వైఎస్ జగన్ నాకు సర్వస్వం | YS Jagan everything to me | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ నాకు సర్వస్వం

Published Wed, Jan 21 2015 1:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ నాకు సర్వస్వం - Sakshi

వైఎస్ జగన్ నాకు సర్వస్వం

కావలి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు సర్వస్వం అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఎప్పటికీ తాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానన్నారు. వ్యక్తిగత పర్యటనకు అమెరికాకు వెళ్లినప్పుడు ఎల్లో మీడి యా తోక పత్రిక తాను టీడీపీలో చేరుతున్నట్లు విషపు రాతలు రాసిందన్నారు.

అది తెలిసి తాను ఎంతో బాధపడ్డానన్నారు. ఇలాంటి విషపు రాతలను రాస్తే ఏ తోక పత్రికను తాను ఊరికే వదలనన్నారు. పత్రికపై, రాసిన జర్నలిస్టులపై న్యాయపరమైన చర్యలను తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కాని కలుస్తానన్నారు.  
 
తెలుగు తమ్ముళ్లకేనా మంత్రులు
ఇప్పుడున్న రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రజలకు కాకుండా తెలుగు తమ్ముళ్లకు మంత్రులుగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కావలి కాలువకు నీరిస్తానని జిల్లాకు చెందిన మంత్రి నారాయణ హామీ ఇచ్చారని, కానీ తరువాత నియోజకవర్గంలోని టీడీపీ నేతల మాటలు విని హామీని విస్మరించారని దుయ్యబట్టారు. తాను మొదటి నుంచి కావలి కాలువ రైతులు గత సీజన్‌లో పడిన సాగునీటి ఇబ్బందులను జిల్లా అధికారులకు చెబుతూనే ఉన్నానన్నారు.

ఐఏబీ సమావేశంలో కూడా జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువచ్చానన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కనీసం స్పందించడం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు నిధులు ఉన్నాయో లేవో తెలియకుండా వివిధ అభివృద్ధి పథకాలకు ఇష్టానుసారంగా శంకుస్థాపనలు చేశారన్నారు.   
 
సాగు నీటి కోసం దీక్షలు చేద్దాం రండి
కావలి కాలువ ఆయకట్టు పొలాలకు సాగునీటి సరఫరా చేయాలని, దీని కోసం తాను ఆమరణ దీక్షకైనా సిద్ధమని, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కూడా తన కలిసి రావాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇకనైనా రైతాంగం కోసం కలిసి పనిచేద్దామన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి,  పందిటి కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, పొనుగోటి అనురాధ, చీదెళ్ల కిషోర్‌గుప్తా తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement