ఒకరికి ఒకరు | Today is Valentine's Day | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒకరు

Published Sat, Feb 14 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

ఒకరికి ఒకరు

ఒకరికి ఒకరు

చూపున్న ప్రేమ

గోపాలపట్నం: ప్రేమంటే క్షణికావేశం... ప్రేమ పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చట... ఇది కాదు ప్రేమంటే. ఒకే మనసు.. ఒకే మాట.. ఒకే బాట.. ఇదీ అసలయిన ప్రేమ. దీనికి అసలు సిసలయిన నిర్వచనం చెబుతూ మూడు వసంతాలు ముందుకు సాగిపోయారు పలికెల రాము, లక్ష్మీబాయి దంపతులు. వయసులో ఉన్నపుడు ఇష్టపడ్డా తర్వాత భర్త అంధుడయ్యాడని దిగులు చెందకుండా తాను రాములో సగమై లక్ష్మీబాయి కుటుంబానికి వెన్నుదన్నయ్యారు. గోపాలపట్నంలో డార్విన్ ఎలక్ట్రానిక్స్ పేరు వినని వారుండరు. దీన్ని పలికెల రాము, లక్ష్మీబాయి దంపతులు నిర్వహిస్తున్నారు. మెట్రిక్యులేషన్ చదివి ట్యూషన్లు చెప్పుకుంటున్న రాము లక్ష్మీబాయిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి 1983లో పెళ్లి చేసుకున్నారు. రేడియో మెకానిక్‌గా శిక్షణపొంది డార్విన్ మెకానిక్ షాపు ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తూ ఇతనికి గ్లకోమా వచ్చి కంటి చూపు అంచెలంచెలుగా కోల్పోయింది. దీంతో భార్యకు రేడియో మెకానిక్ శిక్షణ ఇచ్చారు. ఇలా కాలక్రమంలో రాము పూర్తిగా అంధుడయ్యారు. అప్పటి నుంచీ లక్ష్మీబాయే సర్వస్వమయింది. జీవితభాగస్వామికి అసలయిన నిర్వచనంగా నిలిచింది. తాను భర్త వద్ద నేర్చుకున్న మెకానిక్ విద్యే ఇపుడు కుటుంబాన్ని నెట్టుకెళ్తోంది. పెద్దవాళ్లయిన కొడుకు సుమంత్, కూతురు స్నేహితకు పెళ్లిళ్లు కూడా చేశారు. ‘ఒకరినొకరు ఆకళింపు చేసుకుని ఒకే బాటలో ముందుకు సాగితే ప్రేమ బంధం శాశ్వతంగా ఉంటుందంటారు రాము, లక్ష్మీబాయి.                         
 
ప్రేమ జంటలకు పెద్ద దిక్కు

యలమంచిలి: ప్రేమికుల పాలిట ఆమె ఆశాదీపం.. ఒక ధైర్యం.. గట్టి నమ్మకం... ప్రేమ పేరుతో ఆడపిల్లలను నమ్మించి, మోసం చేసే వారి పాలిట ఆమె సింహస్వప్నం. అవతలివాడు ఎంతటి వాడైనా సరే, మెడలు వంచి ప్రేమించిన పిల్ల మెడలో తాళి కట్టించి న్యాయం చేయగల దమ్మున్న మహిళ.. ఆమె పేరే పెదపల్లి లక్ష్మి. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లి గ్రామానికి చెందిన ఈమె అసలు పేరు బొద్దపు లక్ష్మి. మోసపోయిన యువతులకు అండగా ఉండి, గ్రామానికే ఒక గుర్తింపు తెచ్చేలా పెదపల్లి లక్ష్మిగా గుర్తింపు పొందుతున్నారు. పెదపల్లి ఎంపీటీసీగా సేవలందించారు. రెండు దశాబ్దాల కాలంలో రమారమి 234 ప్రేమ పెళ్లిళ్లను తోటి మహిళా మండలి ప్రతినిధుల సహకారంతో ఆమె చేయించారు. పెద్దగా చదువుకోకపోయినా ఆమె తెలుగుతోపాటు హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే పలు కంపెనీల్లో పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ఆడపిల్లలను ప్రేమ పేరుతో మోసగించి, ఆ తర్వాత పరారైతే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి అక్కడ వాదించి మోసగించిన యువకులను యలమంచిలికి లాక్కురాగల సమర్ధురాలిగా పేరు సంపాదించుకున్నారు. గత పదేళ్ల నుంచి ప్రేమపెళ్లిళ్లను దగ్గరుండి ఆలయాల్లో జరిపించడమే గాకుండా, ఆ జంటలకు చట్టబద్ధత కల్పించేలా రిజిస్ట్రేషన్ పనులను కూడా తాను చేయిస్తుంటారు. ఈమె స్పూర్తి, ప్రేరణతో ఒకటైన ఎన్నో జంటలు నేడు ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాయి.          
 
