రంగా పడింది. ఈ ఫ్లైఓవర్ల కారణంగా ఎలాంటి నియంత్రణ లేకుండా నేరుగా దూసుకువచ్చే వాహనాలతో ఈ రెండు ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో ట్రాపిక్ స్తంభించడం ప్రారంభమైంది. వీటి నిర్మాణంతో పాటు అటు బేగంపేట వైపున్న షామ్‌లాల్ నాలాను విస్తరించే అంశాన్నీ విస్మరించారు. తార్నాక మార్గంలో ఉన్న రోడ్ అండ్ బ్రిడ్జ్ (ఆర్‌యూబీ)లు రైల్ నిలయం వంతెన, ఆలుగడ్డ బావి వంతెన అంశాన్ని పట్టించుకోలేదు.
     
    నయాపూల్ సమాంతర వంతెన
     
    ప్రస్తుతం నిర ర్ధకంగా, గందరగోళంగా తయారైన నయాపూల్ పాత వంతెనకు సమాంతరంగా మరో వంతెన వచ్చింది.అఫ్జల్‌గంజ్-మదీనా-హైకోర్టు మీదుగా సిటీ కాలేజీ మార్గాల్లో ట్రాఫిక్‌కు ఉపశమనం కలిగించాలన్నది ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనల్లో కీలకాశం. అప్పట్లో పాత వంతెనకు ఇరుపక్కలా సైకిల్ ట్రాక్ ఉండేది. దీన్ని క్రమబద్ధీకరించడంతో పాటు ఇరుపక్కలా వంతెనల నిర్మాణం చేపట్టి, పాతదానితో కలిపేయాలంటూ ట్రాఫిక్ అధికారులు నెత్తీనోరు బాదుకున్నారు. ఒకే బ్రిడ్జ్‌గా నిర్మిస్తేనే ఫలితాలుంటాయని స్పష్టం చేశారు. అలా చేయకపోవడంతో అఫ్జల్‌గంజ్‌తో పాటు మదీనా చౌరస్తాకూ ఇబ్బందులు వచ్చాయి. ఈ వంతెన ఫలితాల కోసం అఫ్జల్‌గంజ్ వైపు ఉస్మానియా ఆస్పత్రికి ఆనుకుని ఉన్న దుకాణాలను బర్తన్ బజార్‌కు తరలించే ప్రతిపాదనలూ సిద్ధం చేశారు. దీనికి అవకాశం ఉన్నా అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోడంతో ప్యార్లల్ బ్రిడ్జ్ ఫలితాలు అరకొరగానే ఉండిపోయాయి.
     
    కోల్‌కతా మార్గం అనుసరణీయం...

    హైదరాబాద్ మాదిరిగానే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సైతం పురాతన నగరమే. అప్పట్లో పక్కా ప్రణాళిక లేకుండా నిర్మితమైన ఆ నగరంలో తర్వాతి కాలంలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిటీ కంటే కనిష్టంగా రోడ్లు విస్తీర్ణం కలిగిన కోల్‌కతా నగరం అనతి కాలంలోనే ఆ సమస్యను అధిగమించింది. అక్కడ ట్రామ్, మెట్రో ఉన్నప్పటికీ మౌలిక వసతుల పైనా దృష్టి పెట్టారు. సాంకేతికంగా అధ్యయనం చేయడం ద్వారా అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించి రోడ్ల విస్తీర్ణాన్ని ఆరు శాతం మేర పెంచుకున్నారు. ఫ్లైఓవర్లు శాశ్వతమైన నిర్మాణాలు. వీటిని నిర్మించేప్పుడు ప్రస్తుత అవసరాలనే కాకుండా... భవిష్యత్తును సైతం దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వంతెన నిర్మాణం ప్రణాళికా బద్ధంగా ఉండటంతో పాటు దానికి చుట్టుపక్కల సైతం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తేనే సరైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నగరంలో భవిష్యత్తులో నిర్మించనున్న వాటిలో విషయంలోనైనా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement