Encyclopedia
-
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
ఆటోలో ప్రపంచం!
విజ్ఞానాన్ని పంచాలంటే విద్యావంతులే కావాలా? సమాజాన్ని మార్చాలంటే సంఘ సంస్కర్తలే రావాలా? పదిమందికి జ్ఞానాన్ని నింపేందుకు పనిమానేసుకొని తిరగాలా? అక్కరలేదంటున్నాడు అబ్దుల్. ఓ ఆటో డ్రైవర్ కూడా ఈ పనులన్నీ చేయగలడని నిరూపిస్తున్నాడు. ఎలాగో ఓసారి మీరే స్వయంగా తిలకించండి... ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిపేరు అబ్దుల్. బెంగళూరులో ఫేమస్ ఆటోడ్రైవర్. అంత ఫేమస్సెందుకంటే.. ఈయన ఆటోని ఒక్కసారి ఎక్కితేచాలు ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. చూడ్డానికి బయటకు ఆటోలానే కనిపిస్తున్నా ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కదులుతున్న ఎన్సైక్లోపీడియా. జాతీయ నాయకుల జయంతి-వర్ధంతి, ఏ నెలలో ఎన్ని రోజులుంటాయి వంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి వరకట్నం తీసుకోవడం, భ్రూణహత్యలు పాపం, స్త్రీలను గౌరవించాలి, నిర్భయ చట్టం ఏం చెబుతోంది? వంటి ఎన్నో విషయాలపై మనకు ఓ అవగాహన వస్తుంది. ఎందుకంటే అతని ఆటో ఇంటీరియర్ అంతా వీటితోనే నిండిపోయి ఉంటుంది. అంతేనా... ఆటోలో ఎక్కిన ప్రయాణికుల అభిరుచులను ఇట్టే గుర్తుపట్టేసి, వారికి వినసొంపైన పాటలను కూడా వినిపిస్తాడు అబ్దుల్. అంటే ఈ ఆటో ఒక్కసారి ఎక్కితే విజ్ఞానం, వినోదం మన సొంతమన్నమాట. -
ఒకరికి ఒకరు
చూపున్న ప్రేమ గోపాలపట్నం: ప్రేమంటే క్షణికావేశం... ప్రేమ పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చట... ఇది కాదు ప్రేమంటే. ఒకే మనసు.. ఒకే మాట.. ఒకే బాట.. ఇదీ అసలయిన ప్రేమ. దీనికి అసలు సిసలయిన నిర్వచనం చెబుతూ మూడు వసంతాలు ముందుకు సాగిపోయారు పలికెల రాము, లక్ష్మీబాయి దంపతులు. వయసులో ఉన్నపుడు ఇష్టపడ్డా తర్వాత భర్త అంధుడయ్యాడని దిగులు చెందకుండా తాను రాములో సగమై లక్ష్మీబాయి కుటుంబానికి వెన్నుదన్నయ్యారు. గోపాలపట్నంలో డార్విన్ ఎలక్ట్రానిక్స్ పేరు వినని వారుండరు. దీన్ని పలికెల రాము, లక్ష్మీబాయి దంపతులు నిర్వహిస్తున్నారు. మెట్రిక్యులేషన్ చదివి ట్యూషన్లు చెప్పుకుంటున్న రాము లక్ష్మీబాయిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి 1983లో పెళ్లి చేసుకున్నారు. రేడియో మెకానిక్‌గా శిక్షణపొంది డార్విన్ మెకానిక్ షాపు ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తూ ఇతనికి గ్లకోమా వచ్చి కంటి చూపు అంచెలంచెలుగా కోల్పోయింది. దీంతో భార్యకు రేడియో మెకానిక్ శిక్షణ ఇచ్చారు. ఇలా కాలక్రమంలో రాము పూర్తిగా అంధుడయ్యారు. అప్పటి నుంచీ లక్ష్మీబాయే సర్వస్వమయింది. జీవితభాగస్వామికి అసలయిన నిర్వచనంగా నిలిచింది. తాను భర్త వద్ద నేర్చుకున్న మెకానిక్ విద్యే ఇపుడు కుటుంబాన్ని నెట్టుకెళ్తోంది. పెద్దవాళ్లయిన కొడుకు సుమంత్, కూతురు స్నేహితకు పెళ్లిళ్లు కూడా చేశారు. ‘ఒకరినొకరు ఆకళింపు చేసుకుని ఒకే బాటలో ముందుకు సాగితే ప్రేమ బంధం శాశ్వతంగా ఉంటుందంటారు రాము, లక్ష్మీబాయి. ప్రేమ జంటలకు పెద్ద దిక్కు యలమంచిలి: ప్రేమికుల పాలిట ఆమె ఆశాదీపం.. ఒక ధైర్యం.. గట్టి నమ్మకం... ప్రేమ పేరుతో ఆడపిల్లలను నమ్మించి, మోసం చేసే వారి పాలిట ఆమె సింహస్వప్నం. అవతలివాడు ఎంతటి వాడైనా సరే, మెడలు వంచి ప్రేమించిన పిల్ల మెడలో తాళి కట్టించి న్యాయం చేయగల దమ్మున్న మహిళ.. ఆమె పేరే పెదపల్లి లక్ష్మి. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లి గ్రామానికి చెందిన ఈమె అసలు పేరు బొద్దపు లక్ష్మి. మోసపోయిన యువతులకు అండగా ఉండి, గ్రామానికే ఒక గుర్తింపు తెచ్చేలా పెదపల్లి లక్ష్మిగా గుర్తింపు పొందుతున్నారు. పెదపల్లి ఎంపీటీసీగా సేవలందించారు. రెండు దశాబ్దాల కాలంలో రమారమి 234 ప్రేమ పెళ్లిళ్లను తోటి మహిళా మండలి ప్రతినిధుల సహకారంతో ఆమె చేయించారు. పెద్దగా చదువుకోకపోయినా ఆమె తెలుగుతోపాటు హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే పలు కంపెనీల్లో పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ఆడపిల్లలను ప్రేమ పేరుతో మోసగించి, ఆ తర్వాత పరారైతే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి అక్కడ వాదించి మోసగించిన యువకులను యలమంచిలికి లాక్కురాగల సమర్ధురాలిగా పేరు సంపాదించుకున్నారు. గత పదేళ్ల నుంచి ప్రేమపెళ్లిళ్లను దగ్గరుండి ఆలయాల్లో జరిపించడమే గాకుండా, ఆ జంటలకు చట్టబద్ధత కల్పించేలా రిజిస్ట్రేషన్ పనులను కూడా తాను చేయిస్తుంటారు. ఈమె స్పూర్తి, ప్రేరణతో ఒకటైన ఎన్నో జంటలు నేడు ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాయి. అతడే ఆమెకు సర్వస్వం టి.అర్జాపురం (రావికమతం): అసలైన ప్రేమికులంటే వారే. అన్యోన్యతకు మారుపేరుగా నిలిచారు. అర్థం చేసుకునే మనసుంటే అంగవైకల్యం ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు. టి.అర్జాపురం గ్రామానికి చెందిన మత్స బుచ్చెమ్మ సాక్షరభారత్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు మంచి మనసు ఇచ్చిన ఆ దేముడు ఆమె కాళ్లు మాత్రం చిన్నవి చేశాడు. దీంతో బుచ్చెమ్మ మూడడుగుల ఎత్తే ఉంటుంది. వికలాంగురాలైనా ఆమె మనోధైర్యంతో తన పనులు తాను చేస్తూనే పలువురికి మంచిబుద్ధులు చెబుతుంటుంది. అదే గ్రామానికి చెందిన రాజాన అప్పలనాయుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. బుచ్చెమ్మ మంచి మనస్సును అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరికొక్కరు ఇష్టపడ్డారు. 2012 మార్చి 28న ఆదర్శ వివాహం చేసుకున్నారు. నేటికి మూడేళ్లు కావస్తోంది. బుచ్చెమ్మను అప్పలనాయుడు ప్రేమగా చూసుకుంటున్నాడు. బుచ్చెమ్మ త్వరలోనే తల్లికాబోతోంది. బుచ్చెమ్మకు ఏంకావాలన్నా అప్పలనాయుడు దగ్గరుండి మరీ చూసుకుంటాడు. కాలు కిందమోపనీయకుండా జాగ్రత్తగా తోడ్కొని వెళ్తున్నాడు. అత్తమ్మ, ఆడపడుచులు అమ్మ, అక్కళ్లా చూస్తున్నారని బుచ్చెమ్మ ఆనందంగా చెప్పింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమ వివాహాలు జీవితంలో మధురానుభూతులను నిలుపుతాయని ఈ సందర్భంగా అప్పలనాయుడు, బుచ్చెమ్మ దంపతులు తెలిపారు. ప్రేమ ఎంత మధురం! విశాఖపట్నం-కల్చరల్: ప్రేమ యాత్రలో రజతోత్సవం జరుపుకున్నారు వారు. ఇంకా నిత్య ప్రేమికులుగానే మెరిసిపోతున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో టెక్నికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బీవీ ప్రసాద్, ఆయన సతీమణి రత్నం 26 ఏళ్ల వైవాహిక జీవితం అన్యోన్య దాంపత్యానికి నిలువుటద్దం. తమ ప్రేమ సాధించుకోవడం కోసం ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబాల మధ్య ఏర్పడ్డ శత్రుత్వం పోయి కలసిమెలసి జీవిస్తున్నారు. ప్రసాద్ మాటల్లో... ప్రేమను సాధించుకోవడం కోసం పెద్దలు ఇష్టపడకపోయినా ఒక్కటయ్యాం. జీవిత సోపానంలో ముళ్లూ పూలూ సమానంగా స్వీకరించి మొక్కవోని ధైర్యంతో బతుకు పోరాటంలో నెగ్గుకొచ్చాం. మా ఇద్దరిది కఠోరమైన పేదరిక జీవితం. చదువుకున్న రోజుల్లోనే మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను విశాఖ పాత ఐటీఐలో ‘డ్రాఫ్ట్స్ మన్ సివిల్’ పూర్తిచేశాను. ఆ ఏడాదిలోనే 1988 మార్చిలో యలమంచిలి హౌసింగ్ కార్పొరేషన్లో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందాను. ఉద్యోగం వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబరు 3న పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత విశాఖపట్నం మునిసిపల్ కార్యాలయంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా ఉద్యోగం వరించింది. మాకిద్దరు పిల్లలు. బాబు విద్యాసాగర్ ఏయూలో ఎంటెక్ సివిల్, పాప సంగీత మెడిసిన్ పూర్తి చేసింది. నా భార్యను సంతోష పెట్టడం కోసం సర్‘ప్రైజ్’ చేస్తుంటాను. గత ఏడాది డిసెంబర్ 3న పెళ్లిరోజు గిఫ్ట్‌గా ప్లాట్ టీవీ తీసుకొచ్చి సంతోషపరిచాను. ప్రేమకు వయసు లేదు. ప్రేమకు రాజు పేద తేడా లేదు. కావలసిందల్లా ప్రేమించే మనసే. అనురాగ దీపం నర్సీపట్నం: ప్రేమించి వివాహం చేసుకుని పిల్లా పాపలతో వైద్యులు రాయపురెడ్డి శ్రీనివాసరావు, శ్రీదేవి సంతోషంగా జీవిస్తున్నారు. తమ ప్రేమకు పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక అదృష్టమంటున్నారు. వేరు వేరు ప్రాంతాలకు చెందినప్పటికీ...చదువు రీత్యా ఒకే కళాశాలలో చేరారు. శ్రీనివాసరావుకు జూనియర్ అయిన శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వైద్య విద్య అనంతరం పెద్దల సహకారంతో వివాహం చేసుకుని, నర్సీపట్నంలో శ్రీనివాస క్లినిక్ ఏర్పాటు చేసి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆ మధురమైన జ్ఞాపకాలు మరవలేమని భార్యభర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామమైన జోగంపేట ప్రతి రోజు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎటువంటి కలతలు లేకుండా సాఫీగా తమ జీవితం సాగుతుందని దంపతులు ఇద్దరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెలైనా.. చీకటైనా.. మాడుగుల: సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటేనే అన్యోన్య దాంపత్యం. కులాంతర వివాహాలు చేసుకోవడానికి సాధారణంగా తల్లిదండ్రులు, కుల పెద్దలు ఒప్పుకోరు. వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్న సగానికిపైగా దంపతుల మధ్య కలహాలు చెలరేగుతున్నాయి. కానీ మోదమాంబ కాలనీకి చెందిన సీరామంతులు వాసు, అదే కాలనీకి చెందిన జ్యోతీ రాణీ 19 ఏళ్లుగా తోడూ నీడగా జీవిస్తున్నారు. కులాంతర వివాహమని పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు సహకరించక నానా అవస్థలు పడ్డారు. విధి వక్రించి అనుకోకుండా రాణీకి ఆరోగ్యం బాగులేక ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో ఇరువర్గాల బంధువులు వీరిని విడదీయాలని చాలా యత్నించారు. ఎవరూ వీరికి సహకరించలేదు. ఒంటరి వాళ్లయిపోయారు. ఈ సమయంలో వాసు కష్టపడి రాణీకి సేవలందించి బతికించుకున్నారు. ఇద్దరు కష్టపడి చెరొక పని చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ స్వంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. వెన్నెలైనా చీకటైనా ఒక్కటిగా నిలచి నలుగురికీ ఆదర్శంగా జీవిస్తున్నారు. -
వైఎస్ జగన్ నాకు సర్వస్వం
కావలి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సర్వస్వం అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఎప్పటికీ తాను వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటానన్నారు. వ్యక్తిగత పర్యటనకు అమెరికాకు వెళ్లినప్పుడు ఎల్లో మీడి యా తోక పత్రిక తాను టీడీపీలో చేరుతున్నట్లు విషపు రాతలు రాసిందన్నారు. అది తెలిసి తాను ఎంతో బాధపడ్డానన్నారు. ఇలాంటి విషపు రాతలను రాస్తే ఏ తోక పత్రికను తాను ఊరికే వదలనన్నారు. పత్రికపై, రాసిన జర్నలిస్టులపై న్యాయపరమైన చర్యలను తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కాని కలుస్తానన్నారు. తెలుగు తమ్ముళ్లకేనా మంత్రులు ఇప్పుడున్న రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రజలకు కాకుండా తెలుగు తమ్ముళ్లకు మంత్రులుగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కావలి కాలువకు నీరిస్తానని జిల్లాకు చెందిన మంత్రి నారాయణ హామీ ఇచ్చారని, కానీ తరువాత నియోజకవర్గంలోని టీడీపీ నేతల మాటలు విని హామీని విస్మరించారని దుయ్యబట్టారు. తాను మొదటి నుంచి కావలి కాలువ రైతులు గత సీజన్లో పడిన సాగునీటి ఇబ్బందులను జిల్లా అధికారులకు చెబుతూనే ఉన్నానన్నారు. ఐఏబీ సమావేశంలో కూడా జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువచ్చానన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కనీసం స్పందించడం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు నిధులు ఉన్నాయో లేవో తెలియకుండా వివిధ అభివృద్ధి పథకాలకు ఇష్టానుసారంగా శంకుస్థాపనలు చేశారన్నారు. సాగు నీటి కోసం దీక్షలు చేద్దాం రండి కావలి కాలువ ఆయకట్టు పొలాలకు సాగునీటి సరఫరా చేయాలని, దీని కోసం తాను ఆమరణ దీక్షకైనా సిద్ధమని, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కూడా తన కలిసి రావాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇకనైనా రైతాంగం కోసం కలిసి పనిచేద్దామన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పందిటి కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, పొనుగోటి అనురాధ, చీదెళ్ల కిషోర్‌గుప్తా తదితరులు ఉన్నారు.