సర్కారుపై కోర్టుకెక్కిన మైక్రోసాఫ్ట్!
వినియోగదారులకు తెలియకుండానే వాళ్ల ఈ మెయిల్ లేదా ఆన్‌లైన్ ఫైళ్లను పరిశీలించేందుకు వీలు కల్పించేలా చట్టం చేసినందుకు.. అమెరికా ప్రభుత్వం మీద మైక్రోసాఫ్ట్ కేసు పెట్టింది. వ్యక్తుల రహస్యాలకు సంబంధించి టెక్ పరిశ్రమకు, అమెరికా అధికారులకు మధ్య గొడవలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. అవసరాన్ని బట్టి ఈమెయిళ్లు, ఫొటోలు, ఆర్థిక రికార్డులు అన్నింటినీ కస్టమర్లు దాచుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేదా క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లను తాము సులభంగా యాక్సెస్ చేసేలా ఉండాలని అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వాదిస్తున్నారు. దానికోసమే తాజాగా చట్టం చేశారు.
కానీ, అమెరికా న్యాయశాఖ ఈ విషయంలో 1986 నాటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. ఎవరివైనా ఫైళ్లను చూడాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి ఉండాలని, కానీ అలా కాకుండా ఏపకక్షంగా అధికారులే చూస్తే పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని చెబుతోంది. ఈ విషయమై సీటెల్ ఫెడరల్ కోర్టులో గురువారం నాడు మైక్రోసాఫ్ట్ ఓ కేసు దాఖలుచేసింది. కానీ తాము ప్రధానంగా బాలలపై అత్యాచారాలు చేసేవాళ్లు, ఇళ్లలో దారుణాలకు పాల్పడేవారు, క్రూరమైన నేరస్తులు, ఉగ్రవాదుల వివరాలపై మాత్రమే నిఘా ఉంచుతామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఒకరు చెబుతున్నారు.
అయితే, ప్రభుత్వం మనమీద దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో తెలిస్తే అప్పుడు డిఫెన్స్‌కు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుందని, అలా కాకుండా ప్రభుత్వం తనంతట తానే వ్యక్తుల ఫైళ్లను చూసేస్తుంటే ఇక వాళ్లు తమను తాము కాపాడుకునే అవకాశం ఉండదని మరికొందరు వాదిస్తున్నారు.
వైట్‌కాలర్ నేరాలు సహా పలు రకాల కేసుల దర్యాప్తు విషయంలో ఈసీపీఏ చట్టం కింద ప్రభుత్వం చేసే డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అత్యంత ముఖ్యమైన కేసుల్లోనే ఇలా అడగాలి గానీ, ఈమధ్య కాలంలో ఈ తరహా ఉత్తర్వులు మరీ సర్వసాధారణం అయిపోతున్నాయని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఓ ప్రకటనలో చెప్పారు. గడిచిన 18 నెలల్లో 5,600 సార్లకు పైగా కస్టమర్ల వివరాల కోసం అధికారులు డిమాండ్ చేశారట. వాటిలో సగానికి పైగా కేసుల్లో కోర్టు మాత్రం వాటిని రహస్యంగా ఉంచాల్సిందిగా ఆదేశించింది. కొన్ని కేసులలో ఉత్తర్వులకు కాలదోషం పట్టినా, మిగిలిన 1750 కేసుల్లో మాత్రం ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అలాగే ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది. చాలామంది తమ డేటాను ఆన్‌లైన్‌లోనే స్టోర్ చేసుకుంటున్నారని, దాన్ని ప్రభుత్వం అలుసుగా తీసుకోవాలని భావిస్తోందని అంటోంది.
మైక్రోసాఫ్ట్‌కు ప్రత్యర్థి సంస్థ యాపిల్ కూడా ఈ విషయంలో ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో పోరాడిన విషయం తెలిసిందే. ఐఫోన్లలో స్టోర్ చేసిన డేటాను అన్‌లాక్ చేసి తమకు ఇవ్వాలని ఎఫ్‌బీఐ పట్టుబట్టడం, చివరకు యాపిల్‌తో సంబంధం లేకుండానే అన్‌లాక్ చేసేసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం ఇలా చేయడం అలవాటుగా మారిందని అమెరికా పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది అలెక్స్ అబ్డో అన్నారు.