ఆటోలో ప్రపంచం!
విజ్ఞానాన్ని పంచాలంటే విద్యావంతులే కావాలా? సమాజాన్ని మార్చాలంటే సంఘ సంస్కర్తలే రావాలా? పదిమందికి జ్ఞానాన్ని నింపేందుకు పనిమానేసుకొని తిరగాలా? అక్కరలేదంటున్నాడు అబ్దుల్. ఓ ఆటో డ్రైవర్ కూడా ఈ పనులన్నీ చేయగలడని నిరూపిస్తున్నాడు. ఎలాగో ఓసారి మీరే స్వయంగా తిలకించండి...
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిపేరు అబ్దుల్. బెంగళూరులో ఫేమస్ ఆటోడ్రైవర్. అంత ఫేమస్సెందుకంటే.. ఈయన ఆటోని ఒక్కసారి ఎక్కితేచాలు ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. చూడ్డానికి బయటకు ఆటోలానే కనిపిస్తున్నా ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కదులుతున్న ఎన్‌సైక్లోపీడియా. జాతీయ నాయకుల జయంతి-వర్ధంతి, ఏ నెలలో ఎన్ని రోజులుంటాయి వంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి వరకట్నం తీసుకోవడం, భ్రూణహత్యలు పాపం, స్త్రీలను గౌరవించాలి, నిర్భయ చట్టం ఏం చెబుతోంది?
వంటి ఎన్నో విషయాలపై మనకు ఓ అవగాహన వస్తుంది. ఎందుకంటే అతని ఆటో ఇంటీరియర్ అంతా వీటితోనే నిండిపోయి ఉంటుంది. అంతేనా... ఆటోలో ఎక్కిన ప్రయాణికుల అభిరుచులను ఇట్టే గుర్తుపట్టేసి, వారికి వినసొంపైన పాటలను కూడా వినిపిస్తాడు అబ్దుల్. అంటే ఈ ఆటో ఒక్కసారి ఎక్కితే విజ్ఞానం, వినోదం మన సొంతమన్నమాట.