Brian Acton
-
ఇట్స్ టైం.. డిలిట్ ఫేస్బుక్
భారీ డేటా బ్రీచ్‌తో ఇబ్బందుల్లో పడ్డ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు దెబ్బమీద దెబ్బపడుతోంది. తాజాగా ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టాన్ ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఫేస్‌బుక్‌కు టాటా చెప్పాల్సిన సమయం(ఇట్స్ టైం.. డిలిట్ ఫేస్బుక్) అంటూ తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి బ్రియాన్ ట్విట్ చేశారు. రూ.5 కోట్ల వినియోగదారులు డేటాను విక్రయించిందన్నఆరోపణలతో ఫేస్బుక్ సతమతమవుతూండగానే ట్వీట్ మరింత దుమారాన్ని రేపుతోంది. అంతేకాదు బ్రియాన్ ట్వీట్‌తో ట్విటర్లో డిలిట్ ఫేస్బుక్ హ్యాష్‌ట్యాగ్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఆయనకు దాదాపు 21వేల మంది ట్విటర్ ఫాలోవర్స్ ఉన్నారు. 2014లోసుమారు 19 బిలియన్ డాలర్లతో వాట్సాప్‌ను ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఈ విక్రయం తరువాత ఫేస్‌బుక్‌తో కొనసాగిన బ్రియాన్ గత నెలలోనే సిగ్నల్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించడం గమనార్హం. 2018, ఫిబ్రవరిలో దీన్ని మాక్సి మార్లిన్పైక్తో కలిసి స్థాపించారు. అయితే ఫేస్‌బుక్‌తో ప్రస్తుతం బ్రియాన్ రిలేషన్ప్పై సమాచారం అందుబాటులో లేదు. మరోవైపు బ్రియాన్ ట్వీట్‌పై వాట్సాప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ క్యాపిటల్ వాల్యూ, షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. It is time. #deletefacebook — Brian Acton (@brianacton) March 20, 2018 -
వాట్సాప్‌కు భారీ ఝలక్!
కాలిఫోర్నియా: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కో ఫౌండర్ అనూహ్యంగా గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపనీని తాను వీడుతున్నట్టుగా మంగళవారం ఫేస్‌బుక్‌ద్వారా ప్రకటించారు. అలాగే త్వరలోనే సొంతంగా లాభాపేక్షలేని ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించబోతున్నానని వెల్లడించారు. ఫేస్బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వాట్సాప్ సమావేశంలో తన సహచరులకు ఆయన ప్రకటన చేశారు. కంపెనీని విడిచి పెడుతున్నానని, సొంత లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించబోతున్నానని బ్రియన్ ప్రకటించారు. అలాగే నాకిష్టమైన అంశాలపై రిస్క్ తీసుకోగలిగే వయసులో ఉన్నాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌లో సొంత నాన్‌ప్రాఫిట్ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా నా మనసులో ఈ ఆలోచన ఉంది. ఇప్పటికి ఆచరణలోకి రాబోతోంది. రాబోయే నెలల్లో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తానని తన పేస్బుక్ పేజ్‌లో పోస్ట్‌లో వెల్లడించారు బ్రియాన్. కాగా జాన్ కోమ్‌తో కలిసి బ్రియన్ యాక్షన్ సహ-వ్యవస్థాపకుడిగా 2009లో వాట్సాప్ ను నెలకొల్పారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. బ్రియాన్ వాట్సాప్‌లో దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు యాహూకి పనిచేశారు. -
వాట్సప్‌లో డిజిటల్ పేమెంట్స్!
న్యూఢిల్లీ: మెసెజింగ్ యాప్ వాట్సప్‌లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు సంస్థ కో ఫౌండర్ బ్రియాన్ యాక్టన్. అయితే ఈ విషయంలో వాట్సప్ ఇప్పుడిప్పుడే కసరత్తులు ప్రారంభించిందని.. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పడుతుందని తెలుస్తోంది. భారత పర్యటనకు వచ్చిన యాక్టన్.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా కోసం ప్రభుత్వం కృషి బాగుందని ఆయన కితాబిచ్చారు. మాజీ యాహూ ఉద్యోగులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ 2009లో ప్రారంభించిన వాట్సప్.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 1.2 బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఇందులో భారత్‌లోనే 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు. -
భారత డిజిటల్ కామర్స్‌కు వాట్సాప్ తోడ్పాటు
న్యూఢిల్లీ: డిజిటల్ కామర్స్ విభాగంలో తమ వంతు తోడ్పాటు అందించడంపై చర్చించేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. తమకు కీలకమైన భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారని యాక్టన్ తెలిపారు. డిజిటల్ ఇండియా నినాదం లక్ష్యాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు సురక్షితమైనవిగాను, సరళతరంగాను ఉంటాయని ఆయన వివరించారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు యాక్టన్ వెల్లడించినట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు. ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్ తదితర దేశాల్లో డీఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా మారింది. భారత్‌లో హైక్, స్నాప్‌చాట్, వైబర్ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. వాట్సాప్‌కి 100 కోట్ల పైగా యూజర్లు ఉండగా.. ఇందులో సుమారు 20 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ఆదాయ ఆర్జన దిశగా ఈ ఏడాది నుంచి యాడ్లపై కూడా వాట్సాప్ దృష్టి సారిస్తోంది. -
వాట్స్‌యాప్ వ్యవస్థాపకులకు రూ. 55,000 కోట్లు
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సంస్థకు తమ కంపెనీని విక్రయించిన వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ భారీ జాక్‌పాట్ దక్కించుకున్నారు. డీల్‌లో భాగంగా ఫేస్బుక్లో వారికి 116 మిలియన్ షేర్లు లభించాయి. వీటి విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 55,000 కోట్లు) ఉంటుంది. మెసేజింగ్ సర్వీసుల సంస్థ వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థకు ఫేస్బుక్ తెలిపిన వివరాల ప్రకారం కౌమ్‌కు 5.8 బిలియన్ డాలర్ల విలువైన 76.4 మిలియన్ల షేర్లు లభించాయి. దీంతో ఫేస్బుక్లో ఆయన నాలుగో అతి పెద్ద వాటాదారుగా మారారు. యాక్టన్కు 3 బిలియన్ డాలర్లు విలువ చేసే 39.7 మిలియన్ల ఫేస్బుక్ షేర్లు లభించాయి. వాట్స్‌యాప్‌లో 45 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు ఫేస్బుక్ షేర్లు లభించాయి.