Tulsi Gowda: Environmentalist Awarded Padma Shri by President Ram Nath Kovind - Sakshi
Sakshi News home page

Tulsi Gowda: నడిచి వచ్చిన తులసి చెట్టు.. అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ప్రత్యేకత ఏమిటి?

Published Thu, Nov 11 2021 12:40 AM | Last Updated on Thu, Nov 11 2021 10:52 AM

Environmentalist Tulsi Gowda awarded Padma Shri by President Ram Nath Kovind - Sakshi

ఆమె నిరాడంబరతకు నమస్కరిస్తున్న ప్రధాని, రాష్ట్రపతి నుంచి పద్మ పురస్కారాన్ని స్వీకరిస్తున్న తులసి గౌడ

డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ!

సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్‌ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు.

ఆమె మరెవరో కాదు, ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది.  

కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది.

మాటలు కాదు చేతల్లో చూపింది
 ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్‌ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు.

విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్‌ రోజ్‌ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు.

ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్‌ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు.  
 
నడిచే వన దేవత..
విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి.

తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్‌ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి.

300 మొక్కలను గుర్తుపడుతుంది..
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారిగా 28 ఏళ్లు  పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement