వాట్సాప్‌కు భారీ ఝలక్!
కాలిఫోర్నియా: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కో ఫౌండర్ అనూహ్యంగా గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపనీని తాను వీడుతున్నట్టుగా మంగళవారం ఫేస్‌బుక్‌ద్వారా ప్రకటించారు. అలాగే త్వరలోనే సొంతంగా లాభాపేక్షలేని ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించబోతున్నానని వెల్లడించారు.
ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వాట్సాప్ సమావేశంలో తన సహచరులకు ఆయన ప్రకటన చేశారు. కంపెనీని విడిచి పెడుతున్నానని, సొంత లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించబోతున్నానని బ్రియన్ ప్రకటించారు. అలాగే నాకిష్టమైన అంశాలపై రిస్క్ తీసుకోగలిగే వయసులో ఉన్నాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌లో సొంత నాన్‌ప్రాఫిట్ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా నా మనసులో ఈ ఆలోచన ఉంది. ఇప్పటికి ఆచరణలోకి రాబోతోంది. రాబోయే నెలల్లో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తానని తన పేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్‌లో వెల్లడించారు బ్రియాన్.
కాగా జాన్ కోమ్‌తో కలిసి బ్రియన్ యాక్షన్ సహ-వ్యవస్థాపకుడిగా 2009లో వాట్సాప్ ను నెలకొల్పారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. బ్రియాన్ వాట్సాప్‌లో దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు యాహూకి పనిచేశారు.