అతడే ఆమెకు సర్వస్వం

టి.అర్జాపురం (రావికమతం): అసలైన ప్రేమికులంటే వారే. అన్యోన్యతకు మారుపేరుగా నిలిచారు. అర్థం చేసుకునే మనసుంటే అంగవైకల్యం ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు. టి.అర్జాపురం గ్రామానికి చెందిన మత్స బుచ్చెమ్మ సాక్షరభారత్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు మంచి మనసు ఇచ్చిన ఆ దేముడు ఆమె కాళ్లు మాత్రం చిన్నవి చేశాడు. దీంతో బుచ్చెమ్మ మూడడుగుల ఎత్తే ఉంటుంది. వికలాంగురాలైనా ఆమె మనోధైర్యంతో తన పనులు తాను చేస్తూనే పలువురికి మంచిబుద్ధులు చెబుతుంటుంది. అదే గ్రామానికి చెందిన రాజాన అప్పలనాయుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. బుచ్చెమ్మ మంచి మనస్సును అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరికొక్కరు  ఇష్టపడ్డారు. 2012 మార్చి 28న ఆదర్శ వివాహం చేసుకున్నారు. నేటికి మూడేళ్లు కావస్తోంది. బుచ్చెమ్మను అప్పలనాయుడు ప్రేమగా చూసుకుంటున్నాడు. బుచ్చెమ్మ త్వరలోనే తల్లికాబోతోంది. బుచ్చెమ్మకు ఏంకావాలన్నా అప్పలనాయుడు దగ్గరుండి మరీ చూసుకుంటాడు. కాలు కిందమోపనీయకుండా జాగ్రత్తగా తోడ్కొని వెళ్తున్నాడు. అత్తమ్మ, ఆడపడుచులు అమ్మ, అక్కళ్లా చూస్తున్నారని బుచ్చెమ్మ ఆనందంగా చెప్పింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమ వివాహాలు జీవితంలో మధురానుభూతులను నిలుపుతాయని ఈ సందర్భంగా అప్పలనాయుడు, బుచ్చెమ్మ దంపతులు తెలిపారు.             
 
ప్రేమ ఎంత మధురం!

విశాఖపట్నం-కల్చరల్: ప్రేమ యాత్రలో రజతోత్సవం జరుపుకున్నారు వారు. ఇంకా నిత్య ప్రేమికులుగానే మెరిసిపోతున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో టెక్నికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బీవీ ప్రసాద్, ఆయన సతీమణి రత్నం 26 ఏళ్ల వైవాహిక జీవితం అన్యోన్య దాంపత్యానికి నిలువుటద్దం. తమ ప్రేమ సాధించుకోవడం కోసం ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబాల మధ్య ఏర్పడ్డ శత్రుత్వం పోయి కలసిమెలసి జీవిస్తున్నారు. ప్రసాద్ మాటల్లో...

ప్రేమను సాధించుకోవడం కోసం పెద్దలు ఇష్టపడకపోయినా ఒక్కటయ్యాం. జీవిత సోపానంలో ముళ్లూ పూలూ సమానంగా స్వీకరించి మొక్కవోని ధైర్యంతో బతుకు పోరాటంలో నెగ్గుకొచ్చాం. మా ఇద్దరిది కఠోరమైన పేదరిక జీవితం. చదువుకున్న రోజుల్లోనే మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను విశాఖ పాత ఐటీఐలో ‘డ్రాఫ్ట్స్ మన్ సివిల్’ పూర్తిచేశాను. ఆ ఏడాదిలోనే 1988 మార్చిలో యలమంచిలి హౌసింగ్ కార్పొరేషన్‌లో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందాను. ఉద్యోగం వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబరు 3న పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత విశాఖపట్నం మునిసిపల్ కార్యాలయంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా ఉద్యోగం వరించింది. మాకిద్దరు పిల్లలు. బాబు విద్యాసాగర్ ఏయూలో ఎంటెక్ సివిల్, పాప సంగీత మెడిసిన్ పూర్తి చేసింది. నా భార్యను సంతోష పెట్టడం కోసం సర్‌‘ప్రైజ్’ చేస్తుంటాను. గత ఏడాది డిసెంబర్ 3న పెళ్లిరోజు గిఫ్ట్‌గా ప్లాట్ టీవీ తీసుకొచ్చి సంతోషపరిచాను. ప్రేమకు వయసు లేదు. ప్రేమకు రాజు పేద తేడా లేదు. కావలసిందల్లా ప్రేమించే మనసే.   
 
అనురాగ దీపం

నర్సీపట్నం: ప్రేమించి వివాహం చేసుకుని పిల్లా పాపలతో వైద్యులు రాయపురెడ్డి శ్రీనివాసరావు, శ్రీదేవి సంతోషంగా జీవిస్తున్నారు. తమ ప్రేమకు పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక అదృష్టమంటున్నారు. వేరు వేరు ప్రాంతాలకు చెందినప్పటికీ...చదువు రీత్యా ఒకే కళాశాలలో చేరారు. శ్రీనివాసరావుకు జూనియర్ అయిన శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వైద్య విద్య అనంతరం పెద్దల సహకారంతో వివాహం చేసుకుని, నర్సీపట్నంలో శ్రీనివాస క్లినిక్ ఏర్పాటు చేసి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆ మధురమైన జ్ఞాపకాలు మరవలేమని భార్యభర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామమైన జోగంపేట ప్రతి రోజు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎటువంటి కలతలు లేకుండా సాఫీగా తమ జీవితం సాగుతుందని దంపతులు ఇద్దరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
వెన్నెలైనా.. చీకటైనా..

మాడుగుల: సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటేనే అన్యోన్య దాంపత్యం. కులాంతర వివాహాలు చేసుకోవడానికి సాధారణంగా తల్లిదండ్రులు, కుల పెద్దలు ఒప్పుకోరు. వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్న సగానికిపైగా దంపతుల మధ్య కలహాలు చెలరేగుతున్నాయి. కానీ మోదమాంబ కాలనీకి చెందిన సీరామంతులు వాసు, అదే కాలనీకి చెందిన జ్యోతీ రాణీ 19 ఏళ్లుగా తోడూ నీడగా జీవిస్తున్నారు. కులాంతర వివాహమని పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు సహకరించక నానా అవస్థలు పడ్డారు. విధి వక్రించి అనుకోకుండా రాణీకి ఆరోగ్యం బాగులేక ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో ఇరువర్గాల బంధువులు వీరిని విడదీయాలని చాలా యత్నించారు. ఎవరూ వీరికి సహకరించలేదు. ఒంటరి వాళ్లయిపోయారు. ఈ సమయంలో వాసు కష్టపడి రాణీకి సేవలందించి బతికించుకున్నారు. ఇద్దరు కష్టపడి చెరొక పని చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ స్వంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. వెన్నెలైనా చీకటైనా ఒక్కటిగా నిలచి నలుగురికీ ఆదర్శంగా జీవిస్తున్నారు.                                   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement